Home దునియా ఆ సోమవారం రాత్రి

ఆ సోమవారం రాత్రి

Bad Charactersఆ సోమవారం రాత్రి తొమ్మిదికి టి.విలో లాఫిన్ కార్యక్రమం అయ్యాక జిమ్‌కి లేచి ఇంటి బయట లైట్ ఆర్పాలని గుర్తుంది. కాని ఆయన కూతురు మిషెల్ తను పని చేసే స్టోర్స్ నించి రాత్రి తొమ్మిదిన్నరకి తిరిగి వస్తుంది. ఎప్పుడూ ఆమె వచ్చే టైం అదే. ఆయన గట్టిగా ఆవలించి లేచి ఫ్రిజ్ దగ్గరకి వెళ్ళి, ఓ బీర్ కేన్ని తీసుకుని మళ్లీ టి.వి ముందు సోఫాలో కూర్చున్నాడు. తొమ్మిదిన్నరకల్లా ఆయనకి బాగా నిద్ర పట్టింది. టి.వి మోగుతూనే ఉంది. వారి పక్కింటి కేరీ కూడా మంచం మీద పడుకుని టి.వి చూస్తోంది. ఆమె పడక గది కిటికీలోంచి చూస్తే తొమ్మిదికి పక్కింటి వరండా లైట్ వెలుగుతోంది. అది మిషెల్ కోసం అనుకుంది. ఆమె సోమవారం రాత్రుళ్ళు ప్లాజా షాపింగ్ సెంటర్లోని హార్పర్స్ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో పని చేస్తోందని కేరీకి తెలుసు. మిషెల్ ప్రతీ సోమవారం రాత్రి ఠంచన్‌గా ఇంటికి వస్తుందని కూడా తెలుసు. ఎందుకంటే సరిగ్గా ఆ సమయానికి ఇంటి బయటి లైట్ ఆరిపోతుంది.

రాత్రి పదకొండుకి టి.విలో సినిమా అయ్యాక కూడా వాళ్ల ఇంటి బయటి లైట్ వెలుగుతూండటంతో, మిషెల్ ఇంటికి వచ్చాక జిమ్ ఆ లైట్‌ని ఆర్పడం మర్చిపోయాడు అనుకుంది. మగాళ్ళింతే అని కూడా అనుకుంది. జిమ్ భార్య సూ బేబీ సిట్టింగ్‌కి ముగ్గురు పిల్లలున్న తన పెద్ద కూతురు ఇంటికి ట్రెమెంట్ అనే ఊరుకి వెళ్లిందని తెలుసు. సూ ఉంటే లైట్ ఆర్పేస్తుంది. కేరీ లైటార్పి కిటికీ లోంచి చూస్తే జిమ్ ఇంటి ముందు ఎప్పుడూ మిషెల్ ఆపే ఆకుపచ్చ రంగు కారు కనపడలేదు. పద్దెనిమిదేళ్ల మిషెల్ ఇంకా ఇంటికి రాకుండా ఏం చేస్తోంది? ఆమె ఏదైనా ఇబ్బందిలో పడిందా? ఎప్పుడూ ఈ సరికే వచ్చేసేది. తన కూతురు ఇంకా రాకపోతే జిమ్ ఏం చేస్తున్నాడు? ఒంటి గంటకి కారు శబ్దానికి ఆమెకి మెలకువ వచ్చి కిటికీలోంచి చూస్తే పక్కింటి బయట లైటు ఇంకా వెలుగుతూనే ఉంది. పొగమంచులో జిమ్ కార్ గేరేజ్ లోంచి బయటికి రావడం కనిపించింది. ఏదో జరిగిందని కేరీకి అనిపించింది. సోమవారం రాత్రి తొమ్మిదిన్నరకి మిషెల్‌తో పని చేసే లిండా ఆమె పార్కింగ్ లాట్‌లో నిలబడి ఉండటం చూసింది. తనని, తన భర్తని చూసి ఆమె చేతిని ఊపింది. లిండా మంగళవారం పోలీసులు ప్రశ్నిస్తే చెప్పింది.

