Home కలం దళిత కవిత్వ వికాసం

దళిత కవిత్వ వికాసం

kalam

అసమానతల కూర్పు భారతీయ సమాజం. భిన్నకుల, మతాలతో సంక్లిష్టతలను కలిగిన సమాజం. రుగ్వేదం పదవ మండలంలోని పురుష సూక్తంలో కుల ప్రస్తావన వుంది. రామాయణ, భారతాలలో చాతుర్వర్ణ వ్యవస్థ ప్రస్తావన వుంది. ఆ తరువాత వర్ణాలు అయిదుగా, ఆ ఐదు అనేక ఉపకులాలుగా విస్తరిస్తూ వచ్చాయి.తెలుగు ప్రాచీన సాహిత్యంలో ఈ వర్ణ వ్యవస్థను నిరసించిన వారు లేకపోలేదు. కానీ అది తాత్విక దృక్ఫథంలోనుంచి వచ్చిన భక్తి మార్గంలో వచ్చింది. ఆముక్తమాల్యదలో రాయల వారు మాల దాసరి వృత్తాంతం చెప్పారు. వేమన, వీరబ్రహ్మం, అన్నమయాదులు ఈ సమాజంలోని అంటరానితనాన్ని ప్రశ్నించారు. కులంకంటే గుణం ప్రధానమని, వేమన అభిప్రాయపడ్డారు. “పంచముడవనినిను కించపరిచిన బాధపడకురా కక్కా/తిట్టిన నోరే పొగడుతున్నప్పుడు వదిలేను రావాళ్ళ తిక్కా” నీరుకు, నిప్పుకు లేని అంటూ, దైవానికి లేని అం టూ, ఈ మనుషులకేలరా బ్రహ్మం నిలదీసాడు.తెలుగులో అంటరానితనానికి నిరసనగా 1909లో ‘ఆంధ్రభారతి’ పత్రికలో ‘మాలవాండ్రపాట’ అన్నగేయం వచ్చింది. ఇది సంఘ సంస్కరణోద్యమానికి ముందే. మహాత్మగాంధీ రాజకీయ రంగప్రవేశం చేయకముందే రావడం గర్హనీయం. తెలుగు సాహిత్యంలో ఆధునిక యుగంలో మొదటిసారిగా అంటరానితనాన్ని నిరసించినగేయమిది. ఈ గేయ రచయిత ఎవరో తెలియలేదు. “అందారు పుట్టిరీ హిందమ్మతల్లికి / అందారు ఒక్కటై ఉందారి / సక్కంగా అమ్మోరు దీవించి ఆయిశర్యమిచ్చూను” / బ్రాహ్మణులు, మిగతా అగ్రవర్ణాలు దళితులకంటే ఎలా ఎక్కువని ప్రశ్నించిందీ గేయం. ఆధునిక యుగకర్తగా చెప్పబడిన గురజాడ 1910లో రాసిన “లవణరాజు కల” గేయంలో అంటరానితనానికి వ్యతిరేకత కనబడుతుంది. మలినమైన శరీరాలు గలవారు మాలలని అంటారు. మలినమైన చిత్తములు కలిగిన అధిక కులము వారు మాలలు కాదా ! అని “నెలవొసంగిన వర్ణ ధర్మ మధర్మ ధర్మంబె” అని వర్ణవ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తాడు. ‘నిరుద్ధభారతం’ రాసిన ‘మంగిపూడి వెంకటశర్మగారు అంటరాని తనాన్ని వ్యతిరేకించిన తొలికావ్య కర్త.
జాతీయోద్యమంలో గాంధీ ‘హరిజన’ పదాన్ని పంచములకు పర్యాయపదంగా తెచ్చాడు. గాంధీజీ పిలుపుతో ఎంతో మంది కవులు అంటరానితనానికి నిరసన కావ్యాలు వెలువరించారు.కుసుమధర్మన్న ‘హరిజన శతకం’ రాసాడు. జాషువా ‘గబ్బిలం’ రాసాడు. జాలారంగస్వామి, నక్కాచిన వెంకయ్య, బోయి భీమన్న, ఇనాక్,మొదలగు కవులు వాడైన మాటలతో అంటరానితనం ‘ఆంతర్యాన్ని ఎండగట్టారు.
గాంధీ పంచములను పిలిచిన, ‘హరిజన’ పదాన్ని దళితులు తిరస్కరించారు. ఆది ఆంధ్ర, ఆదిహిందువులు, అనేక పేర్లతో పిలువబడ్డా రు.
