పాటెల్ల నొక్కచోనుండు
భాగ్యమొక్కచోనుండు
తాళ్లపాక అన్నమాచార్య
గడ్డకట్టిన ఛాందసత్వపు (ఇది శ్రీపాద వారి మాట) వంటి సామాజిక వ్యవస్థను కరిగించడానికి ఏ చిన్న ప్రయత్నం జరిగినా దానిని ప్రగతిశీల చర్యగా పరిగణించడం న్యాయం. స్థిరపడి, గిడసబారిపోయి వున్న వ్యవస్థలోనే దానిని మార్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. స్తబ్దత ఉన్నచోటే చలనం కూడా ఉంటుంది. ఈ లక్షణాలు సాహిత్యం, కళలలో ప్రతిబింబిస్తాయి. ప్రాచీన తెలుగు కవిత్వమంటే నన్నయ్య(1022) నుండి గోపీనాథ వేంకటకవి (1860) దాకా అని స్థూలంగా అనుకోవచ్చు (డా.సర్దేశాయి తిరుమల రావుగారి నిర్ధారణ).
దాదాపు ఎనిమిదిన్నర శతాబ్దాల కాలంలో వచ్చినది ప్రాచీన తెలుగు కవిత్వం. రాచరిక, భూస్వామ్య, వర్ణ, పురుషాధిక్య వ్యవస్థ అమలులో ఉన్నప్పటి కవిత్వం ప్రాచీన తెలుగు కవిత్వం. అయితే అదంతా ఒకే ఒక ముద్ద కాదు. అది రెండు రకాలు. ఆ కవిత్వాన్ని రాజాస్థాన కవిత్వం, ఆస్థానేతర కవిత్వం అని రెండు రకాలుగా వింగడించారు కె.కె.రంగనాథాచార్యులు వంటి ఆధునిక సాహిత్య విమర్శకులు. ఈ రెండు రకాల కవిత్వం ఒక రకంగా ఘర్షణ ఐక్యతతో కూడిన కవిత్వమే.
12వ శతాబ్దం నాటి పాల్కురికి సోమన, 15వ శతాబ్దం నాటి తాళ్ళపాక అన్నమయ్య, 17వ శతాబ్దం నాటి వేమన, పోతులూరి వీరబ్రహ్మం, మరికొందరు తత్వ, శతక కవులు మన పరిశీలనకు ఉపయోగపడతారు. వీళ్ళు ఇప్పుడు మనం వద్దనుకుంటున్న వర్ణవ్యవస్థలో కదలికలు తీసుకురావడానికి ప్రయత్నించా రు. ఇంకా అనేక మార్పులను వాళ్ళు ప్రతిపాదించారు. సోమన, అన్నమయ్యలు శైవ, వైష్ణవ మత ప్రతినిధులు.
వర్ణవ్యవస్థలోని కుల వివక్షను నిరసిస్తూ, కుల సమానత్వాన్ని కోరుకున్నారు. వేమన, వీరబ్రహ్మంలు ఆ ఇద్దరికీ భిన్నమైన తాత్వికులు, వీళ్ళు దానితో పాటు చాలా రకాలుగా సాంఘిక పరివర్తనను ఆకాంక్షించారు. శివునికి భక్తులు కావడానికి కులం, జెండర్ కొలమానాలు కాదని సోమన చెప్పాడు. బసవడు దళితులను తనవెంట తీసుకుని పోతుంటే, బిజ్జలుడు కుల సాంకర్యం చేయడం న్యాయమా? అని అడుగుతాడు. అందుకు బసవడు ‘మొన్న పుట్టిన కులమ్ముల మాటలేల?’ అని ఎదురు ప్రశ్న వేస్తాడు. పాల్కురికి సోమన స్త్రీ స్వేచ్ఛను సమర్థించాడు. సుగ్గలదేవి శైవ భక్తురాలు. ఆమె భర్త సింగబల్లహు డు జైనుడు. భర్తను భార్య అనుసరించాలి కదా అని బల్లహుడు ప్రశ్నిస్తే ఆమె తన స్వేచ్ఛను ప్రకటించిం ది. సోమన కావ్యాలలో సమకాలిక శైవ భక్తుల జీవితమే వస్తువు. వాళ్ళలో అధికులు దళిత బహుజను లు, మహిళలు. శ్రామికవర్గ ప్రజలు. భక్తి ఒక సా మాజిక విలువగా ఉన్న కాలంలో సోమన దానిని సార్వత్రికం చేశాడు. ఆయన కవిత్వంలో సంస్కృ త ఆధిపత్యాన్ని కూడా ధిక్కరించాడు.
పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు ప్రజల పాటలనే తీసుకొని పదాలు రచించాడు. వెంకటేశ్వరస్వామి భక్తుడు. దేవుని మీద ముప్పయి రెండువేల పదకవితలు రచించాడు. సాళువ నరసింహ రాయలు తన మీద పదాలు చెప్పమంటే చెప్పనని తిరగబడ్డాడు. ‘హరినెరిగినవాడు ఎవడు? అంటే,‘పరులు తానేయని భావించెడివాడు’ అన్నాడు అన్నమయ్య. కుల సమానత్వా న్ని ప్రతిపాదిస్తూ ‘బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే’ అనే పదం రాశాడు.
