Home దునియా కారుడిక్కీలో పిస్తోలు

కారుడిక్కీలో పిస్తోలు

gunస్పీడుగా దూసుకుపోతున్న కారుకు పోలీస్‌జీప్ రోడ్డుకు అడ్డంగా ఎదురయ్యింది. సడన్ బ్రేకుతో కారాపాడు డ్రయివర్ రెహమాన్ (40). పోలీస్
జీప్‌కు కొద్దిదూరంలో ఆగింది. పోలీసులు చిరాగ్గా చూసి ఏమిటా స్పీడు? ఎంతస్పీడులో పోతున్నావు? నిత్యం యాక్సిడెంట్లు అవుతున్నా ఎవరికి బుద్ధిరావడంలేదు.
“సార్, ట్రయిన్ మిస్‌కాకూడదని మేమే డ్రయివర్‌ను తొందరపెట్టాం.” లోపలవ్యక్తి చెప్పాడు. అతడి పక్కనే కూర్చున్న ఆమె కూడా ట్ర యిన్ రైట్‌టైమ్‌కు వస్తోంది. మేము లేట్ అయ్యాం.” గొంతు కలిపింది.
“కిందకి దిగండి ఒకసారి కారు చెక్ చేయాలి.”
లోపల కుర్రదంపతులు ఈసురోమంటూ డోర్సు విసురుగా తెరుచుకుని దిగారు. వారిలో ట్రయిన్‌ను మరి చేరుకోలేమన్న నిరాశ ముఖంలో ఆవరించింది.
డ్రయివర్ దిగాడు. నలుగురు కానిస్టేబుళ్లు ఆత్రంగా కారంతా వెతికారు. లోపల ఏమీ లేదన్నట్లు నిలబడ్డారు. కారుడిక్కీని ఇన్‌స్పెక్టర్ జాన్సన్ వెతికాడు. ఏవేవో కారు తుడిచిన గుడ్డలున్నాయి. వాటికింద ఇండియన్‌మేడ్ పిస్తోలుంది. దాన్ని చూడగానే జాన్సన్ కళ్లు పెద్దవయ్యాయి. దాన్ని ఓ మసిగుడ్డతో చుట్టి డ్రయివర్ వద్దకు వచ్చాడు.
“మాడమ్ చెకప్ అయిపోయింది. షార్టురూట్‌లో తీసుకుపోతాను. మీరు ఎక్కే ట్రయిన్‌కు ఇక్కడ వాటరింగ్ చేస్తారు. ట్రయిన్ కదిలేలోగా అందిస్తా” అని చెప్పాడు డ్రయివర్. ఆ కుర్రజంట కారులో దూరేందుకు రెడీ అవుతుండగా ఇన్‌స్పెక్టర్ మసిగుడ్డలో చుట్టబడి బయటికి పొడుచుకు వచ్చిన పిస్తోలును చూపించాడు.
“మీలో ఎవరిది? ఈ కంట్రీమేడ్ పిస్తోలు?”
ఒక్కసారి ముగ్గురు గతుక్కుమన్నారు. కళ్లు పెద్దవి చేసారు. ఇన్‌స్పెక్టర్ జాన్సన్ చేతులకు గ్లవుస్ తొడుక్కుని మసిగుడ్డలో చుట్టబడ్డ పిస్తోలును మసిగుడ్డ నుంచి వేరు చేసి చూపాడు. పిస్తోలును వాసన చూసాడు. కొన్ని గంటల క్రితం వాడారని అందులో గుండు పేలిన వాసన ఘాటుగా తగలడంతో నిర్ధారణకు వచ్చాడు.
“ఎవరిని చంపి పారిపోవాలనుకుంటున్నారు? ఎంత మందిని చంపారు?” ఇన్‌స్పెక్టర్ కటువుగా అడిగేసరికి బిక్కముఖాలేసారు.
కుర్రదంపతులు తలలు పట్టుకుని రోడ్డుమీద కూర్చుండి పోయారు. “ ఏమి కారయ్య? ట్రయిన్ ఎక్కించవయ్యా ! అంటే పోలీసు కేసు మెడకు చుడతావా?” అని వారు డ్రయివర్‌పై ఏడుపు ముఖాలతో ఆడిపోసుకున్నారు.
డ్రయివర్ రెహమాన్‌కు అయోమయంగా ఉన్నా ఎవరెవరు తన కారెక్కారో గుర్తు తెచ్చుకున్నాడు.