తదనాంతర తెలుగు సాహిత్యంలో విప్లవ కవితోద్యమాలు విజృంభించాయి. వర్ణం కన్నా వర్గం పోరు ఎక్కువ జరిగింది. కుల సమస్య బలహీనపడింది. 1972లో బొంబాయిలో ‘దళిత పాంథర్స్’ ఆవిర్భవించారు. వీరు పూలే, అంబేద్కర్ పోరాట స్ఫూర్తితో ముందు కు వచ్చారు. ‘దళిత’ అనే పదాన్ని ముందుకు తెచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనార్టీ, స్త్రీలు అందరు దళితులే అన్న విస్తృతమైన శాస్త్రీయమైన దృక్పథాన్ని ప్రవేశపెట్టారు. అంబేద్కర్ గ్రంథాలన్నీ తెలుగులోకి తర్జుమా చేయబడ్డాయి.1980 తరువాత దళిత పదంపై విస్తృతమైన చర్చ జరిగింది. కారంచేడు, నీరుకొండ, చుండూరు, పదిరికుప్పం, వెంపెంట పలుచోట్ల దళితులపై దాడులు, ఊచకోతలు జరిగాయి. ఈ సంఘటనలు దళితుల అస్తిత్వాన్ని ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో దళిత కవులు తమ ఆత్మగౌరవం కొరకు రాయడం మొదలుపెట్టారు.
దళిత కవిత్వంలో కవిత్వ సంపుటాలు కవిత్వ సంకలనాలు, దీర్ఘ కవితలు మొదలగునవి విస్తృతంగా వచ్చాయి. ఈ కవిత్వంలో ఎక్కువగా అస్తిత్వం, ఆత్మగౌరవం సిద్ధించింది. పురాణ ప్రతీకల్నీ తీసుకొని దళిత భాషలో రాయడం వల్ల దళిత కళాతత్త్వంగా భాసించింది.
ఆత్మగౌరవంతో బతకడం కోసం దళితులు నిరంతరం ఎదుర్కొంటున్న సమస్యలను, వేదనను వ్యక్తపరిచారు. దళితులపై ఊచకోత జరగడం వల్ల నాడు వచ్చిన కవిత్వం దళితులను అప్రమత్తం చేసింది. కల్లెకూరి ప్రసాద్ “పిడికెడు ఆత్మగౌరవం కోసం” కవితలో
“తరతరాలుగా స్వతంత్రదేశంలో అస్వతంత్రుణ్ణి అవమానాలకు, అత్యాచారాలకు/మానభంగాలకూ, చిత్రహింసలకూ గురై/ పిడికెడు ఆత్మగౌరవం కోసం తలెత్తినవాణ్ణి” అంటూ దళిత వేదనని వ్యక్తపరిచినాడు. తరతరాల నుంచి అణచివేతకు గురై, ఊరికి ఆమడదూరాన ఉంచిన దళితులు తలెత్తుకు తిరిగితే సహించలేకపోయిన అగ్రవర్ణాల గూర్చి తెలిపాడు. సతీష్‌చందర్ ‘ఒక జననం వాయిదా” కవితలో బెల్టునునడుంకి బిగిస్తున్నప్పుడు/నా చరిత్రను నా చేతనే తుడిపించడానికి/ నావెనకెవరో చీపురు కడుతున్నట్లే భ్రమించి/ నా చుట్టూ నేనే రంధ్రాన్వేషణ చేసుకుంటాను” అంటూ నేటికి దళితులు గౌరవంగా జీవిస్తే ఓర్వలేక అనేకమైన ఇబ్బందులు మాటలతో వెక్కిరింపులు చేస్తూనే ఉన్నారు. ఈ మాటలు దళితులను మానసికంగాను సామాజికంగా కృంగదీస్తున్నాయి. తనకు తానుగా నిలబడి అస్తిత్వాన్ని కాపాడుకుంటున్న దళితులు గౌరవంగా జీవించాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో దళిత కవిత్వం విస్తరించింది. విద్యకు గురువుకు బొటన వేలు ఎలా సమర్పించుకుంటాడని ప్రశ్నించారు. ఆ బొటనవేలు సమర్పణ కుట్రకు ప్రతీకని నీలదీసారు, సతీష్‌చందర్ ‘పంచమవేదం’లో “ఆ వేలులేకనే/ అమ్మ గోరు ముద్దలు తినిపించలేదు/నిజం చెప్పండి/ పంచముడంటే ఐదో వేలులేని వాడనేనా అర్థం” ఈ ప్రశ్న నేటి గురువులకు వేసిన ప్రశ్న. కులం పేరుతో అవమానానికి గురై దాకే బాలాజీ, డొక్కా పద్మనాభరావు దళిత విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎండ్లూరి సుధాకర్ ‘దళితాయణం’ అనే ఖండికలో రామాయణంను గబ్బిలంలా తలక్రిందులుగా చూసాడు. స్వయంగా శంబూకుడ్ని రాముడే సింహాసనాన్ని ఎక్కిస్తాడు. “రాముడు కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు చల్లుకొని సింహాసనం దాకా నడిపించాడు. అగ్రవర్ణాలు అణగదొక్కబడిన పాత్రలన్నీ ప్రతీకారంగా ఎదురుదాడి చేస్తాయి. శివసాగర్ “నడుస్తున్న చరిత్ర”లో పురాణ ప్రతీకలు పూర్తిగా తలక్రిందులైనాయి. శంబూకుడు రామున్ని వధిస్తాడు. ఏకలవ్యుడు ద్రోణుని వేలు నరుకుతాడు. బలిచక్రవర్తి వామనున్ని పాతాళానికి తొక్కుతాడు. ఈ క్రమంగా తరతరాలుగా వస్తున్న అణచివేతకు ప్రతీకారంగా కవిత్వం వచ్చింది.