‘జంతుకులమింతానొక్కటే’ అని ప్రకటించా డు. నిద్ర, నేల, గాలి, ఆకలి, కామం, రుచి వంటి వి అన్ని కులాల వాళ్ళకూ సమానమని పదహైదవ శతాబ్దంలో చాటాడు. ‘ఆత్మవత్సర్వభూతాని’ అనే సిద్ధాంతం మాటలకే గా నీ చేతలలో కనిపించకపోవడాన్ని అన్నమయ్య విమర్శించాడు. అందరిలో ఉండే ఆత్మ ఒక్కటే అన్నాక, కులంతో జాతితో ఏమి పని? అని ఆయన ప్రశ్నించాడు.
‘ఆత్మ సకలవ్యాపకమని
తలపోసిన పిమ్మట
జాతియు, కులాభిమానము చర్చింపనే రాదు’ అన్నది ఆయన ప్రబోధం. అన్నమయ్య స్త్రీ, పురుషసమానతను ప్రతిపాదిస్తూ ‘పురుషులూ జీవులే, పొలతులూ జీవులే’ అన్నాడు. కుటిల రాజకీయా న్ని అన్నమయ్య తన కాలంలోనే ఆధిక్షేపించాడు.
‘చెప్పుడు మాటలే చెప్పుకొనుట గాని
చెప్పినట్లు తాము సేయడెవ్వడును’
అన్నాడు. అన్నమయ్య వెంకటేశ్వరుని సామాజీకరించాడు. అధికారం కోసం పాలకులు జరిపే మారణకాండను కూడా అన్నమయ్య నిరసించా డు. వేమన, పోతులూరి వీరబ్రహ్మం -ఈ ఇద్దరూ తమ కాలం కన్నా చాలా ముందు, బహుశా 21వ శతాబ్దం కన్నా ముందు ప్రగతిశీలంగా ఆలోచించి న కవులు. ఈ ఇద్దరూ ఆధునిక కాలంలో కొనసాగి న సంఘసంస్కరణోద్యమానికి, బ్రహ్మసమాజం, ఆర్యసమాజం, దివ్యజ్ఞాన సమాజం, సత్యశోధక సమాజం వంటి ఆధునిక సంస్థల కన్నా ముందే దేశీయ పునాది వేశారు. తె ల్లవాళ్ళు వచ్చే దాకా భారతదేశమంతా నిద్రపోతూ ఉండలేదు. కొందరైనా మే ల్కొని ప్రజలను మేల్కొలిపిన వైతాళికులున్నారు. వాళ్ళలో వేమన, వీరబ్రహ్మం తెలుగు ప్రతినిధులు.
యోగిగా, ప్రజాకవిగా ప్రసిద్ధుడైన వేమన తనకాలపు సామాజిక సమస్యల మీద యుద్ధమే చేశాడు. భారతీయ సామాజిక వ్యవస్థ శిథిలమై, మరో వ్యవస్థ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆ వ్యవస్థను కూలదోసి మార్పును వేగవంతం చేసిన కవి వేమన. సాంఘికంగా కులవ్యవస్థను, దాని వికృతరూపమైన అస్పృశ్యతను, కులాధిక్యతను, ఆర్థిక అసమానతలను, దాని మూలమైన సంపద కేం ద్రీకరణను, దాని రూపమైన అక్రమ సంపాదనను, దాని ఫలితమైన ధనిక దరిద్ర వర్గాలను, పరస్పర పీడన పరాయణత్వాన్ని, రాజకీయంగా పాలకుల కఠినాత్మకతను, వంచనా స్వభావాన్ని, తాత్విక మౌఢ్యతను, దాని అభివ్యక్తిరూపమైన కర్మకాండను, ముఖ్యంగా విగ్రహారాధనను, హేతుజ్ఞాన శూన్యతను, భాషాధిపత్యాన్ని ఇంకా అనేక అవలక్షణాలను వేమన ఎండగట్టారు.
సామాజికంగా కుల వ్యవస్థ నిర్మూలనను, ఆర్థికం గా సంపద వికేంద్రీకరణను అతడు ప్రతిపాదించా డు. సాహిత్యానికి ఉండే సామాజిక విమర్శనాశక్తిని సంపూర్ణంగా వినియోగించుకున్న కవి వేమన. పాల్కురికి సోమన, అన్నమయ్యలలో పరోక్షంగానో, పలచగానో కనిపించే శ్రమ గౌరవాన్ని మొదటిసారిగా సంపూర్ణంగా అభివ్యక్తం చేసిన కవి వేమన. ఆయన అద్వైతి అని, వీరశైవుడని, నాథయోగి అని, శూన్య వాది అని రకరకాల వాదాలు న్నా, ఆయన అప్పటికీ తనదైన పద్ధతిలో జనం వైపు నిలబడ్డ కవిగానే మనం చూడాలి. తెలుగు నేల దాటి పొరుగు రాష్ట్రాలకు, ప్యారిస్ వంటి విదేశీ నగరాలకు వెళ్ళిన ఒకే ఒక ప్రాచీన తెలుగు కవి వేమన.
