Saturday, April 20, 2024

రాష్ట్రానికి 6.50లక్షల డోసులు

- Advertisement -
- Advertisement -

24గం.ల్లో రాష్ట్రానికి 6.50లక్షల డోసులు రాక 
కొవిన్ రిజిస్టర్ అయిన వారిని ప్రజాప్రతినిధులే తీసుకురావాలి
సర్పంచ్‌ల నుంచి మంత్రుల వరకు బాధ్యత వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు

Telangana to get 6.50 lakh doses in 24 hrs

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ 1లో 2,98,424 మంది హెల్త్ కేర్ వర్కర్లు టీకాను పొందనున్నారు. వీరిలో 1,42,706 మంది ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పనిచేసే సిబ్బంది ఉండగా, 1,46,722 మంది ప్రైవేట్ సెక్టార్‌కి చెందిన హెల్త్ వర్కర్లని ఆరోగ్యశాఖ తెలిపింది. వీరంతా ఇప్పటికే కొవిన్ సాప్ట్‌వేర్‌లో ఎన్‌రోల్ అయ్యారు. అయితే ఇప్పటికే పంపిణీ కొరకు వైద్యశాఖ 1213 కేంద్రాలను సిద్ధం చేయగా, వీటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌లోనే 208 సెంటర్లు ఉండటం గమనార్హం. ఈ సెంటర్ల పరిధిలో ఇప్పటికే ఏకంగా 78,226 మంది టీకా కొరకు నమోదు కాగా, వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభ తేది వరకు ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేగాక వ్యాక్సిన్ పంపిణీ కొరకు రాష్ట్ర వ్యాప్తంగా 9720 మంది శిక్షణ కూడా పొందారు. అయితే టీకా నిల్వ కొరకు సెంట్రల్ స్టోరేజ్ కేంద్రంతో పాటు జిల్లాల్లో 866 కోల్డ్ చైన్ పాయింట్లను ఏర్పాటు చేశారు. మరోవైపు వ్యాక్సినేషన్ తర్వాత కూడా లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను యోచిస్తోంది. సిఎం ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రజాప్రతినిధులనూ భాగస్వామ్యం చేయనున్నారు. టీకా తీసుకోవడానికి కొవిన్ సాప్ట్‌వేర్‌లో రిజిస్ట్రర్ అయిన వారిని ప్రాధాన్యత క్రమంలో కేంద్రాలకు తీసుకొచ్చే బాధ్యతను ప్రభుత్వం ప్రజాప్రతినిధులతో పాటు పోలీసులకు అప్పగించింది. గ్రామ స్థాయి సర్పంచ్ దగ్గర్నుంచి మంత్రులు వరకు ఆయా ప్రాంతాల్లో టీకా పంపిణీ సజావుగా జరిగేందుకు కృషి చేయాలని గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారంతా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈక్రమంలో స్థానికంగా ఉండే మెడికల్ ఆఫీసర్ల సలహాలు, సూచనలను కూడా తీసుకుంటున్నారు.
ప్రతి అంశాన్ని కోవిన్ సాప్ట్‌వేర్‌లో ఎన్‌రోల్…
దేశ వ్యాప్తంగా తొలిసారి ఆన్‌లైన్ విధానంలో వ్యాక్సినేషన్ జరగనుంది. ఈనెల 16వ తేదిన అన్ని రాష్ట్రాలతో పాటు మన దగ్గరా వ్యాక్సినేషన్ షురూ అవుతోంది. అయితే లబ్ధిదారుల ఎంపిక వివరాలతో పాటు వారి ఆరోగ్యపరిస్థితిని కూడా అధికారులు కొవిన్ సాప్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకుబోయే వారి వివరాలనూ అధికారులు కోవిన్ సాప్ట్‌వేర్‌లో రికార్డు చేశారు. అయితే ఈ ప్రక్రియంతా పూర్తిగా ఎన్నికల విధానంలో ఉండనుంది. కొవిన్ సాప్ట్‌వేర్‌లో నమోదైన వారికీ ముందుగానే ఏ తేదిలో ఏ కేంద్రంలో వ్యాక్సిన్ ఇస్తారు? ఎవరు ఇస్తారు? అనే పూర్తి వివరాలను