Friday, April 26, 2024

‘టి’జిటల్ రాష్ట్రంగా తెలంగాణ

- Advertisement -
- Advertisement -

Telangana

రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి పనులు

త్వరలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం

 ఇప్పటికే 70వేల కిలోమీటర్ల డిక్టింగ్ పనులు పూర్తి, వచ్చే సంవత్సరాంతానికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఫైబర్ గ్రిడ్ సేవలు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ త్వరలోనే డిజిటల్ రాష్ట్రంగా మారనుంది. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించాలన్న లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పట్టణాలతో సమానంగా మారుమూల గ్రామాలను సైతం అభివృద్ధి చేయాలన్న ప్రధాన ఆశయంతో ఫైబర్‌గ్రిడ్ సేవలను అన్ని గ్రామాలకు విస్తరింప చేస్తోంది. రాష్ట్రంలోని 10 జోన్లు (31 జిల్లాలు), 589 మండలాలు, 12,751 గ్రామ పంచాయతీల పరిధిలోని 83.58 లక్షల గృహాలు, 3.5 కోట్లకు పైగా ప్రజలకు సరసమైన మరియు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటి, డిజిటల్ సేవలను అందించాలని టి-ఫైబర్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందులో ప్రతి మండలం నుంచి గ్రామానికి ఫైబర్ గ్రిడ్ సేవలను అందించేందుకు కేంద్రం సహకారం అందిస్తుండగా, రాష్ట్ర ప్రధాన హెడ్‌క్వార్టర్ నుంచి ప్రతి మండలానికి ఈ సేవలను అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ పనులను పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆప్టిక్ ఫైబర్, నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను పొందడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్‌ను నెలకొల్పింది. కాగా రాష్ట్రంలో ఫైబర్ సేవలను అందించడానికిగానూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.2వేల కోట్ల చొప్పున మొత్తం నాలుగు కోట్లను వెచ్చిస్తున్నాయి.

కేంద్రం ఇప్పటికే ఆ నిధులను విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని రుణాల రూపంలో సేకరించేందుకు రాష్ట్ర ఫైబర్ గ్రిడ్ సంస్థకు గ్రీన్ సిగ్న్‌ల్ ఇచ్చింది. గ్రామాలకు ఫైబర్ గ్రిడ్ సేవలను కల్పించడం కోసం ప్రత్యేకంగా రోడ్ల తవ్వకాలను చేపట్టకుండా మిషన్ భగీరథ పనుల కోసం జరుగుతున్న తవ్వకాల్లోనే ప్రత్యేకంగా డక్టింగ్ పనులతో పాటు కేబుల్ పనులను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఫైబర్ గ్రిడ్ కోసం రాష్ట్రంలో ఇప్పటికే 70వేల కిలోమీటర్ల మేర డక్టింగ్ పనులు పూర్తి అయ్యాయి. ఈ పనులను శరవేగంతో పూర్తి చేసేందుకు రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి పనులను అప్పగించారు. తొలివిడతలో అన్ని – ప్రభుత్వ కార్యాలయాలకు ఫైబర్‌గ్రిడ్ ద్వారా ఇంటర్నెట్ సేవలను కల్పిస్తారు.

అనంతరం విద్యాసంస్థలు, ఆస్పత్రులు, బ్యాంకులు, ఇతర ప్రజా సేవా సంస్థలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించనుంది. తద్వారా ప్రభుత్వానికి, సిటిజన్ (జి 2 సి), అలాగే ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి (జి 2 జి) సేవలను ప్రభుత్వం కల్పించినట్లు అవుతుంది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను నీటి పైపులైన్ మార్గాల్లో వేస్తున్నారు. టి-ఫైబర్ యొక్క లక్ష్యాల సాధనను నిర్ధారించడానికి టి-ఫైబర్ నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్ కోసం లేయర్డ్ టోపోలాజీ ఒక ప్రణాళికను కూడా రూపొందించింది. ఈ నెట్‌వర్క్ 4-100 ఎంబిపిఎస్ వేగంతో ఇళ్లకు, ఆన్-డిమాండ్ 20-100 ఎంబిపిఎస్ వేగంతో ప్రభుత్వ సంస్థలు మరియు ప్రవైట్ సంస్థలకు పంపిణీ చేయనుంది.

ఈ ప్రాజెక్టు అమలుకు బాధ్యత వహించే తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇటీవలే రూ .1,800 కోట్ల విలువైన కాంట్రాక్టును స్టెర్లైట్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఎస్‌టిఎల్)కు ఇచ్చింది. ఇది 7-0,000 కిలోమీటర్ల ఒఎఫ్‌సి (ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ) 11 జిల్లాల్లో నెట్‌వర్క్, తెలంగాణలోని 3,000 గ్రామ పంచాయతీలు, ఆరు మిలియన్ల గ్రామీణ పౌరులకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని తెస్తుంది. అలాగే భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్ (బిబిఎన్‌ఎల్), ఎల్ అండ్ టి కన్‌స్ట్రక్షన్ వంటి సంస్థలు కనెక్టివిటీ భాగస్వాములుగా పనిచేస్తున్నాయి. మొత్తం మీద వచ్చే సంవత్సరాంతానికి రాష్ట్రంలోని అన్ని పల్లెల్లో ఇంటర్నెట్ విప్లవం కనిపించడం తథ్యంగా కనిపిస్తోంది.

Telangana will soon become a digital state

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News