Home తాజా వార్తలు ఐపాస్ సక్సెస్

ఐపాస్ సక్సెస్

 TS-iPASS

 

 

టిఎస్ ఐపాస్‌తో అద్భుతాలు సాధించిన రాష్ట్రం
భారీగా తరలివచ్చిన పరిశ్రమలు, ప్రగతిపై నేడు ప్రత్యేక సమావేశం, హాజరు కానున్న మంత్రి కెటిఆర్

హైదరాబాద్ : ఏ దేశంలో లేని విధంగా టిఎస్..ఐపాస్ విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అద్భుతాలనే సృష్టించింది. ఈ నూతన పారిశ్రామిక విధానంతో ఐటి, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రం పురోభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. టిఎస్ ఐపాస్‌ను జూన్ 12, 2015న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విధానంతో ఐదేళ్ళ కాలంలోనే తెలంగాణ రాష్ట్రంగా భారీగా పెట్టుబడులు తరలివచ్చాయి. నూతన పారిశ్రామిక పాలసి అమల్లోకి వచ్చినప్పటి నుంచి గత సంవత్సరం ఏప్రిల్ మాసం నాటికి రూ. 1,27,050 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి.

ఆన్‌లైన్ ద్వారా 6,818 పరిశ్రమలకు అనుమతులు మజూరు చేశారు. అనుమతులు తీసుకున్న పరిశ్రమల్లో 4,382 సంస్థలు ఇప్పటికే తమ కార్యక్రమాలను ప్రారంభించాయి. వాటిల్లో పెట్టిన పెట్టుబడుల విలువ రూ.38,203 కోట్లు. మరో 684 పరిశ్రమలు ప్రారంభానికి సిద్దమయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు అనుమతులు తీసుకున్న పరిశ్రమలు ప్రారంభమైతే రాష్ట్రంలో మొత్తంగా 5.38 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏదైనా పరిశ్రమను నెలకొల్పాలంటే వివిధ ప్రభుత్వ శాఖల చుట్టూ పెట్టబడిదారులు నెలలు తరబడి ప్రదక్షణలు చేయాల్సి వచ్చేది. కాని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన తరువాత టిఆర్‌ఎస్ ప్రభుత్వ తీసుకున్న పలు విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రం దశా,దిశనే మార్చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను ఆకర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ళ కిందట టిఎస్..ఐపాస్ విధానాన్ని తీసుకొచ్చేంది. ఈ విధానం ద్వారా పరిశ్రమలకు ఇవ్వాల్సిన అనుమతున్నింటిని కేవలం పదిహేను రోజుల్లో ఆన్‌లైన్‌లో జారీ చేస్తోంది.

పరిశ్రమల స్థాపనకు శరవేగంగా అనుమతులు వస్తుండడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుబడిదారులకు పెద్దఎత్తున ప్రొత్సాహకాలను అందిస్తుండడంతో తెలంగాణలో వెలుస్తున్న పరిశ్రమల సంఖ్య ప్రతియేటా పెరుగుతోంది. ఫలితంగా మన రాష్ట్రంలో పెట్టుబడుల వరద పారుతోంది. ఈ నేపథ్యంలో టిఎస్..ఐపాస్ సాధించిన ప్రగతిపై బుధవారం ఐటి, పరిశ్రమల శాఖ ప్రత్యేకంగా సదస్సును ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంబంధిత శాఖ మంత్రి కెటిఆర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరవుతున్నారు.

Telangana worked wonders with TS-iPASS