Home దునియా నిగర్వి కారణజన్ముడు నటయోగి

నిగర్వి కారణజన్ముడు నటయోగి

Telugu-Actor-Nagaiah

నిరంతర కృషితో ఆటుపోట్లను ఎదుర్కొంటూ, అనుకున్నది సాధించడంతో బాటు, అపర దానకర్ణుడుగాను గుర్తింపు పొంది, నటుడుగా, గాయకుడుగా, సంగీత దర్శకుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా ఎనలేని పేరు ప్రతిష్టలు ఆర్జించిన, ఇప్పటికీ తలుచుకుంటున్న మహానటుడు నాగయ్య, ఈయనను చిత్తూరు వి. నాగయ్య అని, వి.నాగయ్య అని, వుప్పల దడియం నాగయ్య అని, చిత్తూరు వుప్పల దడియా నాగయ్య అని పిలిచేవారు. చిన్నతనం నుంచీ అవిరళంగా కృషి చేయడం ఆ కృషి, ఒక తపస్సులా నిర్వహించడం వల్లనే వివిధ వృత్తులలోనూ సినీ నటుడు కాక ముందు కూడా రాణించారు. నాగదోషం వున్న కుటుంబంలో రేపల్లె పక్కనున్న గ్రామంలో వుప్పల దడియం వెంకట లకా్ష్మంబ , రామలింగ శర్మ దంపతులకు నాగదోష నివార ణ చేసిన అనంతరం 1904, మార్చి 28న జన్మించారు.

పుట్టిన తరువాత పెట్టిన పేరు నాగేశ్వరం రామలింగశర్మ హరికథలు చెప్పేవారు. వయోలిన్ వాయించే వారు. ఆర్థిక సమస్యలు వలన స్వగ్రామంలో వుండలేక చిత్తూరు జిల్లాలోని కుప్పంలో జీవనోపాధి చూసుకున్న కారణంగా నాగేశ్వరం కూడా అక్కడ వీధి బడిలో చేరారు. అయిదో తరగతి తర్వాత భుక్తి కోసం తండ్రి చిత్తూరుకు మకాం మారిస్తే మిగతా చదువు అక్కడ సాగింది స్కాలర్‌షిప్పులతో. అందరూ నాగూ అని పిలిచేవారు. ఫస్ట్ ఫారం చదువుతున్నప్పుడే సురభి నాటకమండలి వారు వేసే భక్తప్రహ్లాద నాటకంలో ప్రహ్లాదుడుగా హెడ్మాస్టారు సూచనతో నటించి పాటలు, పద్యాలతో మెప్పించాడు నాగు. అప్పటి నుంచి సంగీతం, నటన మీద మరింత దృష్టి పెట్టారు. పదమూడో ఏట చదువు మీద ఆసక్తి తగ్గి ఫెయిల్ అవడంతో తిరుపతికి మకాం మార్చి ఫిఫ్త్‌ఫారంలో చేర్చారు. తరువాత టీచర్ ట్రయినింగ్ చేసి, ఇష్టం లేకున్నా బడి పంతులుగా పని చేసారు పాకాల గ్రామంలో. నాటకాలు ప్రముఖంగా ప్రదర్శించే రామవిలాస్ సభలో చేరి నటుడుగా రాణించారు. చిత్తూరు నుంచి ఆంధ్రపత్రిక దిన పత్రిక ప్రతినిధిగానూ పనిచేసారు. గ్రామఫోన్ రికార్డు కంపెనీకి పాటలూ పాడేవారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ ట్రయినింగ్ అవుతూ గుర్రం మీద నుండి పడడంతో శిక్షణను ఆపుకున్నారు.

