Friday, April 26, 2024

మనసు లోతులు చూసిన పాటలు

- Advertisement -
- Advertisement -

Telugu Songs with Lyrics

మనసు లోతుల్లోకి తొంగిచూడగా అందిన భావాలకు పాటలు నేర్పి, గాఢమైన అనుభవాలకు అందమైన అనుభూతిని జతచేసి ఆనందవిషాదాల అశ్రుసంగమ ఘోషను ఆలపించి జనం గుండెల్ని ఆర్ద్రతతో తడిచేసిన మహాకవి ఆచార్య ఆత్రేయ.వీరు మే 7, 1921న నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేటలో జన్మించారు. వీరి అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. సినిమాలలోకిరాకముందే ఆయన తెలుగునాటకరంగాన్ని ఓ ఊపుఊపారు. ఆయన రాసిన ఎన్.జి.ఒ., విశ్వశాంతి, పరివర్తన, భయం, ఎవరుదొంగ ఈనాటికీ సజీవమే. అచ్చులోకి వచ్చిన ఆయన తొలినాటకం ‘గౌతమబుద్ధ’ కాగా, ‘పరివర్తన’ నాటకం రచయితగా గుర్తింపు తెచ్చింది. విద్యార్థిదశలో ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొన్నారు. మొదట్లో ఛందోబద్ధమైన సాహిత్యాన్ని పండించాడు. ‘తిరుత్తణి’లో గుమాస్తాగా పనిచేసారు. జమీన్‌రైతు పత్రికలో సహాయ సంపాదకునిగా పనిచేసారు. తెలుగు చిత్ర రంగంలో కొత్త ధోరణులకు తెరతీసారు. పొడి పొడి పదాల అల్లిక, పాట ఎలా అవుతుందని కొందరు విమర్శించారు. ఆ పొడి పొడి పదాలే గుండెను తడిచేసి, జనం మనసుల్ని తడిమి,కంటినీరు పెట్టించాయి. ఆయన్ని మనసుకవిగా చేసాయి.
1964లో విడుదలైన ‘మూగమనసులు సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. ఆంధ్రదేశమంతా విజయభేరి మోగింది. ఆదుర్తి సుబ్బారావుకు, ఆత్రేయకు, అక్కినేనికి, సావిత్రికి ఎనలేని కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిన చిత్రమిది.
ఆత్రేయ ‘మూగమనసులు’ సినిమాలో ఉన్నంత కవిత్వం బహుకొద్దిమంది సినీరచయితలలో కనిపిస్తుంది.
నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటి ఎనకాల ఏముందో తెలుసునా
ఆ పాట చరణాలు అక్షరలక్షలు విలువైనవి.
ఆత్మబలం సినిమాకు ఆత్రేయ, ఎన్నాళ్ళకూ పాట రాయకపోయేటప్పటికి నిర్మాతలకు విసుగు వచ్చింది. కొన్ని రోజుల తరువాత ఆత్రేయ కూర్చున్న ప్రదేశానికి దగ్గరలోవున్న ఒక కారు టాపుపై చినుకులు పడుతుంటే వచ్చే శబ్దానికి స్పందించి, ‘చిటపట చినుకులు పడుతూవుంటే’ అనే పాటను రాసారు. ఆ పాట బహుళ ప్రజాదరణ పొందింది.అట్లాగే మురళీకృష్ణ సినిమాకు ఎన్నాళ్ళు గడిచినా పాట రాయకపోయేటప్పటికి ఆ చిత్ర దర్శకుడు పి.పుల్లయ్య విసుగు చెంది, హోటల్ రూము ఖాళీ చేసి వెళ్ళమని హుకుం జారీచేసాడు. అప్పుడు నీ సుఖాన్ని కోరుకొని ఈ రూముని ఖాళీ చేస్తున్నానని భావం వచ్చేటట్లు ‘నీ సుఖమే నే కోరుకున్నా’ అని గొణుక్కుంటూ వెళ్ళిపోసాగాడు. వెంటనే పుల్లయ్య ఆయన్ను వెనక్కి పిలిచి, అదే పల్లవితో పాట రాయించుకున్నాడు.
‘అనుకున్నామనీ జరగవు అన్నీ / అనుకోలేదనీ ఆగవు కొన్నీ
జరిగేవన్నీ మంచికనీ / అనుకోవటమే మనిషి పనీ…’ అని తాత్విక పాట రాశాడు.
అక్కినేని ఆత్రేయ కాంబినేషన్లో 1971లో రిలీజైన ప్రేమనగర్ తెలుగునాట ఒక అద్భుత విజయాన్ని సాధించింది. ఆ చిత్రంలో మాటలు, పాటలుకూడా ఆత్రేయే రాశారు.
నేను పుట్టాను ఈలోకం నవ్వింది, మనసుగతి ఇంతే,తేట తేట తెలుగులా,నీకోసం వెలిసిందీ ఈ ప్రేమమందిరం వంటి పాటలే కాకుండా
లే లే లే లే లే లే నా రాజా / లేలే నా రాజా / లేవనంటావా నన్ను లేపమంటావా… లాంటి పాటలు కూడా రాశారంటే ఒకింత నమ్మశక్యం కాదు. కానీ అది నిజం. రెండర్థాల పాట రాయడం గురించి ఒక ఇంటర్వ్యూలో ఆత్రేయ ఇలా అన్నాడు
