Home ఎడిటోరియల్ ఉల్లం‘ఘనత’లు

ఉల్లం‘ఘనత’లు

India successfully conducts anti satellite missile test కోడి కూతతో తెల్లారుతుందనే నమ్మకం ఇంతవరకు విఫలం కాలేదు. కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎన్నికల నియమావళి)కు ‘కోడ్’ అని కుదింపు పేరు పెట్టుకున్నాం. ఎన్నికల తేదీల ప్రకటనతోనే నియమావళి కూడా అమల్లోకి వస్తుంది. ఆ వార్తకు ‘కోడ్’ కూసింది అంటూ చమత్కార శీర్షిక పెట్టుకోడం అలవాటైంది. అయితే కోడి కూతతో తప్పనిసరిగా తెల్లవారుతున్నట్టు ‘కోడ్’ కూయగానే నియమావళి పాటింపు జరగడం లేదు. ఉల్లంఘన, అతిక్రమణ అపరిమితంగా సాగిపోతున్నాయి. వీరు, వారు అనే తేడా లేకుండా దాదాపు అన్ని పార్టీల్లోని వివిధ స్థాయిల నాయకులందరూ తమ ప్రసంగాలు, చర్యల ద్వారా నియమోల్లంఘనకు పాల్పడుతున్నారు. గవర్నర్లు, ముఖ్యమంత్రులు కూడా ఇందుకు మినహాయింపు కాలేకపోతున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, స్వచ్ఛంగా జరగడానికి వీలుగా రాజ్యాం గం 324 అధికరణ కింద ఎన్నికల నియమావళి రూపుదిద్దుకున్నది. పార్లమెంటు, శాసన సభ ఎన్నికల్లో ఈ నియమావళి ఖచ్చితంగా అమలయ్యేలా చూసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి సంక్రమించింది.

ప్రచారంలో కుల, మత భావజాలాలను వినియోగించకుండా, అవాస్తవ సమాచారాన్ని ఆధారం చేసుకొని ప్రత్యర్థులపై విమర్శలు చేయకుండా, ఓటర్లను డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లోనుచేయకుండా, ఎదుటివారి అభిప్రాయాలపట్ల నిరసన వ్యక్తం చేయడానికి వారి ఇళ్ల వద్ద ప్రదర్శనలు వంటివి జరపకుండాను ఇతరత్రా కట్టుబాట్ల కోసం తగిన నియమాలను అమలు పర్చడమే ఈ ‘కోడ్’ ప్రధానోద్దేశం. ఇప్పుడు సాగుతున్న 17వ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో ప్రధాని మోడీ కూడా నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణకు గురి అయ్యారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి పాటవ ప్రదర్శన సమాచారాన్ని ఆయన స్వయంగా ప్రభుత్వ ప్రసార సాధనాల ద్వారా జాతికి తెలియజేయడాన్ని ప్రతిపక్షాలు ఎత్తి చూపాయి. అది ఉల్లంఘన కాదని కేంద్ర ఎన్నికల సంఘం తీర్పు ఇవ్వడంతో ఆ వివాదం సమసిపోయింది. సాధించిన విజయాలను ప్రజాధనంతో అధికారిక ప్రచార ప్రసార సాధనాల ద్వారా చెప్పుకొని ఎన్నికల్లో విజయావకాశాలను మెరుగుపరుచుకునే ప్రయ త్నం కూడా తప్పేనని కోడ్‌లోని అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నియమాలలో ఒకటి స్పష్టం చేస్తున్నది.

తాజాగా రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ ప్రవర్తనను మాత్రం ఎన్నికల సంఘం తీవ్రంగా తప్పుపట్టింది. ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లో బిజెపి నేతల మధ్య విభేదాలను పరిష్కరించే క్రమంలో ఆ పార్టీ గెలవాలని, మోడీ మళ్లీ ప్రధాని కావాలని అందుకోసం ఘర్షణలకు స్వస్తి చెప్పాలని కల్యాణ్ సింగ్ చేసిన బహిరంగ ఉద్బోధ ఆయనను ఇరకాటంలో పడవేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సమగ్ర విచారణ జరిపి కల్యాణ్ సింగ్ ప్రవర్తనను తీవ్రంగా ఆక్షేపించింది. ఒక రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఆయన ఎన్నికల నియమాన్ని బాహాటంగా ఉల్లంఘించిన మాట వాస్తవమేనని స్పష్టం చేసింది. ఆయనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేస్తానని కూడా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఇలాంటి ఉల్లంఘనలు మరెన్నో సాగిపోతున్నాయి. పార్టీలు, నేతలే కాకుండా కేంద్ర ప్రభుత్వ శాఖలు, పబ్లిక్ రంగ సంస్థలు కూడా ఉల్లంఘనతలో తమ సత్తా చాటుకుంటున్నాయి. ప్రధాని ఫోటో ముద్రించిన రైలు టికెట్‌లు అమ్మినందుకు, మై భీ చౌకీదార్ నినాదాలున్న టీ కప్పులను వాడినందుకు రైల్వే శాఖపై ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది. సంజాయిషీ నోటీసు జారీ చేసింది. మోడీ ఫోటోలను బోర్డింగ్ పాసులపై ముద్రించినందుకు ఎయిర్ ఇండియానూ ఇసి నిలదీసింది. కారణాలు తెలపాలని ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇవ్వనందుకు ఆగ్రహిస్తూ లేఖ రాసింది.

హద్దులు మీరడంలో అందెవేసిన చేయి అనిపించుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ వీరందరి కంటే రెండాకులు ఎక్కువే చదివారు. నేరుగా భారత సైన్యాన్నే ప్రచార బరిలోకి లాగారు. ‘టెర్రరిస్టులకు కాంగ్రెస్ బిర్యానీలిచ్చింది, ప్రధాని మోడీ సైన్యం మాత్రం వారిని బుల్లెట్లు, బాంబులతో అణచివేసింది’ అని ఒక ప్రచార సభలో యోగి పలికిన పలుకులు సైన్యాధికారులను నివ్వెరపరిచాయి. సైన్యాన్ని ఎన్నికల యుద్ధంలోకి లాగొద్దని నౌకాదళ మాజీ అధిపతి అడ్మిరల్ లక్ష్మీనారాయణ్ రామ్‌దాస్ వంటి సైన్యాధికారులు విజ్ఞప్తి చేశారు. రాజకీయ ప్రయోజనాలకు సైన్యాన్ని వాడుకోడం సిగ్గుచేటన్నారు. సైన్యం రాజ్యాంగానికి, రాష్ట్రపతికి మాత్రమే విధేయంగా ఉంటుందని అది పూర్తిగా రాజకీయేతరమైనదని వారు స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఏ గడ్డి అయినా తినడం మితిమించుతున్నదని ఈ ఉల్లంఘనుల నిర్వాకం చాటుతున్నది. వీటిని అరికట్టి రంగంలోని అన్ని పార్టీలకు సమాన వేదికగా ఎన్నికలను తీర్చిదిద్దవలసిన బాధ్యత రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం మీద ఎంతైనా ఉన్నది.

Telugu Essay on Election Code