Home కలం తెలుగు అక్షరరోదన

తెలుగు అక్షరరోదన

Telugu literature has thousands of years history

తెలుగు సాహిత్యమునకు వేలసంవత్సరాల చరిత్ర ఉంది. తెలుగు సాహిత్యం ఆధ్యాత్మికములోనైనా, శృంగారాది నవరసములలోనైనా, జాతిని జాగృతం చేయు విషయంలోనైనా, తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందింది. నన్నయ్య వ్రాసిన భారతము తెలుగులో మొదటి కావ్యము. అంతకు ముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు ఉన్నట్లు ఆధారాలు కూడా లభించాయి. గాథా సప్తశతిలో తెలుగు జానపద గీతాల ప్రస్తావన కూడా ఉంది. ఆనాటి సాహిత్యం శృంగారం, భావప్రధానమైనదిగా ఉండేది. అదే సాహిత్యం రాజులకు తొత్తుగా నిలిచి రాజులను, రాజచరిత్రను భుజానేసుకుంది. అం దుకే తర్వాత కాలంలో శ్రీ శ్రీ రాజుల చరిత్ర కాదు రాజసేవకుల చరిత్ర కావాలి అన్నారు. నిజానికి సాహిత్యమంటే చైతన్యం ఆ చైతన్యం ఎలా అయి నా ఉండవచ్చు. శృంగార రచనలతో శృంగార సమస్యలపై చైతన్యం తెస్తుంది. సామాజిక అంశాలతో సమాజం అంటే ఏంటి అని చెప్పి మేల్కొల్పింది. ఇలా ప్రతి రచన చైతన్యమే నిజానికి కవి రాసే ప్రతి అక్షరం చైతన్య కిరణమే మరి.
ఆనాడు సాహిత్యానికి మరియు సాహిత్యకారులకు కూడా మంచి గౌరవం ఉండేది. వారు చేసే రచనలకు కూడా ఆనాటి రాజులు విలువిచ్చి వారి రచనలను స్వయంగా రాజులే ముద్రించడంతో ఎన్నో రచనలు ఇప్పటికి మనకు అందుబాటులో ఉన్నాయి. మరి నేడు అలా ఎందు కు జరగడం లేదు.? ఎందుకంటే నేటి సాహిత్యం ప్రభుత్వాలకు తొత్తులుగా నిలవడంలేదు.., నిలబడకూడదు కూడా. ఎక్కువ శాతం ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే సాహిత్యకారులు నిలుస్తున్నారు అంటే దీని అర్థం ప్రజలకు అండగా సాహిత్యకారులు ఉన్నారనే కదా అర్థం.
అవును సాహిత్యం ఎప్పుడూ పేదలపక్షమే ఉండాలి. లేదంటే ప్రభుత్వాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తాయి. కావున సాహిత్యం ప్రభుత్వాలకు ఆనకట్టలాగే ఉండాలి. ప్రతి విషయంలో సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ప్రజల అభిరుచులను ప్రభుత్వాలకు నిర్మొహమాటంగా తెలియజేయాలి. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉంటే సాహిత్యకారులను చంపడం, బెదిరించడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాము. ఇలాంటి నీచమై న చర్యల వల్ల సాహిత్యకారులు భయపడేది లేనేలేదు. దేశ సరిహద్దులో దేశం కోసం ఆ వీరుడు వీరమరణం పొందితే దేశంలో వీర మరణం పొం దడానికి సాహిత్యకారులు, విప్లవకారులుగా ఎప్పు డు సిద్ధంగానే ఉంటాము.
అసలెందుకీ ఈ ప్రభుత్వాలకు సాహిత్యమంటే చులకన. ఆనాడు సాహిత్యకారులకు ఉద్యోగావకాశలు లభించేవి. నేడు తెలుగు మాధ్యమంలో చదివితే మన రాష్ట్రంలోనే మనకు ఉద్యో గం లభించదు. ప్రతిసంవత్సరం భాషను కొద్ది కొద్దిగా నాశనం చేస్తున్నారు. ఎందుకంటే భాషను చంపి సాహిత్యాన్ని అణగతొక్కి నిజాలను సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆటలో ఒక వ్యక్తి మెడల్ సాధిస్తే వారికేమో గ్రూప్-2 ఉద్యోగం ఇస్తారు, కోట్ల రూపాయలు కుమ్మరిస్తారు, మొత్తం మీద వారి కుటుంబాలు తరతరాలు బతికేలా చేస్తారు. మరి నిరంతరం సమాజం కోసం పాటుపడుతూ, సమాజం బాగుంటే తాను బాగుంటాను దేశం బాగుంటుందని రచనలు చేసే రచయితల పుస్తకాలు ముద్రించడానికి కూడా ప్రభుత్వాలు ఎందుకు సహాయం చెయ్యవు.