చిత్తూరు జిల్లా బోర్డులో గుమస్తాగా చేరి, అకౌంటెంట్‌గా ప్రమోషన్ పొం దారు. జిల్లా కలెక్టర్ బోల్డన్ దొర సంగీతాభిమాని అవడంతో ఆయనకు సంగీ తం నేర్పి, ఆయన నుంచి పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నారు. నాగేశ్వరంని అభిమానించే కలెక్టర్ తమ రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ కుమార్తె విజయలక్ష్మితో పెళ్లి జరిపించా రు. ఆడపిల్లకు జన్మనిచ్చిన భార్య పురిటి సమస్యతో మరణించడంతో ఆత్మహత్య చేసుకోబోయారు. రామవిలాస సభవారు అడ్డుకున్నారు. పాపను పెంచడంలో రెండేళ్ళ పాటు ఇబ్బందులు పడటంతో దగ్గర బంధువు గిరిజతో నాగేశ్వరంకి పెళ్లి చేశారు. కొంత కాలానికి లివర్ వ్యాధితో కూతురు మరణించింది. ఆ తరువాత గర్భస్రావం జరిగి ఆసుపత్రిలో భార్య మరణించింది. నెల తిరగకుండా తండ్రి కూడా మరణించడంతో ఉద్యోగం, నటన, సంగీతం అన్నింటి మీద విరక్తి ఏర్పడి ఎవరికీ చెప్పకుండా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లి అజ్ఞాత జీవితం గడిపారు. పి.ఎం. దొరై కంపెనీకి చెందిన దొరై చూసి, గుర్తుపట్టి హితబోధ చేసి వెనక్కి తెచ్చారు. అంతకుముందు ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలుకెళ్లిన నాగేశ్వరం రమణ మహర్షి ఆశ్రమం నుంచి తిరిగి వచ్చాక జాతీయోద్యమంలో పాల్గొని కల్లు మానిపించే ఉద్యమంలో చేరారు.

బెంగళూరులోని హెచ్.ఎం.వి. కంపెనీ పిలుపుతో బెంగళూరులో కొంతకా లం వుండి గ్రాంఫోన్ రికార్డులకు పాడుతూ, నాటకాల్లో నటిస్తుండేవారు. మద్రా సులోనూ నాటకాల్లో పాల్గొంటూ వుండటంతో బి.ఎన్. రెడ్డితో పరిచయమూ పెరిగింది. తరువాత సినిమా నటన మీద ఆసక్తి ఏర్పడింది. కౌసల్య సతీ తులసి మాయాబజారు, మానసంరక్షణ, సారంగధర, రంభాఫిలిమ్స్ నిర్మించే చిత్రంలో వేషం వచ్చినట్టే వచ్చి మిస్ అయ్యేవి. తండ్రికి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బు వస్తే దాంతో సిన్మా తీయాలని తలచి డబ్బున్న రంగస్వామి పిళైని నమ్మి నష్టపో యారు. మద్రాస్‌లో అలా కాలక్షేపం చేస్తుంటే ఆంధ్రపత్రిక సంపాదకుడు కాశీనాథుని నాగేశ్వరరావు గారితో వున్న పరిచయం వల్ల ఆయన ఉత్తరాలు ఈయనకు ఈయన ఉత్తరాలు ఆయనకు వెళ్లేవి. దాంతో మిత్రుల సలహా పాటిం చి నాగయ్యగా తన పేరు మార్చుకున్నారు.

తరువాత రోహిణి పిక్చర్స్‌ని హెచ్.ఎం. రెడ్డి కన్నాంబ , పారుపల్లి శేషయ్య కలసి ప్రారంభించి ‘గృహలక్ష్మి’ చిత్రాన్ని హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో తీయ సాగారు. బి.ఎన్.రెడ్డి సూచనతో దేశ భక్తుడు గోపినాథ్ పాత్రను నాగయ్యకు యిచ్చారు. కావాలని నాలుగేళ్ళపాటు నిరంతర కృషిచేస్తే 1936లో గృహలక్ష్మి ద్వారా అవకాశం దక్కింది. ఇందులో కల్లుమానండోయ్ బాబూ… అనే ప్రబోధ గీతం కూడా పాడి విశేషంగా ఆకర్షించారు నాగయ్య. వాహిని సంస్థను నెలకొల్పిన బి.ఎన్.రెడ్డి వందేమాతరం చిత్రం స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తే నాగయ్యను హీరోగా చిత్రానికి సంగీత దర్శకుడుగా కాంచ నమాలను హీరోయిన్‌గా నిర్ణయించారు. ఈ చిత్రం 1939లో ఘన విజయం సాధిందింది. వాహినీ పతాకాన తరువాత తీసిన సుమంగళి, దేవత చిత్రాలకు సంగీత దర్శకుడుగా వ్యవహరించి , హీరోగా నటించడం అవి విజయం సాధిం చడంతో నాగయ్య పేరు ప్రతిష్టలు ఇనుమడించాయి. వై.వి.రావ్ రూపొందించిన విశ్వమోహిని సినిమా (సినిమారంగం మీద తీసిన తొలి చిత్రం) లో దర్శకుడిగా నటించి మంచి గుర్తింపు పొందారు. నాగయ్య పేరు తమిళ రంగం వారిని ఆక ట్టుకోవడంతో అశోకుకుమార్ మీరా తమిళ చిత్రాలలో హీరో పాత్ర పోషించారు. 4వ తమిళచిత్రం చక్రధారిలో నటించినందుకు తనంతతానుగా ఎస్.ఎస్.వాసన్ నాగయ్యకు 1946లో లక్షరూపాయలు ఇవ్వడం విశేషం.

