Tuesday, April 23, 2024

తెలుగులో తొలి సరళవైజ్ఞానిక రచనలు

- Advertisement -
- Advertisement -

new poetic process entitled Fusion Sairee

మొదటి నుండి శాస్త్రజ్ఞుడికి, సామాన్యుడికి, మధ్య చాలా దూరం ఉంటుంది. శాస్త్రవేత్త తన ప్రయోగాల్ని, ఫలితాల్ని ప్రచురిస్తాడు. కానీ అవి జాతీయ, అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్‌లో ఉంటాయి. అవి సామాన్యులకు అందుబాటులో ఉండవు. ఉన్నా, శాస్త్రవేత్తలు ఉపయోగించిన శాస్త్ర సాంకేతిక పదాలు వారికి అర్థం కావు. తత్ఫలితంగా ఈ సగటు మనిషి, తాత్కాలికంగా రంగుల కలల్ని చూపించే కల్పనా సాహిత్యం వైపు మొగ్గు చూపుతాడేగాని, ప్రకృతి రహస్యాలను, మానవుడి విజయాలను గూర్చి చెప్పే ‘విజ్ఞాన సారస్వతం’ జోలికి పోడు. మనిషి చంద్రుణ్ణి చేరుకున్న ఈ శాస్త్రీయ రాకెట్ యుగంలో కూడా గ్రహాల కదలికల్ని, చేతి గీతల్ని, జాతకాల్ని నమ్మేవారు నమ్ముతూనే ఉన్నారు. తేలు కుట్టినా, పాము కాటేసినా మంత్రాలు వేయించుకుంటూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటూనే ఉన్నారు. మూఢాచారాలు, కర్మ సిద్ధాంతంపై విశ్వాసం ఇంకా పోలేదు. ఇందుకు ప్రభుత్వ పాలకుల బాధ్యత ఎంతైనా ఉంది. మన దేశంలోని సంపూర్ణ సూర్య గ్రహణానికి పాశ్చాత్యులు ప్రయోగాలు చేయడానికి వస్తే, మనవాళ్లు కొందరు విద్యాధికులై ఉండి కూడా, తలుపులు బిడాయించుకుని లోపలే ఉండిపోయారు. అందువల్ల నిరక్షరాస్యుల మాట అటుంచి, దేశంలో విద్యావంతుల సంఖ్య పెరిగినా వారిలో శాస్త్రీయ అవగాహన మాత్రం ఇంకా పెరగలేదు. అందువల్ల సామాన్యుడి కోసం సైన్సు రాయాల్సిన అవసరం ఎప్పుడూ ఉండనే ఉంది. దేశం సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో ప్రగతి సాధించాలంటే ప్రజలకు శాస్త్రీయ అవగాహన అలవడటం చాలా అవసరం. హేతుబద్ధ దృష్టి, శ్రమ శక్తి పట్ల గౌరవం, వ్యక్తి చేసే పని వల్ల సామాజిక ప్రయోజనం వంటి వాటిని శాస్త్రీయ అవగాహన స్పష్టం చేస్తుంది. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు కృషి చేసిన తెలుగు రచయితలు చాలా మంది ఉన్నారు. వారి కృషిని ఇక్కడ సంక్షిప్తంగా గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ తరం పాపులర్ సైన్స్ రచయితలను ప్రోత్సహించడానికి ఈ విషయంలో ఇంకా సమగ్రమైన పరిశీలన, పరిశోధన జరగాల్సి ఉంది.
పూర్వం నుండి తెలుగులో సరళ విజ్ఞాన శాస్త్ర గ్రంథాల ప్రచురణ అరుదుగా సాగింది. ఎందరో ఉత్సాహవంతులు, ఎన్నో సంస్థలు పూనుకుంటేనే ఆ మాత్రమైనా పని జరిగింది. పావులూరి మల్లన్న రాసిన ‘గణిత శాస్త్రం’ దక్షిణ భారతంలో మొట్టమొదటి శాస్త్ర గ్రంథమని పలువురి అభిప్రాయం. ఈ రచయితకు రాజరాజ నరేంద్రుడు ‘నవ ఖండ వాడ’ అనే అగ్రహారం ఇచ్చాడని చెబుతారు. భారతం లాగానే ఇది కూడా సంస్కృతం నుండి అనువదింపబడింది. మహావీర చార్య రాసిన ‘గణిత సార సంగ్రహాన్ని’ పావులూరి మల్లన్న తెలుగు పద్యాల్లో రాశాడు. దీనితో అప్పటి సామాజిక జీవితం కూడా కొంత తెలుస్తుంది. ఈ రచయితకు లాన్స్ లెట్ హాక్‌బెన్ రాసిన ‘మాథమాటిక్స్ ఫర్ ద మిలియన్’ అనే గ్రంతం ఆధారమై ఉంటుంది. ఎందుకంటే నైలు నదిలో చిన్న చిన్న ఏర్పడేవి. ఆ లంకల్లో భూములు సాగు చేసేవారు. ఆ భూములు సరిగా కొలవడానికి రేఖా గణితం, క్షేత్ర మొదలైన శాస్త్రాలు ఏర్పడ్డాయి. అంటే సామాజిక అవసరం వల్ల అక్కడ శాస్త్రం పుట్టింది. అదే పద్ధతిన ఇక్కడ మన గోదావరి డెల్టా ప్రాంతంలో భూముల కొలతలు సరి చూసుకోవడానికి గణిత శాస్త్రం తొలిసారిగా అవసరమై ఉండొచ్చు.