అధికారులు మొబైల్‌కి పంపిస్తారు. ఆ సమయాన్ని బట్టి మాత్రమే లబ్ధిదారులు వ్యాక్సిన్ పంపిణీ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. ఇలా కేంద్రానికి చేరుకున్న వారు మొదట రిజిస్ట్రేషన్ కౌంటర్‌కు వెళ్లాలి. అక్కడ ఐడీ కార్డు చూపిన తర్వాత సదరు వ్యక్తి వివరాలను కోవిడ్ సాప్ట్‌వేర్‌లో చెక్ చేస్తారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్ బూత్‌లోకి వెళతారు. ఆ తర్వాత సదరు వ్యక్తిని మెడికల్ టీం 30 నిమిషాలు పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతారు. అనంతరం ఏలాంటి రీయాక్షన్లు లేకపోతే అక్కడ్నుంచి పంపిచేస్తారు.
రియాక్షన్లు వస్తే ఎలాఫిలాక్సిస్ కిట్స్‌తో చెక్…
టీకా తీసుకున్న వారికి ఒకవేళ రీయాక్షన్లు వచ్చినా అక్కడ ఉన్న మెడికల్ టీం వెంటనే స్పందిస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి జ్వరం, స్కీన్ అలర్జీలు, వాంతులు, ఒళ్లునొప్పులు వస్తే వెంటనే వాటి నియంత్రణ మందులను ఇవ్వనున్నారు. ఈమేరకు వివిధ రకాల యంటీడోసులతో కూడిన ఎనాఫిలాక్సిస్ మెడికల్ కిట్‌ను వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాల్లో ఉంచనున్నారు. అయితే రీయాక్షన్లు వచ్చిన వారి వివరాలతో పాటు వారికి ఇచ్చిన మందులు, ఆరోగ్య పరిస్థితిని కూడా కొవిన్ సాప్ట్‌వేర్‌లో ఎంట్రీ చేయనున్నారు. అంతేగాక రీయాక్షన్లకు చెక్ పెట్టేందుకు సెంట్రల్ మెడికల్ ఆఫీసర్ల సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామని ఆరోగ్యశాఖ అంటోంది. మరోవైపు వ్యాక్సినేషన్ 1లో టీకా తీసుకున్న లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే బాధ్యతను ఆశాలు,ఏఎన్‌ఎంలతో పాటు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులూ స్వయంగా పరిశీలించనున్నారు.
కిట్‌లో ఉండేవి ఇవే…
అడ్రేనాలిన్ రెండు ఇంజక్షన్లు, హైడ్రోకొర్టిసోన్ 100 ఎంజి ఇంజక్షన్, ఐవి ప్లూయిడ్ 1 యూనిట్, డెక్సాట్రోజ్ ప్లూయిడ్, ఐవి డ్రిప్ సెట్ 1 సెట్, ట్యాబ్ పారసెట్‌మాల్ 10 ప్యాక్, డిస్పోజబుల్ సిరంజీ 0.01ఎల్ 26(ఇన్సులిన్ టైపు), డిస్పోజబుల్ సిరంజీ(5ఎంల్) 24/26ఐఎం నీడిల్, 2 స్కాల్ప్ వెయిన్ సెట్లు, కాటన్ వూల్, అథేటివ్, ఏఈఎఫ్‌ఐ రిపోర్టింగ్ తదితరవి ఉంటాయి.
24 గంటల్లో 6.50 లక్షల కొవిషీల్డ్ డోసులు…
రాష్ట్రానికి 24 గంటల్లో 6.50 లక్షల కొవిషీల్డ్ డోసులు రానున్నాయి. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ కూడా పెట్టింది. పూణే ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో ఆ డోసులు రానున్నాయి. అయితే వీటిని విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనంలో సెంట్రల్ స్టోరేజ్ కేంద్రానికి తరలించనున్నారు. అక్కడ్నుంచి అవసరమైన రీజనల్ పాయింట్లకు డోసులను పంపించనున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ 1లో టీకాను పూర్తిగా ఉచితంగా ఇస్తుండగా, సాధారణ ప్రజలకు ఎలా ఇస్తారనే అంశంపై క్లారిటీ లేదు.

Telangana to get 6.50 lakh doses in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News