కె.వి రెడ్డి దర్శకత్వంలో వాహినీ పతాకాన రూపొందిన భక్త పోతనలో పోత నగా నటించి సంగీతం కూడా సమకూర్చి ఆ చిత్రంతో మరింత పేరు ప్రఖ్యా తులార్జించారు. నిర్మాత కావాలన్న కోరిక తీర్చుకోవడానికి శ్రీ రేణుకా పతాకాన పి. పుల్ల య్య దర్శకత్వంలో తను హీరోగా , మాలతి హీరోయిన్‌గా భాగ్యలక్ష్మి చిత్రాన్ని నిర్మించి 1943 లో విడుదల చేసి విజయం సాధించారు. బి.ఎన్. రెడ్డి దర్శక త్వం రూపొందిన స్వర్గసీమలో హీరోగా నటించి , ఒక సంగీత దర్శకుడిగా కూ డా వ్యవహరించి ఆ చిత్ర విజయానికి హేతువయ్యారు. రేణుకా పతాకాన ద్వితీయ చిత్రంగా త్యాగయ్యని సంకల్పించి , భక్తి శ్రద్ధల తో స్క్రిప్ట్ రాసుకుని టైటిల్ పాత్ర పోషించి , సంగీతం దర్శకత్వం కూడా సమ కూర్చి నిర్మాతగా 1946 లో త్యాగయ్య విడుదల చేసి అపర త్యాగయ్యగా గుర్తిం పుపొందారు. అప్పటి వరకు తెలుగు చిత్రాల్లో హిందుస్తానీ సంగీతానికే ప్రాధా న్యత యివ్వగా నాగయ్య ఈ చిత్రంతో కర్ణాటక సంగీతానికి ప్రాముఖ్యత యిచ్చారు. ఈ చిత్ర విజయంతో తెలుగు , తమిళ చిత్రసీమలు.

కర్ణాటక సంగీతానికి ప్రాధాన్యత నివ్వడం ప్రారంభించాయి. త్యాగయ్య విడుదలైన తర్వాత మైసూర్ మహారాజు బంగారు పళ్లెంలో నాగయ్య కాళ్లు కడిగి ఆ నీళ్లను తన తలపై చల్లుకొని మహాపండితులు విద్వాంసులు , సంగీతాభిమానుల సమక్షంలో ఘన సన్మానం చేసారు. తిరువాన్కూర్ సంస్థానంలో రాజసత్కారం వైభవంగా జరిపి కనకాభిషేకం చేసి అభినవ త్యాగరాజు బిరుదుని తిరువా న్కూర్ మహారాజు ప్రదానం చేసారు నాగయ్యకు. అప్పటి నుంచి నాగయ్య ఎక్క డకు వెళ్లినా ఘన సన్మానాలు , నీరాజనాలే. కె.వి. రెడ్డి దర్శకత్వంలో రూపొందిన యోగివేమనలో భోగిగా, యోగిగా ఆపాత్రకే వన్నె తెచ్చారు. ఈ చిత్రానికి ఓగిరాల రామ చంద్రరావుతో కలసి సంగీ తం కూడా సమకూర్చారు.

‘అవరిండియా పతాకాన’ నా యిల్లు చిత్రాన్ని నిర్మాతగా , దర్శకుడుగా హీరోగా రూపొందించారు. వి.ఎన్ ఫిలింస్ పతాకాన రామదాసు చిత్రాన్ని స్వీ య దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రాన్ని నిర్మించమని నిర్మాణ వ్యయం తామే భరిస్తామని నిజాం నవాబు హామీనివ్వడంతో సినిమా ప్రణాళిక ప్రారంభించారు. పోలీస్ యాక్షన్‌లో నిజాం ప్రభుత్వం కుప్పకూలడంతో నిర్మాణ వ్యయభారం నాగయ్యపైనే పడింది. చివరకు షూటింగ్ ప్రారంభించి రామదాసు వలెనే అష్టకష్టాలుపడి , అనేక ఆర్థిక ఒడిదుడుకులకు లోనై 1964లో విడుదల చేసారు. చిత్రం ఘన విజయం సాధించడంతో ఆ కష్టాలన్నీ మరిచిపోయారు గాని చేసిన అప్పులతో ఆర్థిక యిబ్బందులు మరింత పెరిగాయి నాగయ్యకు.