1914కు పూర్వమే విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి ఏర్పడింది. దీనికి దీవాన్ కొమర్రాజు లక్ష్మణ రావు జనరల్ ఎడిటర్‌గాను, ఆదిరాజు వీరభద్ర రావు ఆఫీసు సెక్రటరీగానూ, డాక్టర్ ఆచంటి లక్ష్మీపతి మేనేజర్‌గానూ ఉండేవారు. ఆఫీసు హైదరాబాద్‌లోనూ, పుస్తక ప్రచురణ మదరాసులోనూ జరిగేవి. దీనికి పోషకులు నాయని వెంటక రంగారావు బహద్దూర్. వీరు మనగాల పరగణా రాజావారు. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం సంస్థాపకుల్లో ముఖ్యులు. ఆనాటి విజ్ఞాన చంద్రిక గ్రంథమాల నియమాలు ఈ విధంగా ఉన్నాయి.
“1. దేశాభివృద్ధికి అవశ్యకములైన గ్రంథములు ప్రచురించి, భాషాభివృద్ధి చేయుటయే ఈ గ్రంథమాల ఉద్దేశము. ఇందు సంవత్సరానికి రమారమి 1600 పుటలు గల స్వతంత్రములైన గ్రంథములు నాలుగు ప్రచురింపబడును.
2. కొందరు తలచునట్లు ఇది మానపత్రిక కాదు. ఇందు (1) దేశ దేశముల చరిత్రములును (11) పదార్థ విజ్ఞాన శాస్త్రము, రసాయన శాస్త్రము, జీవశాస్త్రము, వృక్ష శాస్త్రము మొదలైన ప్రకృతి శాస్త్రములును 111) దేశోపకారులగు కొందరు మహనీయుల చరిత్రములును 4) ఇంగ్లీషునందలి ఉద్గ్రంథముల భాషాంతరీకరణమును మాత్రము ప్రచురింపబడును. చరిత్రానుసారములగు కల్పిత కథలు కూడా ప్రచురింపబడును. కావ్య నాటకాదులిందుండవు”.
1913లో కృష్ణాజిల్లా కొంతేరు నుండి శ్రీమతి మొసలి గంటి రమాబాయమ్మ సంపాదకత్వంలో ‘హిందూ సుందరి’ అనే మాస పత్రిక వచ్చింది. 1914లో వేమూరి విశ్వనాథ శర్మ రాసిన రసాయనిక శాస్త్రం; ఎం. నర్సింహము బిఎ, బిఎల్‌ఎల్‌టి రాసిన భౌతిక శాస్త్రం; కె సీతారామయ్య బిఎఎల్‌టి రాసిన జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, శరీర శాస్త్రం, ఆరోగ్య బోధిని; డా. ఆచంట లక్ష్మపతి రాసిన కలరా, చలి జ్వరము; మంత్రి ప్రగడ సాంబశివరావు రాసిన పదార్థ విజ్ఞాన శాస్త్రము; మైనంపాటి లక్ష్మీనర్సింహం రాసిన భూగర్భ శాస్త్రం, నిడదవోలు వెంకట రావు రాసిన బంగాళాదుంప, కందుల శ్రీమన్నారాయణ రాసిన అగ్గిపెట్టెల యంత్రశాల; కొవ్వొత్తులు చేయు విధానము మొదలైన పుస్తకాలు ప్రచురితమయ్యాయి. వీటితోపాటు భౌతిక శాస్త్ర ప్రథమ పాఠాలు, వ్యవసాయ శాస్త్రం రెండు భాగాలుగా కూడా ప్రచురితమయ్యాయి.
అదే కాలంలో కృష్ణాజిల్లా వ్యవసాయ సంఘం వారు ‘వ్యవసాయము’ అనే మాసపత్రిక నడిపారు. ఈ పత్రికాధిపతి గోపిసెట్టి నారాయణస్వామి నాయుడు, డా.భోగరాజు పట్టాభి సీతారామయ్య, బిఎ, ఎంబిసిఎం రాసిన ఆరోగ్య శాస్త్రము, పశు శాస్త్రములను ఆంధ్ర భాషాభివర్ధని ప్రచురించింది… కూడా ఆ రోజుల్లోనే.
