Home దునియా రంగసాని

రంగసాని

                   Story-by-kaluva-mallaiah

ఊళ్ళె దవ్వదవ్వ నడుత్తండు నర్సయ్య పటేలు. నర్సయ్యంటవు మల్ల పటేలంటవేంది అని అడుగుతరని నాకెరికే. గాల్లు చిటాటి కాపోల్లు. అంటె రెడ్లల్లనే వేరే తెగన్నట్టు. రెడ్లల్ల ఒక్క మొటాటి కాపోల్లే ఎనుక రెడ్డి పేరు పెట్టుకునేటోల్లు. మిగతా కాపోల్లంత అయ్యలనే పేర్లు పెట్టుకుందురు. అయితె ససంత్రమచ్చినంక కొంతమంది సదువుకునుడు మొదలువెట్టినంక కాపోల్లు గూడ తెలివికచ్చిండ్రు. పైసలల్ల కొంచెం మంచిగయినంక గాల్లుగూడ రెడ్లని పెట్టుకోవట్టిండ్రు. గందుకే మా ఊళ్ళెగాని, ఇంక సాన ఊళ్ళల్ల కాపోల్లల్ల తండ్రుల పేర్లు మల్లయ్య, ఎల్లయ్యనే ఉంటయి. కొడుకుల పేర్లేమొ మల్రెడ్డి, ఎల్రెడ్డి పేర్లు పెట్టుకున్నరు. ఒక్క మున్నూరు కాపోల్లే గట్ల రెడ్డిపేర్లు పెట్టుకుంటలేరు. గీల్లు రావులని పెట్టుకుంటండ్రు. అంటె ఊళ్ళళ్ళ ఎలుమోల్లు, కర్నపోల్లు, కొందరు కాపో ల్లు, ఎల్లాపోల్లు రావులని పెట్టుకుంటున్నరన్నట్టు. ఏసు మతం దీసుకున్న మాలమాదిగోల్లు గూడ ఆనందరావు, సాల్మన్‌రాజు అని పేర్లు వెట్టుకుంటండ్రు. పేర్ల ఏముందని షేక్స్‌పియర్ మా అన్నడు గని పేర్లతోని కులాలు తెల్సేటియి. గిప్పుడయితె అందరు అయ్యలు, అమ్మలు పేర్లిడిసిపెట్టి కొత్తకొత్త సంస్కృతపు పేర్లు పెట్టుకుంటండ్రు.

అయితె మానెగని గా కాపోల్ల నర్సయ్య పటేల్ దగ్గెర మొదలువెట్టి ఏడికోపోతిమి. గయినె మునుపటి పట్వారింటి దిక్కు నడుత్తండు. గయినెంబడి ఇద్దరు ముగ్గు పోరగాండ్లు గూడున్నరు. పట్వారి ఎంకటేశ్వర రావిల్లు జూసెవరకు గయినెకు కండ్లపొంటి నీల్లచ్చినట్టయినయి. అంత పాడు వడిపోయింది. దీపం బెట్ట దిక్కులేకుంటయింది. అంత దుబ్బ గొట్లాడుతంది. అది దాటి దగ్గెర్లున్న ఆంజనేయ సామి దగ్గెరికి పాయె. గా సామికి దండంబెట్టి గాన్నే కూసున్నరు. ఊళ్ళున్నది గదొక్క విగ్రహమే రామప్ప గుడి చెరువుకట్ట కున్నదిగని దూరమాయె. గాడికి చేను చెలిక పనికివోయెటోల్లే పోతరు. గా శివ రాత్రి నాడు భజనలు సేసుకుంటపోతరు.కొబ్బరికాయ గొట్టినా, ఫలారం పంచిపెట్టినా గీ ఆంజనేయుని దగ్గెర్నే సేత్తరు. నర్సయ్య గాడ కూసునేవరకు అయినెతోనచ్చినోల్లు కూసున్నరు. ఇంకో ఇద్దరు ముగ్గురచ్చి గాడ కూలవడిరి. ఐదారుగురురాయెవారకు ఇగ ముచ్చట్లు మొదలాయె. ఓ నర్సయ్య తాతా! గా పట్వారి ఇంటి దగ్గెరి కచ్చెవరకు నీ మొఖం మాడిపెయింది.