“ సార్, ఈ రోజు నాకారు ఎక్కిన వాళ్లంతా ముసలివాళ్లే. ఆసుపత్రులకే ట్రిప్‌లు వేసాను. వీళ్లు పార్కు జంక్షన్‌లో ఆపి రైల్వేస్టేషన్‌కు అర్జంటుగా తీసుకుపొమ్మన్నారు. వీరు డిక్కీవైపు పోలేదు సార్‌”
“ఠాట్ పిస్తోలు ఎక్కడిదిరా? ఎక్కడ ఎవరి మీద దాడిచేసి చంపావో చెప్పరా అంటే నీకారు ట్రిప్పులు చెబుతావా?” అని గుర్రెత్తిపోయాడు ఇన్‌స్పెక్టర్.
“సార్ మా పరిస్థితి ఏమిటి? మేము ట్రయిన్‌కు వెళ్లాలి” ఏడుస్తూనే అడిగింది కుర్ర జంటలో ఆమె.
బదులిచ్చేలోపే సెల్ రింగయ్యింది. చెవికి అదిమాడు. “ఇన్‌స్పెక్టర్ అసలు హంతకుడు తప్పించుకోవడానికి వాడు హత్యలో వాడిన పిస్తోలును ట్రాఫిక్‌లో ఆగిన కారు డిక్కీలో పడేసాడు. నిరపరాధులైన కారు డ్రయివర్‌ను ఆ కారులో ప్రయాణించే ఇద్దరు ప్యాసింజర్లను మీరు ప్రశ్నిస్తున్నారు.” ఇన్‌స్పెక్టర్ నాలుక కరుచుకున్నట్లు అయిపోయాడు. ఒక కానిస్టేబుల్‌ను తోడిచ్చి ఆ కుర్రజంటను రైల్వేస్టేషన్‌కు పోలీస్‌వారి వాహనంలో పంపేసాడు. తాను కారెక్కి డ్రయివర్ రెహమాన్‌తో కారెక్కడక్కడ తిరిగిందో గుర్తుచేసుకుని మరీ చెప్పమన్నాడు. రెహమాన్ తెల్లవారిజాము నుంచి తిరిగే చోట్లన్నీ చెప్పాడు. అన్నీ నోట్ చేసుకుని “నన్ను పోలీస్ ఠాణా వద్ద దింపేసి వెళ్లు. మళ్లీ మళ్లీ

పిలుస్తామని భయపడకు. ఈ పిస్తోలు నీ కారు డిక్కీలో దొరికిన విషయం మరిచిపో!”
***
నగరంలో ఏ ఠాణాలో హత్య జరిగినట్లు నమోదు కాలేదు. హత్య చేసాడా? గాయం చేసాడా? దొరికన పిస్తోలుపై హంతకుడి వేలిముద్రలుంటాయని వేలిముద్రనిపుణులకు ఇచ్చాడు. హంతకుడి కదలికలన్నీ పోలీసులకు లైవ్‌లో చెప్పినట్లు చెప్పిన సెల్ ఎవరిది? ఆ నెంబర్ ఆరా తీయించాడు.
రెండు రోజులయినా కారు డిక్కీలో దొరికిన పిస్తోలు కేసు ముందుకు సాగలేదు. ఇన్‌స్పెక్టర్ జాన్సన్ ట్రాఫిక్‌లో ఆగిన రెహమాన్ కారు డిక్కీ తెరిచిన ఆగంతకుడు వెనుక నుంచే కన్పించేలా సిసి ఫుటేజ్ ఉంది. దానివలన ఆ వ్యక్తిని పసిగట్టలేం అని నిర్ధారణకు వచ్చేసాడు. కారులో ప్రయాణించే కుర్రజంట చిరునామా, సెల్ నంబర్లు వారితో రైల్వేస్టేషన్‌కు వెళ్లిన కానిస్టేబుల్ సేకరించి నోట్‌చేసాడు. వారిని కదిపి చూస్తే ఏమైన క్లూ దొరుకుతుందేమోనని రింగ్ చేసాడు. కుర్రజంటలో ఆమె ఫోన్‌లో ఇన్‌స్పెక్టర్ గొంతువిని తత్తరపడింది “ఏమిటిసార్? మీనుంచి ఫోన్?”
