Thursday, March 28, 2024

పరిణామక పదాలు

- Advertisement -
- Advertisement -

ఆంగ్లభాషలో modifiersఅనేవి ఉన్నాయి.వాక్యాలలోని ఇతర పదాల పరిణామానికి కారణమయ్యేమాటలను modifiers అంటారు ఆ భాషలో. కానీ ఇవి సాహిత్య ఉపకరణాల (literary devices) కిందికి రావు. ఆంగ్లంలోని ఇట్లాంటి కొన్ని పారిభాషిక పదాలను తెలుగు చేయడం అంత సులభం కాదు. అందుకే ఇంతకు పూర్వం ఒక వ్యాసంలో చెప్పిన మెటానమీ (metonymy), సినిక్డికి (synecdoche) లకు తెలుగు మాటలను ఇవ్వడానికి సంశయించి, మానుకోక తప్పలేదు. నిజానికి వాటిస్థానంలో సంపూర్ణ ఆపాదకాలు, పాక్షిక ఆపాదకాలు అనే తెలుగు పదాలను సూచించవచ్చు. కానీ వాటిని చదివి ఆక్షేపణ తెలిపేవారెందరో ఉంటారు మన తెలుగువారిలో.

పరిణామక పదం(modifier) కూడా అటువంటి మాటే.ఈ మూడు పదాలు పూర్తిగా సంతృప్తికరమైన, సమానార్థకమైన మాటలు కావనుకుంటే, భాషాశాస్త్రజ్ఞులు మరింత మంచివాటిని సూచించేవరకు వీటిని ఉపయోగించవచ్చుననుకుంటాను. తమిళులు ఇట్లాంటి సంశయాలకు లొంగరు. వారిలో మాతృభాష సంపూర్ణంగా ఉండాలనే కోరిక తక్కినవాటిని నిర్దాక్షిణ్యంగా తొక్కి వేస్తుంది మరి! అంటే, dissent ను(అసమ్మతిని) వెలిబుచ్చే వెసులుబాటును, మాతృభాష వైభవం కోసం వాళ్లు త్యాగం చేస్తారన్న మాట. ఈ విషయంలో వారి ఐకమత్యం మెచ్చుకోతగింది.

ఆంగ్లంలో ఈ modifiersవిశేషణాలు కావచ్చు, లేదా క్రియావిశేషణాలు (adverbs) కావచ్చు. ఆంగ్ల భాషాశాస్త్రంలో వీటిని గురించిన విస్తృతమైన వివరణ ఉంది కానీ,నాకు తెసినంత వరకు తెలుగులో లేదు. కాబట్టి, కొంచెం చర్చిస్తే ఉపయోగకరంగా ఉంటుందనుకుంటాను. తెలుగులో పరిణామక పదానికివివరణాత్మకమైన క్లాసికల్ ఉదాహరణ చాలా కాలం క్రితం ఈ వ్యాసకర్త రాసిన ఒక చిన్న పుస్తకంలో కనిపిస్తుంది. నేను దాదాపు ఆరు నెలలుగా వ్యాధితో బాధ పడుతున్నాను, అనే వాక్యంలో ‘దాదాపు’ ఒకmodifier. అది ‘ఆరు నెలలు’ను కొంచెం మార్చుతున్నది. ఈ వాక్యంలో modifier సరైన స్థానంలో వచ్చింది కనుక, ఇసుమంతైనా అయోమయం చోటు చేసుకోలేదు. కానీ, అది ఒకవేళ వాక్యపు ప్రారంభంలో వస్తే,దాదాపు నేను ఆరు నెలలుగా వ్యాధితో బాధ పడుతున్నాను అన్న వాక్యం ఏర్పడుతుంది.