నాగప్ప గారి సుందర్రాజు ‘గుండెడప్పు’, ఎండ్లూరి సుధాకర్ ‘వర్తమానం’ కొత్త గబ్బిలం, బన్న అయిలయ్య ‘నిప్పుకణిక, నగేష్‌బాబు ‘వెలివాడ, మీరేవుట్లూ. సుంకర రమేష్ ‘తల్లికోడి హెచ్చరిక’, సతీష్ చందర్ ‘పంచమవేదం’ కొండపల్లి సుదర్శన్‌రావు ‘దళితకవిత’, కత్తి పద్మారావు జైలు గంటలు, నీలికేక, భూమి భాష, కట్టెలమోపు, ఆకుల గంగాధర్ ‘దళిత భారతి’, పైడి తెరెష్‌బాబు ‘అల్పపీడనం’, గుండెడప్పు కనకయ్య మాదిగకేక, వీణవంక, దండోర దరువు కడుపుమీద గొట్టకండ్రీ. దార్ల వెంకటేశ్వరరావు ‘దళితతాత్త్వికుడు, నెమలి కన్నులు, గ్యార యాదయ్య ‘ఎర్కోషి, చల్లపల్లి స్వరూపరాణి ‘మంకెనపూలు’, గూటం స్వామి ‘నీలి పతాక’, ‘ఏకీకరణ’, జీవి రత్నాకర్ ‘మట్టిపలక, వేముల ఎల్లయ్య ‘మొగి, మేమే, ముల్కి, నిమాషి, నేతల ప్రతాప్ కుమార్ ‘అన్నం గిన్నె’, భీవ్‌ుపాల్‌రాగం’, రావినూతల ప్రేమకిశోర్ ‘గుండె దరువు, నలుగురమవుదాం. విల్సన్‌సుధాకర్ ‘దళిత వ్యాకరణం, ఒక భాష కావాలి’, పిట్టల శ్రీనివాసు ‘అలుగు’, పొన్నా ల బాలయ్య ‘ఎగిలి వారంగ’ ప్రసాద మూర్తి ‘కలనేత’, భూతం ముత్యాలు ‘దుగిలి’, గాదె వెంకటేష్ ‘పోలి. కొమ్ము సుధాకర్ ‘ఉగ్గం’ సంపతి సోమయ్య ‘ఏశకాంత’, డప్పోళ్ళ రమేష్ ‘కువ్వ’, మంథని శంకర్ ‘తునకలందని దండెం’ మొదలగు కావ్యాలు దళిత ప్రజలకి అండగా నిలిచి, వారి బాధలను సాహితీలోకానికి తెలియజేస్తూ దళిత కవిత్వం విస్తృతంగా వ్యాపించింది.
‘పదునెక్కిన పాటలో చల్లపల్లి స్వరూపరాణి, జి. విజయలక్ష్మి, వి.వి. వినోదిని దళిత స్త్రీల సమస్యలను తమదైన కోణంలో రాసారు తరువాత జూపాక సుభద్ర ‘దళిత స్త్రీ కవిత్వం’ రాసింది. అయితే స్త్రీవాద రచయితలు కొందరు దళిత స్త్రీ వాద కవిత్వం స్త్రీ వాదంలో భాగంగా పరిగణించారు. కాని దళిత స్త్రీ వాదులు స్వయంగా దళిత కవిత్వంలో భాగమే తమ కవిత్వమనే భావనన్ని వ్యక్తపరిచారు.