పక్కనున్న ఇల్లు జూసి గిండ్ల రంగమ్మ ఉండేదంటివి ఎనుకట భోగమోల్లని ఉంటరని నువ్వు సానసార్లు జెప్పినవు. గా కతేందో సెప్పలేవు. గా భోగం రంగసాని కత జెప్పు అనడిగె పోరడు. సర్గానికి పెయినా సవితిపోరు తప్పదన్నట్టు ఊకె కతలే నార! అన్నమోలె కతలు కడుపులుంచుకుంటె ఉబ్బుతదని నువ్వే అన్నవు. ఏదయిన బైటికి ఎల్లగక్కుతేనే మంచిది గద. సెప్పు అన్నమోలె నాగ్గూడ సెప్పన్ననే ఉందిర. గిటు గుడికాడి కచ్చినప్పుడల్ల నాకు గా రంగమ్మ, గా పాత పట్వారి యాదికత్తరు. ఎనుకటి సంగుతులు యాదికత్తయి. గవ్వి మంచియని నేనన గని గప్పుడు గట్లుండె. గా కత జెప్పుత పటు అని కాండ్రికిచ్చి ఊంచి కత జెప్పవట్టిండు నర్సయ్య పటేలు. ఇగ మనం అచ్చెటప్పుడు సూసినం గద పాడువడ్డ ఇల్లు. గదే పట్వారి పంతులిల్లు. గప్పట్ల గిది పెద్ద ఇల్లన్నట్టే. కచ్చీరిల్లు. మూడిండ్ల భవంతి. బువ్వండుకునేందుకు పెద్దిల్లు. పక్కన ఎడ్లబండి, ఎవుసం సామాను పెట్టుకుంటానికి ఇల్లు. గయినె ఊరికి పట్వారన్నట్టు. పట్వారంటె గీనెకు సొంత వతమే గాదు. పెద్దపెల్లి దేశ్‌ముఖ్ దగ్గెర వతనుండె. గయినె తన ఇష్టమున్నోల్లకు పట్వారి తనమిచ్చెటోడు. గా పెద్దపెల్లి దేశ్‌ముఖ్‌కు ఎవ్వలిచ్చిండ్రంటె ఎనుకట నైజాం నవాబన్నట్టు.

రాగిసన్నట్ మీద రాసిచ్చిండట. గీ పట్వారయితె గీనెకింద ఓ మాలిపటేలుంటడు. గయినె గీనె కలిసి పట్వారిలెక్కలు ఊళ్ళె పన్నులు వసూలు జేసెటోల్లు. సర్కారుకు అప్పజెప్పెటోల్లు. పోలీసు పటేలు గూడుండె. గయినె ఊళ్ళెకు కొత్తగ ఎవ్వలచ్చిండ్రు, పోయిండ్రు, జనన మరణాలు గివ్వన్ని జూసెటోడు. ఎవ్వలన్న కొట్లాడుకున్నా, తన్నుకున్నా పోలీసులకు చెప్పెటోడు. ఊళ్ళెగాకుంటె పోలీసు స్టేషన్‌కు తీసుక పోయేటోల్లు. గప్పటికి ఊళ్ళె సదువుకున్నోల్లు తక్కువా యె. గీల్లేం జెప్పితే గదే. గీ వతన్లన్ని ముఖ్యంగ కర్నాలు, రెడ్లు వెలుమలనే ఉండేటియి. తాసీలు వసూలు జేసుట్ల ఎక్వ తీసుకొని తక్వ రసీదు లిచ్చెటోల్లు. గా పట్వారి సాబుకు మస్తు భూములుండె.  కని బర్కత్ లేదు. గప్పట్ల ఊరి దొరలది, పట్వారి, పటేండ్లది. వతన్‌దార్లదే సాగేది. గాల్లు ఏదంటె గదే. గదే శాసనమన్నట్టు. గప్పుడు ఒక్క మనూల్లెనే కాదు సాన ఊళ్ళళ్ళ దొరలు, పట్వార్లు మంచిగ పెండ్లాలుండంగ భోగమోల్ల నుంచుకునేటోల్లు. భోగమొల్లని ప్రత్యేకంగ కులమేన్నుంచి అచ్చిందోగని మనూల్లె గా కులపోల్లు లేరు. అయితే గీ పెత్తందార్లు, దొరలు భోగమోల్లు ఊళ్ళె లేకున్నా ఎవ్వలనో తక్వ కులపోల్లను ఉంచుకునెటోల్లు. మనూల్లె గంతన్నాలం లేదుగని కొన్నూలల్లనయితె దగ్గెరికి పంపాలె. అటెనుకనే కాల్లగోల్లు. పాపం తక్వ కులపోల్ల శీలాలు ఫలారమయ్యేటియి.