‘సందేహమేమిటి? చేసిన పాపం ఒప్పుకోవటం మంచిది…. కేవలం అవే కావాలంటున్నారు…. ఆ దశ వచ్చింది……. చస్తున్నాం! రాయక తప్పడంలేదు’ అటువంటి పాటల వలననే ఆత్రేయ…. బూత్రేయ అని అనిపించుకున్నారు. అయితే ఎన్నో మంచి పాటలు రాయటంతో ఆ పేరు మరుగున పడింది.
ఆత్రేయ రాసిన మరో మనసు పాట ‘సెక్రటరీ’ సినిమాలో
మనసులేనీ బ్రతుకొక నరకం / మరువలేనీ మనసొక నరకం
మనిషికెక్కడ ఉన్నది స్వర్గం / మరణమేగా దానికి మార్గం
చూడండి ఈ పాటలో ఎంత వేదాంతముందో!
దేశభక్తిలోనూ తాను తీసిపోనని నిరూపించుకుంటూ బడిపంతులు సినిమాలో రాసిన ఈ పాట చూడండి
భారతమాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల
జీవధాత్రికి జేజేలు
అని తనువూ, మనసూ పులకించే దేశభక్తిగీతం రాసారు ఆత్రేయ.
ఇక సంభాషణల విషయానికొస్తే….‘దొంగలొచ్చినా దొరలొచ్చినా పోలీసు కాపలా పెడతారు అప్పుడు వచ్చింది ఎవరా అని’
‘పైసా మన చేతుల్లోవుంటే ఈ భూమి అంటే ఈ ప్రపంచంలోవున్న మనుషులు, మృగాలు, వస్తువులు అన్నీ మనచుట్టూ తిరుతాయి… ఇది సిసలైన సత్యం.
మధ్య తరగతి ప్రేక్షకుల ఆశలు, ఆశయాలు, వారిలోని ఆత్మవంచన, వారి బాధలు, గాధలు సమస్తం ఆత్రేయకు తెలుసు. అందుకనే అంతటి మంచి డైలాగులను ఆత్రేయ రచన చేయగలిగారు.
ఆయన దాదాపు వెయ్యి పాటలు రాసారు. 300 చిత్రాలకు స్క్రిప్టు సమకూర్చారు. ‘వాగ్దానం’ సినిమాకు దర్శకత్వం వహించారు. శోభన్‌బాబు నటించిన ‘కోడెనాగు’ చిత్రంలో మాస్టారుగా నటించారు. ఇల్లరికం, మాంగల్యబలం, సిరిసంపదలు, మంచిమనసులు, డాక్టర్ చక్రవర్తి, మురళీకృష్ణ, లేతమనసులు,ఉండమ్మా బొట్టుపెడతావంటి ఉత్తమ చిత్రాలకు రచనలు చేసారు. తెలుగు జనజీవన వాహినితో పెనవేసుకున్న ఆత్రేయ సాహిత్య సేవకు గుర్తింపుగా 1986లో ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు విజ్ఞానపీఠం సహకారంతో ఆత్రేయ నాటకోత్సవాలను నిర్వహించింది. ఆచార్య ఆత్రేయ ‘తెలుగు నాటకరంగం’ అన్న వ్యాసంపుటిని తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. 1989లో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించింది.
కొన్ని పాటలను శ్రీశ్రీ తప్ప మరొకరు రాయలేరు అని అనుకుంటారు చాలామంది. కానీ అటువంటి పాటలు కొన్నింటిని ఆత్రేయ రాసారు. ‘తోడికోడళ్ళు’ సినిమాలో
కారులో షికారుకెళ్ళే /పాలబుగ్గల పసిడీదానా అంటూనే
జిలుగు వెలుగుల చీర శిల్పం / ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగుపాతల బరువూ బ్రతుకుల / నేతగాడే నేసినాడు
ఇటువంటి సామ్యవాద పదాలుకూడా ఆత్రేయ కలంనుండి జాలువారాయి.ఆకలిరాజ్యంలో మరోపాట
సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్ళిలాంటిదే…
ఇప్పటికీ కొందరు ఈ పాటను శ్రీశ్రీ రాసారు అనుకుంటారు. కానీ రాసింది ఆత్రేయ.
కొన్ని విషాదగీతాలను వింటుంటే ఆత్రేయ విషయంలో ఒక నానుడి. ‘ఆత్రేయ రాయకుండా నిర్మాతలను ఏడ్పించాడు….. రాసి ప్రేక్షకులను ఏడ్పించాడు’ ఈ తరుణంలో దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన ఒక కవితలోని పదాలు గుర్తుకొస్తాయి.
గాలి గుర్రపు జూలు విదిలించి / పూలవర్షం భువిని కురిపించి / పాట పాటకు పొంగు మున్నీరులా / మాట మాటకి జారుకన్నీరులా / మేం ఆడుతాం / మేం పాడుతాం
ఆత్రేయ సెప్టెంబర్ 13, 1989న మరణించినా ఆయన రాసిన పాటలు కలకాలం జనుల గుండెల్లో నిలిచేవుంటాయి.

పొత్తూరి సుబ్బారావు

9490751681

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News