“మా వారు సోమవారం రాత్రి తొమ్మిదిన్నరకి పార్కింగ్ లాట్‌లో నన్ను కారెక్కించుకుంటారు. పార్కింగ్ లాట్‌లో ఆమె కారు మాత్రమే ఉంది.”
“నేను ఆమెకి లిఫ్ట్ ఇద్దామంటే లిండా వద్దంది. పరాయి స్త్రీల నించి నన్ను ఆమె దూరంగా ఉంచుతుంది.” లిండా భర్త మెక్‌డోనాల్డ్ కొద్దిగా కోపంగా చెప్పాడు.
రాత్రి పది దాకా తెరచి ఉండే కాఫీ షాప్ యజమాని హార్పర్ పోలీసులతో తను మిషెల్ కారు ఉందో, లేదో చూడలేదని చెప్పాడు. తొమ్మిదిన్నరకి తను సిగరెట్ తాగడానికి బయటకి వచ్చినప్పుడు జీన్స్ పేంట్, జీన్స్ షర్ట్ వేసుకున్న, నల్లటి పొడుగాటి జుట్టు గల సన్నగా పొడుగ్గా ఉన్నతను మిషెల్ కారు పక్కన నిలబడి ఉండటం చూసానని, అతను ఆమె బాయ్ ఫ్రెండ్ అనుకున్నానని చెప్పాడు. లిండాలో ఓ అనుమానం ప్రవేశించింది. తమని చూసి మిషెల్ ఆపదలో ఉండి కాపాడమని చేతిని ఊపిందా? తను పొరపాటు చేసిందా?
మంగళవారం ఉదయం జిమ్ భార్య సూ ట్రెమెంట్‌లోని తన పెద్ద కూతురు డోరీ ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేసాక బయల్దేరాలి అనుకుంది. “ఇంత తొందరగా ఎందుకమ్మా? రెండు గంటల ప్రయాణమేగా? నువ్వు వెళ్లేసరికి నాన్న ఆఫీస్‌లో ఉంటారు. మిషెల్ స్కూల్లో ఉంటుంది. వాళ్లు ఇంటికి వచ్చే సమయానికి చేరేలా బయల్దేరచ్చుగా?” డోరీ సూచించింది. గత మూడు రోజులుగా ముగ్గురు పిల్లలతో సతమతమైన సూ తన ఇంటికి వెళ్లి ఒంటరిగా, ప్రశాంతంగా గడపాలని అనుకుంది.

“వెళ్లి ఇల్లు సర్దాలి. నరకంలా ఉంది.” అబద్ధం చెప్పింది.
మిషెల్ తీసిన వస్తువులని తీసిన చోటే ఉంచుతుంది. జిమ్‌కి శుభ్రత అంటే ఇష్టం. అది కుంటి సాకని డోరీకి తెలుసు. “మీ అల్లుడు హాల్ ఊర్నించి వస్తూ సాయంత్రం నీ కోసం ఏం బహుమతి తెస్తాడో మరి? ఉండచ్చుగా?” ఐనా సూ వెళ్తాను అని చెప్పి, ముగ్గురు మనవల్ని, తన కూతుర్ని ముద్దు పెట్టుకుని తన కారు వైపు నడిచింది. రెండు గంటల తర్వాత ఆమె ప్లాజా షాపింగ్ సెంటర్ పక్క నించి వెళ్తూ హార్పర్స్ డిపార్ట్‌మెంటల్ స్టోర్ పార్కింగ్ లాట్‌లోని కూతురి ఆకుపచ్చ రంగు కారుని చూసింది. తన ఇంటికి పది గంటలకి చేరాక తమ కారు గేరేజ్‌లో జిమ్ కారుని చూసి కొద్దిగా ఆశ్చర్యపోయింది. ఆ సమయంలో ఆయన ఇంట్లో ఏం చేస్తున్నాడు అనుకుంది. ఇంటి బయటి లైట్ వెలగడం కూడా గమనించి కొద్దిగా భయపడతూ హేండ్ బేగ్ లోంచి తాళం తీసి లోపలికి వెళ్లింది. లోపల కుర్చీలో తలని చేతుల్లో ఉంచుకుని దిగులుగా కూర్చున్న జిమ్‌ని చూసింది. ఆమె మాట్లాడే లోగానే జిమ్ తలెత్తి చూసి చెప్పాడు.

