Home దునియా సంతృప్తే గొప్ప ఐశ్వర్యం

సంతృప్తే గొప్ప ఐశ్వర్యం

సిరీశ్ తల్లిదండ్రులు బాగా ధనవంతులు. సిరీశుని అతి గారాబంగా పెంచుతున్నారు. అడిగినదల్లా కొనిచ్చేసరికి సిరీశ్ కోరికలకు అంతే లేదు. ‘ నాన్నా! నాకు స్టడీ మెటీరియల్స్ కావాలి. మా తరగతిలో సుదర్శన్ వాటిని చదవడం వల్లనే ఎప్పుడూ మొదటి ర్యాంకు వస్తాడు’ అని సిరీశ్ అనగానే వాళ్ళ నాన్న వేంకటేశ్వర్లు స్టడీ మెటీరియల్స్ కొని ఇచ్చాడు. తరగతిలో ఎవరు కొత్త వస్తువు కొన్నా అలాంటిది సిరీశ్ వాళ్ళ నాన్నతో కొనిచ్చుకునేవాడు. ఆ పాఠశాలలో చదివే వశిష్ట కొత్త ఖరీదైన వాచీ కొన్నాడని చెప్పి, వాళ్ళ నాన్నతో ఖరిదైన వాచీ కొనిపించాడు సిరీశ్. ఓసారి శ్రీకాంత్ వాళ్ళ నాన్న పెద్ద స్మార్ట్ ఫోన్ కొన్నాడని, ఓసారి శ్రావణి వాళ్ళు ఖరీదైన కారు కొన్నారని ఆయా వస్తువులను బతిమిలాడి, అలిగి సాధించి కొనేలా చేశాడు. ఓరోజు వేంకటేశ్వర్లు విసుక్కున్నాడు. ‘ప్రతి దానికీ అందరితో పోటీ పడి అన్నీ కొనిపించుకుంటున్నావు. చదువులో ఎందుకు పోటీ పడటం లేదురా’ అని అడిగాడు.

‘ ఆ సమయం తొందరలోనే వస్తుంది నాన్నగారు!’ అన్నాడు సిరీశ్.  సిరీశ్ వాళ్ళ నాన్నను ఒత్తిడి చేస్తూ అనుకున్నవన్నీ సాధిస్తూ ఉన్నాడని సుదర్శనుకి తెలిసింది. ఒకరోజు సుదర్శన్ సిరీశుని కలిసి ‘రేపు మీ నాన్నతో కలిసి మా ఇంటికి రావాలి. అక్కడ నీకు సర్‌ప్రైజ్.’ అని వాళ్ళ ఇంటి చిరునామా చెప్పాడు. మరునాడు సిరీశ్ వాళ్ళ నాన్నతో సుదర్శన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు చూసి నివ్వెరపోయాడు. పూరి గుడిసె. ఒక్కటే గది. టి.వీ. కాదు కదా కనీసం ఒక చిన్న రేడియో లేదు. చిన్నప్పటి నుంచి తరగతిలో మొదటి ర్యాంకు విద్యార్థి, తరగతికి లీడర్, ఎక్కువ మంది స్నేహాన్ని సంపాదించిన వ్యక్తి, ఉపాధ్యాయులు అంతా మెచ్చుకునే విద్యార్థి ఇంత నిరుపేదనా? సుదర్శన్ తల్లిదండ్రులు వీరిద్దరికీ స్వాగతం పలికి, అతిథి మర్యాదలు చేశారు. సుదర్శన్ సిరీశుతో ఇలా అన్నాడు.

‘మా తల్లిదండ్రులు నిరుపేదలు. వారి రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం మాది. వారు నాకు ఏమి ఇస్తున్నారో అని నేనెప్పుడూ ఆలోచించలేదు. ఉన్న దానిలో సంతృప్తిని చెందడం వారు నాకు నేర్పారు. సంతృప్తిలోనే ఆనందం ఉంది. ని మించిన ఐశ్వర్యం లేదు. నాకున్నదల్లా ఒకే కోరిక. బాగా చదువుకోవాలి. మంచి ఉద్యోగం సాధించి, తల్లిదండ్రులను పేదరికం నుంచి విముక్తి చేయడం. మనం బతకడానికి అవసరమైన ధనాన్ని వాడుకొని, మిగిలిన ధనంతో మాలాంటి నిరుపేదలను ఆదుకోవడం. కోరికల వెంట పరుగెత్తే వాడు అత్యంత దరిద్రుడు అని. సిరీశ్ తనను క్షమించమని వాళ్ళ నాన్నను వేడుకున్నాడు. బాగా చదువుకొని గొప్ప ఉద్యోగం సాధిస్తానని ప్రమాణం చేశాడు. తన కుమారునిలో మార్పు తెచ్చినందుకు సుదర్శనుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అందుకే కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఉన్నదానితో తృప్తి పడాలి.

Telugu Stories for Children

సరికొండ శ్రీనివాసరాజు, 8185890400.