మంకెనపువ్వు, పనిపిల్ల, వంటి కవితలెన్నో వచ్చాయి. దళిత కవితా సంకలనంలో ముఖ్యంగా ‘చిక్కనవుతున్న పాట’ పదునెక్కిన పాట, గుండెడప్పు బహువచనం కైతునకల దండెం వంటి సంకలనాలు వచ్చాయి. దళిత దీర్ఘ కవితలు మద్దూరి నగేష్‌బాబు రచ్చబండ మొదటి దళిత దీర్ఘకావ్యం, లోయ, పుట్ట దీర్ఘకావ్యాలు రాసాడు, పైడి తెరెష్‌బాబు హిందు మహాసముద్రం (క్యాసెట్) బన్న అయిలయ్య నిప్పుకణిక, జూలూరి గౌరిశంకర్ ‘పాదముద్ర’, ఎండ్లూరి సుధాకర్ ‘కొత్తగబ్బిలం’, ఆర్ రామకృష్ణ ‘గొడిముక్క’, సుంకర రమేష్, తల్లి కోడి, హెచ్చరిక; రావినూతల ప్రేమ కిశోర్ గుండెదరువు, చెరుకు సుధాకర్ ‘అనగనగా మెరిట్’, జివి రత్నాకర్ ‘అల’, గ్యార యాదయ్య ‘ఎర్కోషి’ ఎజ్రాశాస్త్రి దొడ్డుకర్ర మున్నగు దీర్ఘ కావ్యాలు వచ్చాయి. నగేష్‌బాబు దళితులపై జరుగుచున్న అన్యాయాన్ని ఎండగట్టాడు. ఎక్కువ కులం వారు చేసిన దౌర్జన్యానికి తీర్పు ఇచ్చే విధంగా ‘రచ్చబండ’ దీర్ఘకావ్యముంది. “ఏ మనుషుల్ని పనిముట్లని చేసి/మీ పనులను చక్కదిద్దుకున్నారో/ఏ మనుషుల్ని మీ బూటకాల చరిత్రకు/ప్రయోజనాలకు దూరంగా ఉంచారో/అ మనుషులే చరిత్ర రాస్తున్నారు” ఇన్నాళ్ళు మీరు ఇనుప జాడిల్లో దాచిపెట్టిన పవిత్రగ్రంథాలు, అవి కాదు చరిత్ర. ఇప్పుడు మేము రాసిందే చరిత్రని ఈ దేశం మా ప్రణాళిక, ఈ జనం మా మనిషి మా గమ్యమని కుల వర్ణాలు లేని దేశం కోసం ధిక్కారాన్ని ఆయుధంగా ప్రకటించాడు. బన్న అయిలయ్య ‘నిప్పు కణిక’లో, దళితుడి సాంస్కృతిక మూలాలను వెదకి పట్టుకున్నారు. రుగ్వేదం, పురుషసూక్తం, మనుధర్మం, పుట్టకముందే దళిత సంస్కృతి వెల్లివిరిసిందని చాటాడు.
“ఎవడి హక్కుల పక్కరా ఈ నేల/ ఎవడి కాపలా కుక్కరా ఈ చరిత్ర”/అంటూ అగ్రకుల అహంకారాన్ని ప్రశ్నించాడు. ప్రకృతి దళితులోంచి పుట్టిందని ప్రకృతి దళితుల ‘ప్రతీక’ అంటారు. “నాగటి చాళ్ళలో మా బొటన వేళ్ళజాడ వెదకండి/ మా శ్రమ సంతకాల్ని గుర్తించండి”./ చెమటకు చిరునామా దళితులు, మా కష్టాలను గురించి ఆలోచించమని అగ్ర వర్ణాలను కోరుతూ దళితులను చదువుకు దూరం చేసి వారి శ్రమను అగ్రకులస్థులు దోచుకున్నారని ఆవేదన వ్యక్తపరుస్తారు. మాదిగ కవిత్వం మాదిగలకు సమాన హక్కులు కల్పించాల్సిన “మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి’ ఉద్యమం సాగింది. ఈ ఉద్యమానికి ప్రేరణ ద్వార వచ్చిన కూడా దళిత కవిత్వంలో భాగంగా చెప్పుకున్నారు. మొదటి కవిత్వం నాగప్ప గారి సుందరరాజు ‘చందాల చాటింపు; గుండె డప్పు మాదిగ కేక, మాదిగ చైతన్యం; ఎండ్లూరి సుధాకర్ ‘వర్గీకరణీయం’ సంపతి సోమయ్య ‘ఏశకాంత’ డప్పోల్ల రమేష్ ‘కువ్వ; మంథని శంకర్ ‘తునకలందని దండెం’ మొదలగునవి మాదిగ రిజర్వేషన్ సంబంధించిన అంశాలపై కవిత్వం వచ్చింది.