“ఆ రోజు ట్రాఫిక్‌లో కారు ఆగినప్పుడు కారు డిక్కీని డ్రయివర్ కాకుండా వేరెవరినైనా తెరవడం చూసావా?”
“చూడడమే కాదు. ఆ ట్రాఫిక్ బాగున్నందున నా సెల్‌లో వీడియో తీసాను. అందులో మా కారు డిక్కీని ఇలా తెరిచి అలా మూసేసిన వ్యక్తికూడా నా సెల్ వీడియోలో రికార్డు అయ్యాడు. మీ సెల్‌కు ఆ వీడియో పంపేయనా?”
ఆమె చెప్పిన మాటలకు ఒక్కసారి ఎలర్టు అయ్యాడు ఇన్‌స్పెక్టర్ జాన్సన్.
“ వెంటనే పంపేయండి. నాతో మాట్లాడుతున్న మీ సెల్‌లో ఆ వీడియో క్లిప్ ఉందా?”
“క్షణాల్లో పంపేస్తాను సార్‌”
కొద్ది క్షణాల్లో వీడియో వచ్చేసింది. కళ్లుసాగదీసుకుని వీడియోలో కారుడిక్కీ తెరిచి వెంటనే మూసేసిన వ్యక్తి ముఖం క్లియర్‌గా వీడియోలో ఉంది. మరి ఆలస్యం చేయకుండా నగరంలో ఉన్న అన్ని ఠాణాలకు ఆ వీడియో క్లిప్ పంపించి గుర్తించమని కోరాడు. ఓ గంటలో జూపార్కు రోడ్డులో ఉన్న ఠాణా నుంచి వివరాలు వచ్చాయి.
కారు డిక్కీ తెరిచి ఆ వెంటనే డోర్ మూసిన వ్యక్తి పేరు ముజిబ్(45) పాత నేరస్థుడే. తరచు భార్యలను మారుస్తుంటాడు. అతన్నించి విడిపోయాక ఆ యువతులు మరి కన్పించరు. ఏమవుతారో తెలియదు. ప్రస్తుతం అతడు డోర్‌లాక్ చేసి ఎక్కడికో మూడు రోజుల క్రితం వెళ్లిపోయాడని ఇరుగు పొరుగు చెప్పారని ఆ వివరాలు అక్కడ ఠాణా పోలీసులు మెసేజ్ పెట్టారు.
మరోవైపు సెల్‌లో ఆ రోజు తనకు హంతకుడి కథనాలు విన్పించిన అపరిచితుడు ఎవరన్నది సైబర్ పోలీసులు ఆరా తీసి వాట్సాప్ చేసారు. అతడు చెప్పులు కుట్టుకునే భల్లూ(65) అని తేల్చారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కారుడిక్కీలో పిస్తోలు కేసు ముడి విడిపోతున్నందుకు ఇన్‌స్పెక్టర్ జాన్సన్ ఎంతో ఉత్సాహంగా పోలీస్‌వాన్ వైపు ఇద్దరు కానిస్టేబుళ్లతో కదిలాడు.
తిన్నగా దర్గారోడ్డులో ఉన్న చెప్పులు కుట్టే భల్లూని వెతుక్కుంటూ అతడింటికి వెళ్లాడు. ఒకేగది ఇల్లు అది. అందులో భల్లూ పోలీసులను చూడగానే తడబడ్డాడు. భల్లూని పట్టుకుని జేబులో ఉన్న సెల్ తీసి దాని నంబర్‌చూసి అదే నెంబర్, అని కన్‌ఫమ్ చేసాడు కానిసేబుల్.
భల్లూని వాన్ ఎక్కించుకుని పోలీస్ ఠాణాకు తీసుకు పోయారు. అక్కడ విచారణలో భల్లూ చాలా విషయాలు వెల్లడించాడు.