గీ పట్వారి గూడ ఒగామెనుంచుకున్నడు. గామె సేరు గంగమ్మ. బక్కగ ముద్దుగుండేది. తెల్లగ ముడితె మాసిపోయెటట్టుండేది. గామెకో సిన్న ఇల్లు గూడ కట్టిచ్చిండు. గామె వాళ్ళింట్ల పనిజెయ్యాలె. అన్ని పనులు జెయ్యాలె. ఒక్క వంటదప్ప అరొక్క పనులు జెయ్యాలె. గామె శీలం అయినెకు పలారం. గయినకే కాదు మనూలేల గట్లున్నదో లేదో కని దొరలిండ్లల్ల ఉంచుకున్న ఆడామెను ఆ ఇంటికచ్చిన మొగోల్ల దగ్గెరికి పంపేదట. మరి గాల్లకు పిల్లలు పుడితె? ఎవ్వలు సాకాలె. గాల్ల కులమేది అంటె గాల్లు దాసీలుగనె ఉండేటోల్లు. దొరలిండ్లల్ల పని జేసుకుంటనే ఉండేటోల్లు. దాసిపని. ఘోరమైన చాకిరి. గా పిల్లలను గూడ మల్ల గా పనికే దింపెటోల్లు. కొందరట్ల జేత్తురు కొందరు సెయ్యక పోదురు. భోగమోల్ల కయితె గదే వృత్తిగ ఉండేది. ఘోరమైన బతుకాల్లది. నిజాం మనుషులత్తె, దేశ్‌ముఖ్ మునుషులత్తె, తాసీలు వసూలు జేసెటోల్లత్తె కల్లు మాంసం విందులతోని, ఆడోల్లను గూడ పాడు జేత్తురు రాజుల కాలంల మొదలయిన గీ భోగం రంగసానిల వృత్తి పనులు ససంత్రమచ్చి ఇరువై ఇరువయైదేండ్ల దాక నడిచింది. గా నగుసలైట్లచ్చినంక గిది బందయింది.

మయూల్లె గంగమ్మ బతుకయితె పలారమైంది. గామెకో బిడ్డగూడ పుట్టింది. గా పిల్ల ఎన్నముద్దోలె ఉండె. గా పిల్లను గీ పాపపు పని సెయ్యనియ్యనని సదివిచ్చిందామె దూరంగున్న ఊర్నుంచి. ఓ పిలగాన్ని తీసుకచ్చి లగ్గంజేసింది. గయినెకు సర్కారు నౌకరిగద! మంచిగనే బతుకుతున్నరు. గట్లనే గయినెకు సర్కారు నౌకరి గద! మంచిగనే బతుకుతున్నరు. గట్లనే ఇంకో పంతులుంచుకున్నామె బిడ్డ గూడ ఇంజనీరుకిచ్చి లగ్గం జేసిండ్రు. గాల్లు అవ్వల్దర్జగ బతుకుతండ్రు. పైలాపచ్చీసు పనులు జేసి ఆడోల్ల బతుకులను నాశినం జేసిన పట్వారికి, గట్ల ఉంచుకొని జీవితాలను ఖరాబు జేసినోల్లకు బతుకులల్ల బరుకతి లేదు. పాపమంటరో ఏమంటరోకని గట్ల జేసిన మనూల్లె కుటుంబాలైతె పేరుకు లేకుంట పెయినయి. సూసినవు గద గా ఇల్లు. ఇప్పుడక్కడ దీపం బెట్టదిక్కులేదు. పిల్లలెక్కడున్నరో తెలువది. పాపం తలిగిందేమొ. గట్లనే మన సుట్టుపక్కలున్న సాన ఊళ్ళళ్ళ గూడ గట్ల జేసినోల్లను నక్సులైట్లు ఊళ్ళెకెళ్ళి ఎల్లగొట్టిండు. ఏదేమైన బిడ్డలార! మా కాలం ఎడ్డికాలం. గిప్పుడు గట్ల జేత్తె ఊకుంటరా? గుడులల్ల దేవదాసీలని ఉండెటోల్లు. గటు ఎములాడదిక్కు, నిజామాబాద్ దిక్కు గవ్వి ఎక్వనట. గవ్వి గూడ గిసోంటియే. గిసోంటియన్ని నాశినం గావాలె. అందరు మంచిగ బతుకాలె కొడుకులార! అన్నమోలె అందరి మనసులు బరువైనయి. ఊళ్ళెనే ఉండకుంటయిన గా మాజీ పట్వారి మీన సానుభూతిజూపన్నో పోతె పెయిండని అనుకోవన్నో గాల్ల కరుతం గాలేదు.

డా॥ కాలువ మల్లయ్య
98493 77578