Home జాతీయ వార్తలు బెంగళూరులో తెలుగు పారిశ్రామికవేత్త దారుణ హత్య

బెంగళూరులో తెలుగు పారిశ్రామికవేత్త దారుణ హత్య

MURDERబెంగళూరు: ఎపికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సురేంద్రనాథ్‌ కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని సంజయ్‌నగర్‌లో గల ఆయన నివాసం వద్ద దుండగులు తుపాకీతో కాల్చిచంపారు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సురేంద్రపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే రక్తపు మడుగులో పడి ఉన్న సురేంద్రను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కొనఊపిరితో ఉన్న ఆయనను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేంద్ర సోమవారం ఉదయం మృతిచెందారు. కాగా, సురేంద్రనాథ్‌కు వ్యక్తిగతంగా నలుగురు గన్‌మెన్లు ఉండేవారని, వారు లేని సమయంలో దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.