హంతకుడు ముజిబ్ పాత నేరగాడు. అతడు స్వయాన నాకు మేనల్లుడు. వాడికి ఎన్నిరకాలుగా చెప్పుకున్నా వాడిలో మార్పు వచ్చేది కాదు. వాడు సహజంగా అందగాడు. వాడికి పేద ముస్లిం అమ్మాయిలు పడేవారు. కొన్నాళ్లు వారితో కాపురం చేసి ఆ పైన అరబ్బుల కోసం పెద్ద ధరలకు కొనే ముఠాలకు అప్పగించేవాడు. ఇలా చాలా మందికి వాడు నమ్మించి వంచించాడు. అయితే వాడు చేసే పాపం వాడికి శాపంగా మారింది. ఈ మధ్యకాలంలో మరో యువతిని తెచ్చి కాపురం చేసాడు. అరబ్బుల ఏజంటు ఒకడు ముజిబ్ ఇంట్లో యువతిని చూసి ఎంత ధరయినా చెల్లిస్తాను. అప్పగించమన్నాడు. ఎందుకో ముజిబ్ బేరాన్ని కాదనలేదు. కాపురం చేస్తున్న ఆమెను వదులుకోలేక హత్యకు పాల్పడ్డాడు. పెద్దమొత్తానికి ఆమెను అప్పగిస్తానని ఆ డబ్బుకొట్టేసి వాడిని ఓ పాడుబడిన ఇంట్లో తీసుకువెళ్లాడు. అక్కడ మందువిందు చేసాడు. వాడిని మత్తులో ముంచెత్తి నేను చూస్తుండగా నాటు పిస్తోలుతో ఢామ్‌మనిపించేసాడు. నన్ను భయపెట్టి పాడుపడ్డ ఇంట్లోనే ముందే తవ్విన గోతిలో శవాన్ని పాతిపెట్టాడు. నాకెందుకో కాళ్లూచేతులు ఆడలేదు. అందుకే వాడు అద్దె కారు లో నగరం వదిలి పారిపోతుంటే వాడిని పట్టించేందుకు వాడి కదలికలు మీకు చెబుతూనే ఉన్నాను.”
పిస్తోలు శబ్దానికి చుట్టుపక్కల వారు రాలేదా?”
“ఆ వీధిలో నాలుగైదు పెళ్లిళ్లు ఆ బాజాల మోతల్లో గుండు పేలిన శబ్దం ఎవరికి శోకలేదు.”
భల్లు మాటలు ఆసక్తిగా విన్నారు పోలీసులు.
“ముజిబ్ ఎక్కడికి పారిపోయాడు?” ఇన్‌స్పెక్టర్ అడిగాడు.
“కాన్పుర్ పారిపోయి ఉంటాడు. అతడితో ఉన్న ఆమెది కాన్పూరే. ఆమెకు బంధువులున్నారు. అక్కడ కొన్నాళ్లు గొర్రెపోతు చర్మాల వ్యాపారం చేసుకుని బతుకుతాడు. వాడిబుద్ధి ఎప్పు డు మారదు. మళ్లీ నేరాలు చేస్తాడు. రక్తపాతంతో కూడిన డబ్బేవాడికి మహాఇష్టం” అని చెప్పాడు.
“కాన్పూర్‌లో ఎక్కడ?”
“షుక్లాగంజ్ పేరు ఆమె నోట చాలాసార్లు విన్నాను.”
“నీవు ఈ హత్యకేసులో సహాయపడ్డావు. శవం ఎక్కడ పాతిపెట్టారో చూపించు. ఇందులో నీ పాత్రలేదు. నేరంలో నీకు భాగమే లేదు.”
“ అవును సాబ్. వాడు నా బేటా లెక్క. నా బహెన్ కొడుకు. వాడు ఎప్పుడూ నేరమనస్థత్వంతో సాగాడు. వాడిలో ఏమాత్రం మానవత్వం ఉండేదికాదు. జాలి అనేది వాడికి కన్నవారిపైనే ఉండేది కాదు. వారిని ఆకలి కేకల్లో వదిలేసాడు. వాడి ఆగడాలు అరికట్టే శక్తిలేక మీతో పట్టించేద్దామని ఈ హత్యను బయట పెట్టాను”.
“ ఆ పాతబడ్డ ఇంటిలో ఎంతమందిని చంపి పూడ్చాడు.?”
“ఈ హత్యే నా కంటపడింది. మీ దృష్టికి తీసుకువచ్చాను.”
భల్లూ పాడుబడ్డ ఇంట్లో చూపిన చోట తవ్వితే అమ్మాయిలను కొనే ఏజంట్ శవం బయటపడింది. హంతకుడి వేట ఆరంభం అయ్యింది.
వారం తిరక్కుండానే కాన్పూర్ వెళ్లిన పోలీసులు హంతకుడు ముజిబ్‌ను అరెస్టుచేసి తీసుకువచ్చారు….
***

Telugu Crime Story
                                                                   యర్నాగుల సుధాకరరావు,  99852 65313