‘భూమిలోన బుట్టు భూసారమెల్లను
తనువులోన బుట్టు తత్వమెల్ల
శ్రమములోన బుట్టు సర్వంబు తానౌను’
అని భూమి, మనిషి, మానవశ్రమ ఈ మూడింటితోనే అంతా ఉత్పత్తి అవుతున్నదని మార్క్సి జం మనకు తెలియకముందే ముతక రూపంలోనైనా వేమన చెప్పాడు. కులాలన్నీ ఒకేసారి పుట్టాయని, వాటిలో ఎక్కువ, తక్కువలు లేవని చెబుతూ ‘తలను చెయ్యిపెట్టి తగనమ్మజెప్పరా’ అని కుల నిర్మూలనకు పిలుపునిచ్చాడు వేమన. కులాలలో ‘హెచ్చు తగ్గుమాటలెట్లెరుంగగవచ్చు?’ అని ప్రశ్నించాడు. ఇతరులను హింసించి అక్రమార్జన చేసే వాళ్ళు ఎన్నటికీ తప్పించుకోలేరని హెచ్చరించాడు. సంపన్నులు పేదలకు దానం చేయమన్నా డు. దారిద్య్రం పేదలనే కాదు, సంపన్నులు కూడా కాల్చివేస్తుందని హెచ్చరించాడు. పిసినారులను తిట్టిపోశాడు. పిండప్రదానాలు ప్రస్తావించి ‘పియ్యది నెడికాకి పితరుడెట్లాయెరా?’, ‘రాయి దేవుడైన రాశులు మ్రింగడా?’ అనే ప్రశ్నకు కూడా ఆధ్యాత్మిక కేంద్రాలను టూరిస్టు కేంద్రాలుగా మార్చి వ్యాపారం చేసేవాళ్ళు సమాధానం చెప్పాలి. వేమన కోరుకున్న సమాజం ‘పరుల బాధలేక బ్రతుకుడీనరులార‘’ అన్నది. అలాంటి సమా జం ఏర్పడేదెప్పుడు? అప్పటిదాకా వేమన మనకు దారిదీపంగానే వెలుగుతుంటాడు.
‘మతము మత్తు గూర్చు మార్గమ్ము కారాదు’ అని పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దంలోనే చెప్పాడు ‘కుల మతాల నెంచి కోపపడకు’ అని వేమన పద్ధతిలోనే బోధించాడు వీరబ్రహ్మం. హక్కు లు అందరికీ సమానమని ఆయన గుర్తించాడు. బ్రాహ్మణుడు నడిచే నేల, దళితుడు నడిచే నేల ఒకటేనని అన్నమయ్య అన్నాడు.
‘కులమనేటి తెగులు కొంపలు గూల్చును’ అని హెచ్చరించాడు. ఇంట్లో అమ్మను గౌరవించడం తెలిస్తే సమాజంలోని మహిళలు అమ్మలుగా కనిపిస్తారన్నాడు. ‘స్త్రీ నిజమ్ముగాను సృష్టికి మూలంబు‘అని ప్రకటించాడు. ఆధునిక సంస్కర్తల కన్నా ముందే స్త్రీ విద్యను సమర్థించాడు. స్త్రీలకు వేద విద్యాధికారం లేదనీ, అది బ్రహ్మలిఖితమని చెబుతూ చదువులతల్లి సరస్వతి మహిళ అనే విషయం మరచిపోయారని దెప్పిపొడిచాడు. అన్నమయ్య లాగే వీరబ్రహ్మం కూడా
‘సర్వజీవులందు చైతన్యమొకటంచు
జాతిమతము లెంచి సణుగువారు
అందలేరు సచ్చిదానంద సౌఖ్యమ్ము’
అని ఆయన ప్రబోధించాడు.
ఇలా చెప్పిన ప్రాచీన తెలుగు కవులు ఇంకా కొందరున్నారు. ఇప్పుడు మనం పునర్మూల్యాంకన యుగంలో ఉన్నాం. శాస్త్రసాంకేతిక విప్లవాల కాలంలో మనం నివసిస్తున్నా మన రాజకీయాలు రూపంలో ప్రజాస్వామికంగా, సారంలో మధ్యయుగ లక్షణాల్లో నడుస్తున్నాయి. ఇదొక వైరుధ్యం. మార్పును కోరే వాళ్ళు ఈ వైరుధ్యాన్ని ప్రశ్నించాలంటే మనకు ఈ ప్రాచీన కవులు బాగా ఉపయోగపడతారు. అట్లని అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అని అనడంకాదు. మనకన్నాముందు మన పద్ధతిలో ఆలోచించిన వాళ్ళు ఉన్నారని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
- రాచపాళెం చంద్రశేఖర రెడ్డి