Home తాజా వార్తలు కేరళలో నోర్కా సంస్థను సందర్శించిన తెలంగాణ బృందం

కేరళలో నోర్కా సంస్థను సందర్శించిన తెలంగాణ బృందం

Telangana team visit Norka Roots office in Kerala

 

నాన్ రెసిడెంట్స్ కేరలైట్స్ అఫైర్స్ అధికారులతో భేటీ

హైదరాబాద్: కేరళ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి వెళ్లిన ఆరుగురు సభ్యుల తెలంగాణ బృందం గురువారం కేరళ రాజధాని తిరువనంతపురంలోని నోర్కా రూట్స్ కార్యాలయాన్ని సందర్శించింది. నాన్ రెసిడెంట్స్ కేరలైట్స్ అఫైర్స్ (నోర్కా రూట్స్) రిక్రూట్‌మెంట్ అధికారి అజిత్ కొల్లాస్సేరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నోర్కా సంస్థ కార్యకలాపాలను వివరించారు. తెలంగాణ బృంద సభ్యులు అడిగినపలు సందేహాలకు సమాధానాలు తెలిపారు. కేరళలోని సెంటర్ ఫర్ ఇండియన్ మైగ్రంట్స్ స్టడీస్ (సిమ్స్) సంస్థ ప్రతినిధులు రఫీక్ రవుతర్, అఖిల్ శంకర్, పార్వతీ దేవి, సీనియర్ జర్నలిస్టు రెజిమోన్ కుట్టప్పన్‌లు ఈ పర్యటనకు సంధానకర్తలుగా వ్యవహరించారు.

కేరళలో పర్యటించిన బృందం ఇచ్చే అధ్యయన నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇటీవలి బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ గల్ఫ్ ప్రవాసి సంఘాల ప్రతినిధులందరూ కేరళ పర్యటనకు వెళ్లినట్లు గల్ఫ్ జెఎసి జగిత్యాల జిల్లా కన్వీనర్ గుగ్గిళ్ల రవిగౌడ్ తెలిపారు. గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వలస కార్మికుల పునరావాస కార్యక్రమాల అమలును పరిశీలిస్తామని, కేరళ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించి ఒక నివేదికను తయారు చేసి తెలంగాణ ప్రభుత్వానికి సమర్పిస్తామని మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్ నంగి దేవేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలోని జగిత్యాల, నిర్మల్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల ప్రతినిధులు గుగ్గిళ్ల రవి గౌడ్, స్వదేశ్ పరికిపండ్ల, నంగి దేవేందర్‌రెడ్డి, పెరుగు మల్లిఖార్జున్, జలిగం కుమారస్వామి, గంగుల మురళీధర్‌రెడ్డి కేరళ సందర్శనకు వెళ్లారు.

Telangana team visited the Norka Roots office in Kerala