Home Default డీమ్డ్ యూనివర్శిటీల వైపు వైద్య విద్యార్థుల పరుగులు

డీమ్డ్ యూనివర్శిటీల వైపు వైద్య విద్యార్థుల పరుగులు

 Deemed University

మనతెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ విద్యార్ధులు వైద్య విద్య కోసం డీమ్డ్ యూనివర్శిటీల వైపు పరుగులు తీస్తుండటంతో రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు మిగిలి పోతున్నాయి. ఇక్కడి ప్రైవేటు కాలేజీలతో పోల్చితే డీమ్డ్ యూనివర్శిటిల్లో ఫీజుల వ్యత్యాసం ఎక్కువగా ఉండటం తో విద్యార్ధులు ఆ కాలేజీల బాట పడుతున్నారు. దీంతో రాష్ట్రంలో వివిధ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు గణనీయంగా మిగిలిపోయాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ఏం చేయాలో అర్థంగాక తలలు పట్టుకింటున్నాయి. నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు మూడు కేటగిరీల్లో సీట్లను భర్తీ చేస్తారు. ర్యాంకు ఆధారంగా ‘ఎ’ కేటగిరీలో సీట్లను భర్తీ చేస్తారు. బి కేటగిరీని మేనేజ్‌మెంట్ కోటాగా, సి కేటగిరీని ఎన్‌ఆర్‌ఐ కోటాగా వ్యవహరిస్తుంటారు. తెలంగాణ ప్రభు త్వం మొదటిసారిగా 2018-19 వైద్య విద్యా సంవత్సరం నుంచి నేషనల్ పూల్‌లో చేరింది. దీంతో ఒక్కసారిగా అవకాశాలు పెరిగాయి. మెడికల్ కాలేజీల్లో బి, సి కోటా సీట్ల కు మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ఇటీవల ముగిసిం ది. కౌన్సిలింగ్ నిర్వహించిన బి కేటగిరీలోని 1,005 సీట్లు నిండిపోయాయి. సి కేటగిరి కింద ఉన్న 469 ఎంబిబిఎస్ సీట్లులో 328 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 141 సీట్లు మిగిలిపోయాయి.
సి కేటగిరి కోటా ఎంబిబిఎస్ సీట్లపై విద్యార్థులు అనాసక్తి చూపిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో సి కేటగిరి ఎంబిబిఎస్ కోర్సు ఫీజులు అధికం గా ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నా రు. సాధారణ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అధిక ఫీజులు చెల్లించి ఎంబిబిఎస్ చదవడం కంటే, ఇతర రాష్ట్రాల్లో డీమ్డ్ యూనివర్శిటి కాలేజీల్లో తక్కువ ఫీజుతో చదవడమే మంచిదన్న అభిప్రాయానికి వస్తున్నారు. బి కేటగిరీ ఎంబిబిఎస్ ఫీజు ఏడాదికి రూ. 11.55 లక్షలుంది. కానీ సి కేటగిరి కోటా సీట్ల ఫీజు ఏడాదికి రూ. 23.10 లక్షలు ఉండటంతో వాటిల్లో అనేక సీట్లు మిగిలిపోయాయి. ఫీజు వ్యత్యాసం కారణంగా డీమ్డ్ యూనివర్శిటిల వైపు మొగ్గు చూపిస్తున్నారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే వీటన్నింటి నీ భర్తీ చేస్తుండటంతో అఖిల భారత కోటా సీట్లకు, డీమ్డ్ వర్సిటీల్లోని వైద్య సీట్లకు ఒకే దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఏ కాలేజీకి ఆ కాలేజీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. అంటే 40 డీమ్డ్ కాలేజీలుంటే అన్నింటి కీ దరఖాస్తు చేసుకోవడం కష్టమయ్యేది. నీట్’ పుణ్యమా అని అన్నింటికీ ఒకే దరఖాస్తు, ఒకే కౌన్సిలింగ్ వచ్చింది. పైగా డీమ్డ్ వర్సిటీ హోదా కలిగిన మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలతో సమానమన్న భావన తల్లిదండ్రుల్లో ఉంది. కొన్ని డీమ్డ్ వైద్య కాలేజీలు దేశం వ్యాప్తంగా మంచి ర్యాంకింగ్‌లో ఉన్నాయి. మన ప్రైవేటు మెడికల్ కాలేజీలు డీమ్డ్ వర్సిటీ కాలేజీలకు ఏమాత్రం నాణ్యతలో సరిపడవ న్న భావన వినిపిస్తోంది. పైగా డీమ్డ్ మెడికల్ కాలేజీలు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఎక్కువగా ఉన్నా యి. కాబట్టి అక్కడకు వెళ్లడానికి తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.
ఫీజు సగమే…
డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో సీట్లను కేటగిరీలుగా ఏమీ విభజించలేదు. అన్నింటికీ ఒకే రకమైన ఫీజు వసూలు చేస్తున్నారు. మన ప్రైవేటు కాలేజీల్లో బి కేటగిరీ సీట్ల ఫీజుకు సమానంగా డీమ్డ్ వర్సిటీ మెడికల్ ఫీజులున్నాయి. డీమ్డ్ వర్సిటీలకు చెందిన మెడికల్ కాలేజీల్లో రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్యే ఫీజులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కర్ణాటక రాష్ట్రం మణిపాల్‌లోని డీమ్డ్ వర్సిటీ హోదా కలిగిన కస్తుర్బా మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ ఫీజు ఏడాదికి రూ. 11.24 లక్షలు, అదే రాష్ట్రం కొలార్‌లోని డీమ్డ్ వర్సిటీ హోదా కలిగిన శ్రీదేవరాజ్ యూఆర్‌ఎస్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ ఫీజు రూ. 9 లక్షలు ఉందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు కేడా అంగీకరిస్తున్నాయి. మన రాష్ట్రంలో బి కేటగిరి కోటా ఎంబిబిఎస్ సీటుకు రూ.23.10లక్షలు వరకు ఉంటుం ది. మన రాష్ట్రంలో సి కేటగిరి కోటాలో చేరితే ఐదేళ్లకు కలిపి రూ. 1.15 కోట్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే పైన పేర్కొన్న డీమ్డ్ వర్సిటీల్లో ఐదేళ్లకు కలిపి రూ. 45 లక్షల నుంచి రూ. 60 లక్షల మధ్యే ఉంటుంది. అంటే ఇక్కడ సి కేటగిరి సీటుకు డీమ్డ్ కంటే రెట్టింపు చెల్లించాల్సి వస్తుంది. ఈ పోటీని తట్టుకొనేందుకు రాష్ట్రంలో కొన్ని మెడికల్ కాలేజీలు సి కేటగిరి సీట్ల ఫీజును రూ. 12 లక్షలకు తగ్గించాలని యోచిస్తున్నట్లు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే జరిగితే ఇక్కడి సి కేటగిరి సీట్లు పూర్తిగా భర్తీ అయ్యే అవకాశముంది.

Telangana Students Wants MBBS Study In Deamd University