ఎంతమంది రచనలు చీకట్లో మగ్గుతున్నాయో ఎవరికి తెలుసు. సరే ఆఖరికి అకాడెమి అవార్డు పొందిన పుస్తకాలను కూడా ముద్రించడం లేదు. ఒక ఆటగాడు ఏదైనా ఆటలో మెడల్ గెలిస్తే కోట్ల రూపాయలు డబ్బులిచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి సాహిత్య అకాడెమి అవార్డు పొందిన వారికి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు? కవులు/రచయితలు నిరంతరం సమాజం కోసం పాటుపడే వారికి గుర్తింపు ఎందుకు ఇవ్వరు. కవులంతా ఇప్పుడు ఏకం కావాల్సిన అవసరం ఉంది. సమాజం కోసమే కాకుండా తమ కోసం కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరి హక్కులకై పోరాడే కవులు నేడు వారి హక్కులకై కూడా పోరాడాల్సిన సమయం వచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం కాస్తైన భాషను వారి యాసను బతికించుకునే ప్రయత్నం చేస్తోం ది. ఆ దిశగా సఫలం కూడా అవుతున్నారు. కవులు/ రచయితలకు తగిన విలువ కల్పిస్తున్నా రు. కానీ ఆంధ్రా ప్రభుత్వం తెలుగును చంపి సమాధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు వారి పౌరుషం చూపిస్తాము అని చెప్పడమే తప్ప అసలు తెలుగెందుకు నాల్గవ స్థానానికి పడిపోయింది. తెలుగు బతకడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. భాష బతకాలంటే సాహిత్యం ఉండాలి. మరి అలాంటి సాహిత్యాన్ని ప్రభుత్వాలు ఎందుకు గుర్తించవు? వెంటనే ఇల్లులేని కవులకు ప్రభుత్వమే ఇల్లు కట్ట్టించాలి. అరవై సంవత్సరాలు దాటిన సీనియర్ పేద కవులకు పించన్ ఇవ్వాలి. మంచి సాహితీ సంస్థలను గుర్తించి వారిని ప్రోత్సహించాలి.
సాహితీ సంస్థల పేరుతో నకిలీ భక్షణ వేదికలను నియంత్రించాలి. మంచి రచనలు చేసేవారిని పారదర్శకంగా గుర్తించి వారికి ప్రభుత్వ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలి. సాహిత్య కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టాలి. సాహిత్యానికి సెపరేట్ ఫండ్ ను ఏర్పాటు చేసి ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో లెక్కలతో సహా చెప్పాలి. పుస్తక ముద్రణ సంస్థలు చేసే దోపిడీని అరికట్టాలి. నిరంతర నిఘా పెట్టి ఒక రాష్ట్రం ఒకే ధర అనే నిబంధన తీసుకొచ్చి ఎక్కడైనా పుస్తక ముద్రణకు ఒకటే ధర అమలు అయ్యేలా చెయ్యాలి. ముద్రణ జరిగే ప్రతి పుస్తకం ప్రభుత్వ గ్రంథాలయాలలో పొందుపరచాలి. అప్పటిలాగే ప్రభుత్వం మంచి పుస్తకాలను విక్రయించాలి. ప్రతి పుస్తకానికి ఒక అంకె కేటాయిం చి ఎన్ని పుస్తకాలు ముద్రణ అవుతున్నాయో లెక్కలతో సహా వివరించాలి.
యువకులను సాహిత్యంవైపు నడిపించాలి ఇందుకోసం వారికి ప్రతి ఏటా అవార్డ్ నగదు బహుమతులు ప్రకటించాలి. ప్రభుత్వమే సాహిత్య సదస్సులో ఏర్పాటు చేసి యువ కవులకు దిశానిర్దేశం చేయాలి. కవులారా మేల్కొండి! ప్రభుత్వా లను ప్రశ్నించండి! మీ హక్కులకై పోరాడండి
నిజాగ్ని
సామాజిక విశ్లేషకురాలు