ఆ రోజుల్లో తెలుగునటుల్లో అధిక పారితోషకం హీరోగా లక్ష రూపాయలు తీసుకున్న నటుడు (తెలుగు చిత్రమైనా , తమిళ చిత్రమైనా) నాగయ్య, అనేక చిత్రాలలో నటిస్తూ అధికంగా సంపాదిస్తున్నా ఆ ధనాన్ని దాన ధర్మాలకే విని యోగించేవారు. చదువుకునే వారికి , పెళ్లిళ్లు చేసుకునే వారికే, ఆర్థిక ఇబ్బందులు పడేవారికీ ఒకరేమిటి అందరికీ ఎంత అడిగితే అంతయిచ్చేసేవారు. ఇవ్వడానికి ఇంట్లో డబ్బు లేకుంటే వడ్డీకి అప్పు తెచ్చి మరీ దాన ధర్మాలు చేసేవారు. కొంద రు అబద్ధాలు చెబుతున్నారని తెలిసినా పోనీలే పాపం అని అపాత్ర దానాలు చేసేవారు. అంతేకాక ఆయన ఇల్లూ, రేణుకా ఫిలింస్ ఆఫీస్ నిత్యాన్నదాన, ఉపా హార సత్రంగా కొనసాగేది. ఆయన సినిమాలో పనిచేసేవారే కాకుండా ఇతర చిత్రాల్లో పని చేసేవారు, దారిన పోయేవాళ్లు, ఇతర చోట్ల నుంచి వచ్చే సంద ర్శకులూ వేషాలు లేక భుక్తి గడవని నటులు ఎవరైనా సరే ఆ సమయాన్ని బట్టి చక్కని భోజనాలు లేదా ఫలహారాలూ అందజేయించేవారు. వచ్చిన వారికి ఏ లోటు జరుగకూడదని చెప్పేవారు నాగయ్య.

అధిక పారితోషకాలు స్వీకరించిన ఆయనే చివరిదశలో అతి తక్కువ పారితోషకం వందరూపాయలు యిచ్చినా ఆ పాత్ర చేయడానికి అంగీకరించేవారు. ఆ పారితోషకాన్ని కూడా దాన ధర్మాలకే ఎక్కువ వినియోగించేవారు. భక్త పోత నలో టైటిల్ పాత్ర పోషించిన ఆయన మరోసారి తీసిన భక్త పోతనతో వ్యాసునిగా దేవత చిత్రంలో హీరోగా నటించిన ఆయన మరోసారి రూపొందిన దేవతలో చిన్న పాత్ర పోషించారు. నటుడుగా తెలుగులో 177 చిత్రాలు తమిళంలో 93 చిత్రాలు, కన్నడంలో 8 చిత్రాలు, హిందీలో 7 చిత్రాల్లో నటించారు. 1973 డిసెంబర్ 30న పరమపదిం చారు.
ఎన్ని సన్మానాలు పొందిన ఎంత ప్రజాదరణ పొందినా ఎదుట వారు తన గొప్పవారు అనే భావనతో ఆప్యాయతతో, చిరునవ్వుతో వినయ విధేయ తలతో వుండేవారు. నాగయ్య. రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ నాగయ్యను ఎంతో అభిమానించేవారు. మద్రాసులో రాధాకృష్ణన్‌ని నాగయ్య తన మిత్రులతో ఆయన ఆహ్వానంపై కలవడానికి వెళ్లినప్పుడు, కొందరు రాజకీయ నాయకులు రాధా కృష్ణన్‌కి పాదాభివందనం చేశారు. అప్పుడు ఆయన “నా కాళ్ళు తాకితే నీ కేదైనా పుణ్యమొస్తుందా? పక్కన పూజ్యులైన నాగయ్య గారున్నారు ఆయన కాళ్లు తాకితే పుణ్యమొస్తుంది” అనడం ద్వారా నాగయ్యకు ఎంత గౌరవం ఇచ్చేవారో అర్థం అవుతుంది.

-వి.ఎస్. కేశవరావు, 9989235320