Friday, April 19, 2024

పిల్లలు మెచ్చే బుల్లితెర చానళ్లు

- Advertisement -
- Advertisement -

Television channels that children like

రంగులు, చప్పుళ్లు పిల్లల్ని ఆకర్షించే క్షేత్రాలు. పుట్టిన మరుక్షణం నుంచే వీటిపై వారి ప్రతిస్పందన మొదలవుతుంది. కళ్ల ముందు కదలాడే రంగు రంగుల, వింత శబ్దాల గిరికీల బొమ్మను చూస్తూ ఊయల్లో ఉన్న పాపాయి కేరింతలు కొట్టడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నడక వచ్చిన పిల్లల మనసు ఇంట్లో పెద్దగా వింత శబ్దాలు చేస్తూ రంగులు వెదజల్లే టివి వైపు మరలుతుంది. ఉమ్మడి కుటుంబాల పోయి మనుషుల సంఖ్య తగ్గిన నేటి ఇళ్లల్లో టివినే నలుగురు చేసే సందడి సృష్టిస్తోంది. ఎన్ని బొమ్మలయినా దీని అలజడి ముందు క్షణ కాలపు వినోద సాధనాలవుతాయి. టివి పెట్టనిదే పిల్లలు అల్లరి ఆపని, అన్నం తినని రోజులు ఇళ్లల్లోకి ప్రవేశించాయి.

ఇలాంటి తప్పని పరిస్థితుల్లో ఎదుగుతున్న పిల్లలు టివిల్లో ప్రసారమయ్యే ఏ కార్యక్రమాలు చూస్తే ఉపయోగకరం లేదా కనీస నష్టం అనే విషయాలపై నేటి తల్లిదండ్రులు దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. మామూలుగానైతే టివిల్లో సినిమాలు, సినిమా మాటలు, సీరియళ్లు, లైవ్ షో చూడడమే ఎక్కువ. వార్తలకు విడిగా చానళ్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు టివిల్లో చాలా చానళ్లు ఇన్‌ఫాంటేయిమెంట్స్ కాకుండా పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ అనుకోవాలి. మన దేశంలో టివిల్లో వార్తలు చూసే వీక్షకులు 7 శాతం మాత్రమేనని నెల్సన్ సర్వే చెబుతోంది. టివిలు అందించే వినోదాల వెల్లువలో పెద్దలతో పాటు పిల్లలూ ఓలలాడుతుంటారు. అయితే మానసికంగా, శారీరకంగా ఎదిగిన వారికే, ఎదుగుతున్న పిసి పిల్లలకే ప్రసారాల ప్రభావం విషయంలో చాలా తేడా ఉంటుంది. ఈ రోజుల్లో ఇంటి పట్టున ఉండే పిల్లలకు ఇంట్లో తిరుగాడే ఇద్దరు, ముగ్గురు పోనూ కనబడే, పరిచయమయ్యే కొత్త మనుషులు టివిల్లోని పాత్రలే. వారి ప్రవర్తన వీరిపై బలమైన ముద్రపడుతుంది.

పాత్రలది నటనైతే అదే నిజమనుకునే పని మనసు పిల్లలది. బుల్లితెరపై కనబడే హింస, కొట్లాటలు, మారణాయుధాల వాడకం, ఫైటింగ్, పాత్రల మధ్య తీవ్ర పదజాలం, కోపతాపాల సన్నివేశ దృశ్యాలు ఇవన్నీ పసివాళ్ల మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. ఏదైనా వస్తువు ఈయకుంటే లాక్కోవలసిందేనని, ఎదురుదాడి చేయాలని వీటి ద్వారా పిల్లలు నేర్చుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. నడక రాగానే మ్యూజిక్‌కు అనుగుణంగా టివి ముందు పిల్లలు గంతులు వేయడం తల్లిదండ్రులకు సరదాగా ఉన్నా అదీ టివి ప్రసాదించే ప్రకంపనల్లో ఒకటేనని, అమ్మా నాన్న పదాల కన్నా ముందు వలసపెట్టి వినే పాటల్లోని పదాలనే పలుకుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. గంటల తరబడి టివి చూసే పిల్లలు రెండేళ్లు వచ్చినా వారిలో శబ్ద ఉచ్ఛారణ స్పష్టత ఉన్నా తల్లిదండ్రులను పిలుపులతో పలకరించడం లేదని, టివి చూపడం తగ్గిస్తే తప్ప అమ్మా నాన్న పదాలపై పట్టురాదని డాక్టర్లు తల్లిదండ్రుల సందేహాలకు సమాధానంగా చెబుతున్నారు.

టివిల్లో నిత్యం రకరకాల కార్యక్రమాలు తిలకించే పెద్దలు పిల్లల కోసం కూడా చానళ్లు ఉన్నాయని, వారి కోసం టివి సమయం కేటాయించాలని గ్రహించడం అవసరం. వీలైతే పిల్లలు చూస్తున్నంత సేపు కిడ్స్ చానల్స్‌నే తెరపై ఆడించితే మరీ మంచిది. ఇంటా, బయటా తమ వయసు పిల్లల సహవాసం దొరకని పిల్లలు టివిలో పిల్లల కార్యక్రమాలకు వెంటనే కనెక్ట్ అవుతారు. పిల్లలతో పాటు ఈ చానళ్లు పెద్దలు కూడా ఆసక్తిగా చూసేలా కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నామని వీడియో గ్యాన్ నిర్వాహకులు అంటున్నారు.