ఈ విధంగా 1932 వరకు అనేక శాస్త్ర గ్రంథాలు తెలుగులో వచ్చాయి. ఈ కాలంలో సరళ విజ్ఞాన శాస్త్ర గ్రంథ ప్రచురణలో హరి సర్వోత్తమ రావు కృషి కూడా ఉంది. కొమర్రాజు లక్ష్మణరావు వారి పలుకుబడిని ఉపయోగించి, శిస్తు వసూలు చేసేప్పుడు గ్రామస్థులకు పుస్తకాలు అమ్మేవారు. ఆ విధంగా ఆ కాలంలో సరళ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు విరివిగా ప్రచారంలో కొచ్చాయి. దాన్ని సైన్సు యుగం (Age of Science) అనొచ్చు. ఆ రో జుల్లో శాస్త్ర గ్రంథాల గూర్చి వ్యాపార ప్రకటనలు ఈ విధంగా ఉండేవి.
“రసాయన శాస్త్రము: దీనిని కెమిస్ట్రీ యందురు. ప్రకృతికి శాస్త్ర విజ్ఞానాభివృద్ధికిది మిగుల సహాయకారి. పటములు గలవు. వెల రూపాయి పావలా (140) (అణాలు వాడుకలో ఉన్న రోజుల్లో రూపాయలు. అణాలు పైసలుగా రాసేవారు. అంటే ఇది ఒక రూపాయి నాలుగు అణాలు పైసలు లేవు; రూపాయికి పదహారు అణాలు కాబట్టి, ఎనిమిది అణాలకు అర్ధ రూపాయి, నాలుగు అణాలంటే పావలా)
కలరా: మశూచి యనియు, వాంతిభేది యనియు, గొట్టాలమ్మ అనియు గత్తర అనియు పరిపరి విధముల పిలవబడు కలరా జాడ్యము దినదినాభివృద్ధి నంది దేశమంతయూ వ్యాపించినది. ఇది యమూల్య గ్రంథము. దీనిని బాగుగా పఠించి యందలి విషయములను గమనించిన యెడల ఈ వ్యాధి నుండి భయపడవల్సిన యవసరము లేదు. కలరా వ్యాపించు విధానము, దాని నడ్డగించు మార్గములు, ఆయుర్వేద శాస్త్ర ప్రకారము, ఆంగ్లేయ వైద్యశాస్త్ర ప్రకారము మందులు, మద్య పానీయములు వివరించబడినవి. వెల : ఆరు అణాలు (060) మాత్రము.
1932 తర్వాత శాస్త్ర గ్రంథాల జోరు తగ్గింది. దేశంలో జరుగుతున్న రాజకీయ, చారిత్రక, పరిణామాలతో పాటే చరిత్ర, రాజనీతి, అర్థశాస్త్రం మొదలైన వాటి వైపు విద్యాధికుల అభిరుచి మళ్లింది. కట్ట మంచి రామలింగారెడ్డి ‘అర్థశాస్త్రం’ను విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి రెండు సంపుటాలుగా ప్రచురించింది. ఆ పుస్తకం ఆయన ప్రియురాలైన ఒక యువతికి అంకితం చేయబడింది. ఆమె మీద రాసిన ఎలిజీ పద్యాలు కూడా పుస్తకంలో చేర్చబడ్డాయి. ఆయన అర్థశాస్త్రం ఏ స్థాయిలో ఉందో, సాహిత్య పరంగా ఎలిజీ పద్యాలు ఆ స్థాయిలోనే ఉన్నాయని విజ్ఞుల అభిప్రాయం.
కాళీపట్నం కొండయ్య 193540 ప్రాంతంలో ‘విజ్ఞానం’ అనే మాస పత్రిక నడిపారు. ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రోపన్యాసకుడుగా పని చేస్తుండేవారు. మంచి గాంధేయ వాది, ఖద్దరు మనిషి. సహృదయుడు. ఆయన నిడవవోలులో ‘విజ్ఞానం కెమికల్స్’ అనే కంపెనీ కూడా పెట్టారు. అరటి గెలలు కొట్టి వేసిన తర్వాత మిగిలే వ్యర్థ పదార్థాలతో పొటాషియం పెర్మాంగనేట్ తయారు చేసే వారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో దీనికి చాలా డిమాండ్ ఉండేది. ఎంతో బాగా నడిచిన ఈ పరిశ్రమ కొంత కాలం తర్వాత మూతపడింది. అందుకు కారణం గాంధేయ వాదం. గాంధేయ వాదం విదేశీ యంత్రాల వాడకానికి వ్యతిరేకం కనుక. గాంధీజీ పిలుపు విని కాళీపట్నం కొండయ్య తన ప్రైవేటు లిమిటెడ్‌ను మూసుకున్నారు. ఆ తర్వాత ఆయన జేమ్స్ రాసిన ‘యూనివర్స్ ఎరౌండ్ అజ్’ అనే పుస్తకం ఆధారంగా ‘విశ్వరూపం’ రాశారు. వీలు చేసుకుని విజ్ఞాన శాస్త్ర విషయాల మీద ఉపన్యసిస్తూ తెలుగు ప్రాంతాల్లోని కళాశాలలన్నీ దర్శించారు. ఈ రకంగా తెలుగులో తొలి సరళి వైజ్ఞానిక రచనలు వెలువడుతూ వచ్చాయి.

డా॥ దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News