అప్పుడు ‘దాదాపు’ ఆరు నెలలును ప్రభావితం చేసే బదులు నేనును ప్రభావితం చేస్తుంది. దీన్నే misplaced modifier అంటారు ఆంగ్లభాషలో. ఇటువంటిదే ఐన మరొక ఉదాహరణను పరిశీలించండి: సి.సి. కెమెరాలతో దాడి చేసిన దుండగులను పోలీసులు గుర్తించారు. ఇక్కడ కెమెరాలతో తర్వాత కామా లేదు కనుక, దుండగులు సి.సి. కెమెరాలతో దాడి చేశారు అనే అర్థం వస్తుంది. అందుకు కారణం పరిణామక పదం (సి.సి. కెమెరాలతో అనే phrase) సరైన స్థానంలో ఉండకపోవడం.దీన్ని సరిచేయాలంటే ఈ వాక్యాన్ని, దాడి చేసిన దుండగులను పోలీసులు సి.సి. కెమెరాలతో గుర్తించారు, అని మార్చవలసి ఉంటుంది. ఇట్లాంటి ఎన్నో తెలుగు వాక్యాలను ఉదాహరణలుగా చూపవచ్చు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, modifier అన్నది తెలుగుభాషలో కూడా ఉంది కానీ, దానికి మనం ప్రత్యేకమైన పేరును ఇచ్చి భాషాశాస్త్రంలో చేర్చలేదు అని.ఈ వ్యాసంలో ప్రధానంగా చెప్పదల్చుకున్న విషయాలలో ఇదొకటి.

ఒక మనిషి సరిగ్గా ఎలా కనిపిస్తున్నాడు? ఒక పని సరిగ్గా ఎలా చేయబడుతోంది? ఒక సంఘటన ఎక్కడ, ఎప్పుడు, ఏవిధంగా జరిగింది?ఈ ప్రశ్నలకు, modifierద్వారానే, అన్నది సమాధానం.ఆంగ్ల వాక్యాలలో సాధారణంగా ఈ పరిణామక పదాలు ఏ నామవాచకాన్నైతే లేదా క్రియనైతే, లేదా (క్రియా)విశేషణాన్నైతే పరిణామానికి గురి చేస్తున్నాయో, దానికి పక్కనే (కుడి వైపున లేదా ఎడమ వైపున)ఉండటం రివాజు.కానీ ప్రతి సందర్భంలో అలా జరగకపోవచ్చు.నేను ఉపన్యాసాన్ని శ్రద్ధగా విన్నాను. నేను శ్రద్ధగా ఉపన్యాసాన్ని విన్నాను. ఈ రెండు వాక్యాలలో శ్రద్ధగా అన్నది modifier. అది విన్నానును modifyచేస్తున్నది,లేదా ప్రభావితం చేస్తున్నది, లేదా వర్ణిస్తున్నది.కానీ, శ్రద్ధగా నేను ఉపన్యాసాన్ని విన్నాను అన్నప్పుడు, modifier నేనుకు పక్కన వస్తున్నది. అయితే ఇక్కడ భావప్రసరణకు పెద్దగా ఆటంకం కలగలేదన్నది వాస్తవం. ఐనా, మొదటి రెండు వాక్యాలలో ఉన్నంత హాయి, సౌలభ్యం(ease)మూడవ వాక్యంలో లేవు.

ఇంగ్లిష్ భాషలో dangling modifier, squinting modifierఅనే వేరియెంట్స్ (రూపాంతరాలు)కూడా ఉన్నాయి. ఒకసారి ఒక కారు వెనుక అద్దం మీద ఈ ఆంగ్లవాక్యం కనిపించింది: If driving rashly, call 6345917020. ఆ కారును ఆ డ్రైవరు అశ్రద్ధగా నడిపాడని భావించి మనం ఆ నంబరుకు ఫోన్ చేసి నిలదీస్తే,నువ్వు కారును అశ్రద్ధగా నడపటమే కాకుండా నన్ను ప్రశ్నిస్తున్నావా? అని దబాయిస్తాడతడు! అది సమంజసం కూడా. ఎందుకంటే, ఆ వాక్యంలో కర్తను సూచించే మాట లేదు.If I am driving rashly అని అనలేదు అతడు.కనుక, అది If you are driving rashly.కూడా కావచ్చు.పైగా call me అనే పదాలు కూడా లేవు ఆ వాక్యంలో. కాబట్టి, అశ్రద్ధగా నడుపుతున్నది మనమే అయ్యే అవకాశముంది! Dangling modifierను ఉపయోగిస్తూ ఒక దోషభూయిష్ఠమైన వాక్యాన్ని రాసి, పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునే తెలివితేటలంటే ఇవే! వాక్యాలలో పదాలు సరైన స్థానాల్లో ఉండకపోతే గందరగోళం ఏర్పడుతుంది కనుక, modifiers లాంటివాటిని ప్రయోగించేటప్పుడు జాగ్రత్త అవసరం అన్నది కూడా ఈ వ్యాస ముఖ్య ఉద్దేశాలలో ఒకటి.

-ఎలనాగ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News