“మిషెల్ ఇంటికి రాలేదు.”
“ఇంటికి రాలేదా? అంటే?” సూ కంగారుగా అడిగింది.
తను రాత్రి టి.వి చూస్తూ నిద్ర పోవడం, ఒంటి గంటకి మెలకువ వచ్చి చూస్తే తన మంచం మీద మిషెల్, ఇంటి బయట ఆమె కారు లేకపోవడం చూసి తను కారెక్కి ప్లాజా షాపింగ్ సెంటర్‌కి వెళ్తే మిషెల్ కార్ మాత్రమే పార్కింగ్ లాట్‌లో కనిపించడం, దాని టైర్ కింద జాకీని, పక్కనే స్పేర్ టైర్‌ని చూడటం, వీధులన్నీ తిరిగినా ఆమె కనపడక పోవడంతో పోలీసులకి ఫిర్యాదు చేయడం గురించి వివరించాడు. జిమ్ చెప్పింది విన్నాక సూ తక్షణం స్పందించింది. ఆమె జిమ్‌ని ఓదార్చడానికి దగ్గరికి తీసుకుంది. మొదటి నించీ పోలీసులు నిర్లక్షంగానే వ్యవహరించారు. పద్దెనిమిదేళ్లు దాటిన వ్యక్తి కనపడకపోతే మొదటి డ్బ్భై రెండు గంటలూ ‘ఆల్ పాయింట్స్ బుల్లెటిన్’ ని రిలీజ్ చేయరు. ఆమె ఏ బాయ్ ఫ్రెండ్‌తోనో వెళ్ళుంటుందని భావించారు. మిషెల్ వర్ణనని రాసుకున్నారు. నలభై ఎనిమిది గంటల తర్వాత శవం కోసం బీచ్‌లో, ఇతర చోట్లా వెతికారు. టైర్ పంచరైతే ఏ దుర్మార్గుడో లిఫ్ట్ ఇవ్వచ్చని భావించారు. ఆ కారుకి ప్రమాదం జరిగిందా అని కూడా విచారించారు.

పోలీసులు మిషెల్ కారు టైర్‌ని పరిశీలిస్తే దాని పక్క భాగాన్ని కత్తితో కోసిన గుర్తులు కనపడలేదు కాని అక్కడ తెగి ఉండటంతో అద్దం ముక్కతోనో, పదునైన రాతితోనో దాన్ని కోసి ఉండాలని భావించారు. పక్కింటి కేరీ మంగళవారం ఉదయం తొమ్మిదికి ఇంకా జిమ్ ఇంటి బయట లైట్ వెలుగుతూండటం, కొద్ది సేపటికి పోలీస్ పెట్రోల్ కార్ వచ్చి ఆగడం, కాసేపాగి మళ్లీ వెళ్లడం గమనించింది. ఏం జరుగుతోందో ఆమెకి అర్ధం కాలేదు. గంట తర్వాత సూ కార్ గేరేజ్‌లోకి వెళ్ళడం కూడా గమనించింది.

