Friday, March 29, 2024

పవర్‌ఫుల్ డే

- Advertisement -
- Advertisement -

 electricity demand

 

శుక్రవారం ఒక్కరోజే 13,168 మెగావాట్ల విద్యుత్ డిమాండ్

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా శుక్రవారం(నిన్నటి రోజు) 13,168 మెగావాట్లు అత్యధిక విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. 23 జిల్లాలు కలిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే 2014 మార్చి 23న 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చింది. ఈ విధంగా గతంలో ఏనాడూ కనిపించని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లేనంతగా విద్యుత్ డిమాండ్ ఏర్పడటంపై విద్యుత్ అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైంది. తెలంగాణ విద్యుత్ శాఖ మరో రెండు అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. ఒకటి విద్యుత్ డిమాండ్, మరోటి చరిత్రలో ఎన్నడూ లేనంతగా తలసరి విద్యుత్ వినియోగం నమోదైంది. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిమాండ్ ఏర్పడినప్పటికీ ఎక్కడా కూడా ఏమాత్రం కరెంటు కోత లేకుండా, లోటు ఏర్పడకుండా విద్యుత్ సంస్థలు కరెంటును సరఫరా చేస్తున్నాయి.

44 శాతం అధిక విద్యుత్ వినియోగం…
గత ఏడాది ఇదే రోజు తెలంగాణలో గరిష్ట డిమాండ్ 9,770 నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 34 శాతం అధిక డిమాండ్ వచ్చింది. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా, ఎత్తిపోతల పథకాల నిర్వహణ, పరిశ్రమల సంఖ్య పెరగడం తదితర కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో అధిక డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఎస్.పి.డి.సి.ఎల్, ఎన్.పి.డి.సి.ఎల్. పరిధిలోని తెలంగాణ ప్రాంతంలో 5,661 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. తెలంగాణ వచ్చిన నాటి పరిస్థితితో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన డిమాండ్ 132.6 శాతం అధికం. దేశ సగటును మించిన విద్యుత్ వినియోగం
తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట డిమాండ్ తో పాటు విద్యుత్ వినియోగం కూడా అంతకంతకూ పెరుగుతున్నది.

2014లో తెలంగాణ రాష్ట్రంలో 47,338 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా, 2018_-19 సంవత్సరంలో 68,147 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 44 శాతం అధిక విద్యుత్ వినియోగం జరిగింది. ఇదే సమయంలో దేశ సగటు 23 శాతంగా మాత్రమే నమోదైంది. విశ్వవ్యాప్తంగా ప్రగతి సూచికలుగా (indicators) గుర్తించే అంశాల్లో తలసరి విద్యుత్ వినియోగం ఒకటి. ఈ అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశ సగటును మించింది. దేశ వ్యాప్తంగా సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,181 మెగావాట్లు కాగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 1,896 మెగావాట్లు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 1,356 మెగావాట్లుంటే, ఆరేళ్లలో 39.82 శాతం పెరిగింది.

డిమాండ్ పెరగడానికి ముఖ్య కారణాలు
తెలంగాణ వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక విప్లవాత్మక విధాన నిర్ణయాల వల్ల విద్యుత్ వినియోగం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి ముందు వ్యవసాయానికి నాలుగైదు గంటలకు మించి విద్యుత్ సరఫరా ఉండేది కాదు. కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన 9 నెలల వ్యవధిలోనే వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అందించారు. 2018 జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంపుసెట్లకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నది. తెలంగాణలో 2014 జూన్ 2కు ముందు 2 వేల మెగావాట్లకు మించి వ్యవసాయ డిమాండ్ ఉండేది కాదు. కానీ నేడు రాష్ట్రంలో ఎత్తిపోతలతో కలుపుకుని వ్యవసాయానికి 6 వేల మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 19,02,754 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లు ఉంటే, నేడు రాష్ట్రంలో 24,31,056 కనెక్షన్‌లు ఉన్నాయి.

2014లో ఎత్తిపోతల పథకాలకు కేవలం 680 మెగావాట్ల డిమాండ్ మాత్రమే ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన భారీ నీటి పారుదల పథకాల ఫలితంగా పంపుహౌజుల నిర్వహణకు ప్రస్తుతం 2,200 మెగావాట్ల విద్యుత్తు అవసరం ఏర్పడుతుంది. -తెలంగాణ ఏర్పాటుకు ముందు పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటిస్తే, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో పాటు రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతుండడం వల్ల వ్యాపార, వాణిజ్య కనెక్షన్లు కూడా పెరిగాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కొత్త విద్యుత్ కనెక్షన్ల వృద్ధి రేటు అధికంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మొత్తం విద్యుత్ కనెక్షన్లు 1,11,19,990 ఉంటే, నేడు రాష్ట్రంలో 1,54,14,451 కనెక్షున్నాయి. తెలంగాణ వచ్చిన నాటితో పోలిస్తే 38.61 శాతం అధికంగా కనెక్షన్లున్నాయి.

సిఎం కెసిఆర్ మార్గదర్శకం, సిబ్బంది కృషి : సిఎండి ప్రభాకర్ రావు
తెలంగాణ ప్రారంభంలో తీవ్ర సంక్షోభంతో ఉన్న విద్యుత్ సంస్థల పరిస్థితి నేడు ఇంత గొప్పగా తయారు కావడం ఒక్కరోజులో జరిగిన అద్బుతం కాదని, దీని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకం, అనుక్షణం పర్యవేక్షణ, విద్యుత్ సంస్థల ఉద్యోగుల అవిశ్రాంత కృషి ఉన్నదని జెన్ కో,- ట్రాన్స్ కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్ రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన డిమాండుకు మించి తెలంగాణలో డిమాండ్ ఏర్పడటం, దానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయడం సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తున్నదని ఆయన చెప్పారు.

ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ రావడానికి, సమర్థ వంతంగా సరఫరా జరగడానికి ప్రణాళికా బద్ధమైన ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థల్లో తెచ్చిన మార్పులే కారణమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాడు కేవలం 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉండేదని, కానీ నేడు 16,246 మెగావాట్లు అందుబాటులో ఉందన్నారు. నాడు కేవలం 74 మెగావాట్ల సోలార్ విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంటే, నేడు 3,650 మెగావాట్ల సోలార్ సామర్థ్యం ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన నాడు 233 సబ్ స్టేషన్లుంటే, నేడు 347 సబ్ స్టేషన్లున్నాయన్నారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కలను నిజం చేస్తామన్నారు.

Telangana state has highest electricity demand
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News