పిల్లల్ని టివిలకు అతుక్కుపోయేలా చేయకుండా, మరీ పేచీ పెడితే కిడ్స్ చానళ్లు మాత్రమే పెట్టడం ఉత్తమమార్గం. ఏనిమేషన్లలో ఉండే పిల్లల గంతులు, పాటలు, తేలికయిన సంగీతం, కంటిపై ఒత్తిడి పడని బొమ్మల కదలికలు, వాటి రంగులు పిల్లల్ని తమలో లీనం చేసుకుంటాయి. రోజుకు ఒకటి, రెండు గంటల వీటిని కనీస దూరం పాటిస్తూ పిల్లలు చూడడం వల్ల మానసిక, శారీరక నష్టమేమీ లేకపోగా పెద్దలు పని కట్టుకొని నేర్పే పాఠాలు కొన్ని ఈ కార్యక్రమాలు పిల్లలకు అందిస్తాయి. ఇళ్లలోకి టివి ప్రసారాలనందించే ఏ నెట్‌వర్క్ అయినా కొన్ని కిడ్స్ చానళ్లని తప్పకుండా అందిస్తున్నాయి. డిస్నీ జూనియర్, హంగామా కార్టూన్ నెట్‌వర్క్, పోగో, నికెల్ డియన్ ఇలా ఎన్నో టివిల్లో లభిస్తాయి. తెలుగులో కూడా వాటి ప్రసారాలుంటున్నాయి. స్టార్ ఇండియా ప్రసారం చేసే ‘బే బీ’ టివి పసి పిల్లలను అమితంగా ఆకర్షిస్తోంది. ఇక ఇంటర్‌నెట్ సదుపాయమున్న ఇళ్లలో ఆండ్రాయిడ్, తదితర ఆపరేటింగ్ సిస్టమ్స్ గల టివిలుంటే యూ ట్యూబ్‌లో కోరినన్ని కిడ్స్ ప్రోగ్రామ్స్ లభిస్తాయి.

చిన్న పిల్లలకే కాకుండా 15 ఏళ్ల పిల్లల అవసరాలకు అనుగుణంగా వివిధ కేటగిరీల్లో కార్యక్రమాలు రూపొందుతున్నాయని కీలకమైన కౌమార దశలో ఇవి ఉపయోగపడుతున్నాయని టర్నర్ ప్రతినిధి మేనకా టాటా సర్వే ద్వారా తెలుస్తోంది. ఈ కార్యక్రమాలు చూడడం ద్వారా పెద్దలు సైతం తమ బాల్య స్మృతుల్లోకి వెలుతున్నారని, పిల్లల పట్ల తమ బాధ్యతల్ని తెలుసుకుంటున్నారని ఆ సర్వేలో ఉంది. ఇతర భాషల్లో తయారవుతున్న కిడ్స్ ప్రోగ్రామ్స్, ఎనిమేటిక్ మ్యూజిక్ చానల్స్ చాలా వరకు తెలుగులోకి అనువదిస్తున్నారు. సివిఎస్ థర్డ్ రైమ్స్ డాట్ కామ్, బొమ్మరిల్లు తదితర తెలుగు ప్రసారాలు కూడా ఉన్నాయి.

బెంగళూరులో తయారవుతున్న వీడియో గ్యాన్ ఏనిమేషన్ ప్రసారాలు వివిధ భాషల్లో లభిస్తున్నాయి. ఇన్‌ఫో బెల్స్ అని తెలుగులో అన్ని పిల్లల గేయాలు చక్కగా చిత్రికరిస్తున్నారు. మిన్ను అండ్ మింటూ అని ఇద్దరు మిత్రులతో తెలుగు పాటలు ఆసక్తికరంగా పిల్లల్ని ఆకర్షిస్తున్నాయి. టూటూ బాయ్ అని కొంటె పిల్లాడి చేష్టలు కూడా బాలల కోసమే. లండన్‌లో ఉంటున్న వినోద్‌చందర్ ఏకంగా తన అమ్మాయి కోసం ఓ పిల్లల వీడియోను చిత్రీకరించాడు. తమిళ సినీ సంగీత దర్శకుడైన చంద్రబోస్ కుమారుడీయన. తన చిన్నారి కూతురు హర్షిణి కోసం యూ ట్యూబ్‌లో ఎంత వెతికినా నచ్చిన కార్యక్రమాలు లేకపోవడంతో తానే చబ్బీ చీక్స్ అనే ఇంగ్లీషు రైమ్‌పై తన కూతురును నటింప చేసి యూ ట్యూబ్‌లో పెట్టాడు. దానికి వ్యూవర్స్ పెరగడమే కాకుండా మరిన్ని పాటల కోసం డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో ఆయన ఆరంభించిన చూ చూ టివి కోట్లాది ప్రేక్షకులను సాధించింది. ఈయన కృషికి 2017లో యూ ట్యూబ్ డైమెండ్ ప్లే బటన్ పురస్కారాన్ని ఇచ్చింది.

వెతికితే యూ ట్యూబ్‌లో తెలుగు పిల్లలకు తల్లిదండ్రులు మరచిపోయిన ఎన్నో పాటలు లభిస్తాయి. పాటలతో పాటు అక్షరాల పరిచయం, అంకెలతో ఆటలు, పదాల అభ్యాసం పిల్లలు అభ్యసించవచ్చు. వీటి వీక్షణం ద్వారా దంతధావనం, స్నానం, శారీరక పరిసరాల పరిశుభ్రత జంతువులతో స్నేహం లాంటివి ఎన్నో పిల్లలు అభ్యసించే అవకాశం ఉంది. వినోదంతో పాటు విద్య, వికాసంకు తోడ్పడే ఈ చానళ్లు పిల్లలు ఇష్టపడతారు కూడా. కిడ్స్ చానల్స్ చూడడం పిల్లల హక్కు. దానిని కల్పించడం పెద్దల బాధ్యత.

బి.నర్సన్- 9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News