బుధవారం రాత్రంతా సూ పడక గదిలోంచి అనేక సార్లు ఇంటి తలుపు తెరచుకుని బయటకి వచ్చి, బయట చలిని చూసి మిషెల్ ఎక్కడ ఉందో తెలీకుండా తను వేడి ప్రదేశంలో ఉండటానికి కొద్దిగా దిగులు పడింది. మొదటి పేజీలో మిషెల్ ఫొటో గల దినపత్రిక ఉదయం ఐదుకి అందగానే సూ అది చదివింది. డబ్భై రెండు గంటల తర్వాత గురువారం పోలీసులు రెండు వందల ఏభై ఊళ్లకి మిషెల్ వివరాలని పంపారు, పక్కింటి కేరీ తన సమయాన్ని వంట గది, తన పడక గదిలోని కిటికీల దగ్గరే ఎక్కువగా గడిపింది. ఆమెకి మిషెల్‌కి ఏమైందో తెలుసుకోవాలనే ఆతృత ఉంది. “మీరు ఈ అమ్మాయిని చూసారా?” అనే శీర్షికతో సూ ఇచ్చిన ప్రకటనని దినపత్రికలో చూసింది.గురువారం అతను మిషెల్ కార్‌ని ఇంటికి తీసుకువచ్చాడు. ట్రెమంట్ నించి డోరీ కూడా వచ్చింది. ఇంకా మిషెల్ గురించిన సమాచారం తెలీకపోవడంతో సూలో మార్పు వచ్చింది. పక్కింటి కేరీ తెచ్చిన సేండ్ విచెన్ వంక అయిష్టంగా చూసింది. తనకి తెలిసిదంతా ఆమెకి చెప్తే, ఇద్దరూ కలిసి ఏడ్చారు. డోరీ తన తల్లితో ఆవేదనగా చెప్పింది. “ఇది ఎప్పుడు జరిగింది? సోమవారం రాత్రి, నువ్వు మా ఇంట్లో ఉన్నప్పుడు. నువ్వు ఇక్కడే ఉండి ఉంటే ఇది జరిగేది కాదు. నాన్న ఏం చేస్తున్నారు? ఏం చేయకుండా ఎలా నిద్ర పోగలిగారు? ఇదన్యాయం.” దాంతో సూ మనసులోని బాధంతా భర్త మీద కోపంగా పరిణమించింది.

మిషెల్ కార్లో పోలీసులకి ఎలాంటి వేలిముద్రలూ దొరకలేదు. ఆమెకి పరిచయం ఉన్న డబ్భై రెండు మందిని ప్రశ్నించినా ఆ సన్నటి పొడుగాటి వ్యక్తి ఎవరో వాళ్లకి తెలీలేదు. ఇది అతని పనే అని వాళ్లు గాఢంగా నమ్మారు, బహుశ అతనే తన కార్లో ఆమెని ఎక్కించుకుని తీసుకుని వెళ్లి ఉంటాడు. మిషెల్‌కి కారు స్టార్ట్ చేయడం, పోనించడం, ఆపడం తప్ప దాని మరమ్మతులు ఏమీ రావని జిమ్ పోలీసులకి చెప్పడంతో ఆ వ్యక్తిని నమ్మి అతని వెంట వెళ్ళిందని భావించారు. ఐతే తన కూతురు అలా కొత్త వాళ్ళ కారు ఎక్కదని సూ గట్టిగా చెప్పింది.

“దుర్మార్గులు అమాయకుల్ని తేలిగ్గా మోసం చేయగలరు.” సార్జెంట్ చెప్పాడు.
“అతను నిజంగా మంచి వాడేమో? మిషెల్‌ని ఎక్కడ దింపుంటాడు?” జిమ్ భార్యతో తన ఆలోచనని పంచుకున్నాడు.
సూ కిటికీ లోంచి తన కూతురి ఆకుపచ్చ కారుని బాధగా చూసింది. తర్వాత కోపంగా అరిచింది.
“మీ కూతురే. కాని ఆ రాత్రి మీరు నిద్రపోయారు.”
“నేనేం చేయను? పదింటికే మిషల్ మాయమైంది. ఇలా జరుగుతుందని నాకు ముందు తెలుసా?”

