Friday, March 29, 2024

మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర ఘనంగా ప్రారంభం అయ్యింది. ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య నుంచి వారం రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు వేలాదిగా ఆదివాసీ గిరిజనులు తరలి వచ్చారు. మెస్రం వంశం పెద్దలతో కలిసి, జిల్లా అధికారులు జాతరను ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీష్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా నుంచి భక్తులు నాగోబా జాతరకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన కేస్లాపూర్ గ్రామం భక్తజనంతో కిటకిటలాడుతోంది. ఆదివాసీ గిరిజనుల ఆరాద్య దైవం నాగోబాను దర్శించుకునేందుకు ఆదివాసీ గిరిజనులు తండోప తండాలుగా తరలివస్తున్నారు. మహాపూజలతో వైభవంగా ప్రారంభమైన ఈ జాతరలో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో నాగోబాకు మహాపూజలు నిర్వహించారు. నాగోబాకు నిర్వహించే మహాపూజలకు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచే శ్రీకారం చుట్టారు. పవిత్ర గంగాజలంతో మర్రిచెట్ల వద్ద బసచేసిన మెస్రం వంశీయులు కెస్లాపూర్ గ్రామంలోని పురాతన నాగోబా ఆలయానికి చేరుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కేస్లాపూర్ గ్రామ పటేల్ మెస్రం వెంకట్‌రావు ఇంటి నుంచి నాగోబా విగ్రహాన్ని ఆలయానికి తరలించారు. మెస్రం వంశంలోని 22 కితలకు చెందిన మహిళలకు పెద్దల చేతులమీదుగా మట్టి కుండలు పంపిణీ చేయగా ఆడపడుచులు మర్రిచెట్ల ప్రాంతంలోని పురాతన బావి కోనేరుకు చేరుకున్నారు. మెస్రం వంశ అల్లుళ్లు మట్టి కుండల్లో తొడిచ్చిన నీళ్లను ఆలయానికి తీసుకువచ్చారు. ఆ నీటితో అల్లుళ్లు బురదమట్టి తయారు చేయగా ఆ మట్టితో పాముల పుట్టలు, బౌలదేవతలను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం మహిళలకు గోవాడ్‌లో ప్రవేశం కల్పించారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు మెస్రం వంశీయులు నాగోబాకు మహాపూజలు నిర్వహించారు. అనంతరం అతిథులతోపాటు భక్తజనానికి నాగోబా దర్శన అవకాశం కల్పించారు.

Telangana’s Famous Nagoba Jatara begins in Adilabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News