“మీరు నిద్ర పోకుండా వెంటనే తొమ్మిదీ ముప్ఫై ఐదుకే వెళ్ళుంటే ఎక్కడైనా కనిపించేదేమో?”
“నేను మేలుకుని ఉన్నా తొమ్మిదీ ముప్ఫై ఐదుకి వెళ్ళే వాడిని కాను. ఎవరితోనైనా కాఫీ తాగడానికి ఆగుంటుందని అనుకునే వాడిని” జిమ్ ఆక్రోశంగా చెప్పాడు.
“కాని అమ్మ అలా చేయదు. అమ్మ ఇక్కడ ఉండి ఉంటే మిషెల్ ఎప్పుడూ ఆలస్యం చేయదని తొమ్మిదీ ముప్ఫై ఐదుకి బయటికి వెళ్లేది” డోరీ చెప్పింది.
కూతురి సంగతి తెలిసిన జిమ్ భార్యకి తన మీద ద్వేషం కలగకూడదని, దాన్ని డోరీ వైపే తిప్పాలని అనుకుని వెంటనే చెప్పాడు.
“కాని సూ ఇక్కడ లేదు. మీ ఇంట్లో బేబీ సిట్టింగ్‌లో ఉంది. రావడం ఇష్టం లేదంటే బలవంతంగా పిలిపించావు.”
“ఎందుకంటే అమ్మ నిన్ను నమ్మింది. అందుకే అక్కడికి వచ్చింది. ఇలా జరగకుండా నువ్వు మిషెల్‌ని జాగ్రత్తగా చూసుకుంటావని నమ్మింది.”
“నువ్వేమంటావు?” జిమ్ తన భార్యని ప్రశ్నించాడు.
“నేను ఉండి ఉంటే మిషెల్‌కి ఏమయ్యేది కాదు.” సూ కోపంగా అరిచింది.
ఆ తర్వాత సూ వరసగా రెండు పూటలు భోజనం చేయలేదు. తన బాధని జిమ్ మీద కోపంగా బయటికి పంపుతూ అతన్ని తిడుతూనే ఉంది. తనతో ఇంతకాలం శాంతంగా జీవించిన సూలో అంత ద్వేషం చూడటం జిమ్‌కి బాధని, ఆశ్చర్యాన్ని కలిగించింది.
డోరీ తన అపరాధ భావనని తండ్రి మీదకి తిప్పాక వాళ్ళిద్దరూ శతృవులు అవడం చూసినా అది తన తప్పని భావించలేదు.
“అమ్మా! నువ్వు, నాన్న ఇలా మాట్లాడుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు.” ఏడుస్తూ చెప్పింది.
“ఎందుకంటే ఇంతకు ముందు ఆయన ఎన్నడూ మిషెల్‌ని చంపలేదు.” సూ అరిచింది.

తరచు జిమ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మిషెల్ గురించి అడుగుతున్నాడు. “వెతుకుతున్నాం. మాకేదైనా సమాచారం తెలిస్తే ముందుగా మీకే అది తెలియచేస్తాం.” వాళ్లు చెప్పారు. వంట గది కిటికీలోంచి సూ కనపడక పోవడంతో కేరీ తినడానికి ఏదో ఒకటి చేసి వాళ్లింటికి తీసుకెళ్లి ఇస్తూనే ఉంది. తన భార్య డోరీ వల్ల నాటకీయంగా అంతగా మారడం ఏభై ఏళ్ల జిమ్‌కి ఆశ్చర్యాన్ని కలిగించింది. తల్లీకూతుళ్ళు గుసగుసలాడుకోవడం కూడా చాలా సార్లు విన్నాడు. కేరీ తినడానికి తెచ్చింది. తీసుకున్నప్పడల్లా ఆమె దయకి కృతజ్ఞతలు చెప్తూనే ఉన్నాడు.

మిషెల్ వేట కొనసాగుతోందన్న వార్తని దినపత్రికలో చదివాక లిండా భర్త మెక్‌డోనాల్డ్ దాన్ని నేల మీద కోపంగా విసిరి కొట్టి ‘ఛీ’ అని కోపంగా అరిచాడు.

“చూస్తున్నాను. ఏమిటిది?” లిండా కోపంగా అరిచింది.
“నీ వల్లే. లేదా మిషల్‌ని భద్రంగా ఇంటికి చేర్చే వాడిని. నీ అసూయ ఓ నిండు ప్రాణాన్ని తీసింది.” అతను మళ్ళీ అరిచాడు.
“ఇలా ఎంత కాలం దెప్పుతారు? జీవితాంతమా?”
వాళ్ల దెబ్బలాట కొనసాగింది.

మిషెల్ మాయమై నెల దాటింది. జిమ్ ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం తగ్గించేసాడు. డోరీ తన ఇంటికి వెళ్లిపోయింది. తల్లీకూతుళ్ళు మునుపటి కన్నా ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుకోవడం జిమ్ గమనించాడు. గతంలోలా డోరీ తండ్రిని ఫోన్‌లో పలకరించడం మానేసింది. అతను సూని పలకరించినా మాట్లాడకపోవడంతో తనూ మానేసాడు. వాళ్ళిద్దరూ ఎవరి గదుల్లో వాళ్లు రాత్రుళ్ళు నిశ్శబ్దంగా విలపిస్తూనే ఉన్నారు. కేరీ వాళ్ళకి ఏదైనా చేసివ్వడం కూడా మానేసింది.
ఓ రోజు జిమ్ ఆఫీస్ నించి ఇంటికి వచ్చేసరికి సూ ఉత్తరం కనిపించింది.

‘ఇక మీతో కలిసి జీవించలేను. విడాకులు వచ్చేలోగా మిషెల్ తిరిగి వస్తే సరి. లేదా…
-సూ.
అతను నిర్ఘాంతపోయాడు. డోరీకి వెంటనే ఫోన్ చేసాడు. రిసీవర్ ఎత్తిన అల్లుడు ఆయన కంఠం విని లైన్ కట్ చేసాడు. నాలుగైదు సార్లు అలా జరిగాక జిమ్ ఖిన్నుడయ్యాడు.

ఓ రోజు కేరీ డోర్ బెల్ మోగింది. ఆవిడ తలుపు తెరిస్తే ఎదురుగా జిమ్.
“ఇదేమిటి? ఇంత చిక్కిపోయారు?” ఆశ్చర్యంగా అడిగింది.
అతను బదులు చెప్పకుండా రెండు తాళంచెవులు ఇచ్చి చెప్పాడు.
“నా ఇంటిని అమ్మేస్తున్నాను. ఎవరైనా చూడటానికి వస్తే దయచేసి ఇల్లు చూపించండి.”
“అదేం? ఎందుకని?” నివ్వెరపోతూ అడిగింది.
“ఒకప్పుడు ఆనందాన్ని ఇచ్చిన ఆ ఇల్లు ఇప్పుడు నాకు విచారాన్ని ఇస్తోంది. ఆ జ్ఞాపకాలతో ఇక్కడ ఉండలేను. రేపు మాకు విడాకులు మంజూరు అవబోతున్నాయి. నేను ప్లజంట్‌విల్‌లో ఇంకో ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతున్నాను.”
కేరీ అతని వంక బాధగా చూసి చెప్పింది.
“సూ మంచిదే. డోరీనే…కాఫీ తాగుదురు గాని రండి.”
“నో. థాంక్స్.”

కోర్ట్ లోని లిండాని, ఆమె భర్తని చూసిన జిమ్ ఆశ్చర్యపోయాడు. వాళ్లిద్దరూ కూడా విడాకులకే వచ్చారు. లిండా జిమ్, సూలని చూసి కూడా ఎప్పటిలా పలకరించలేదు. మిషెల్ గురించి ప్రశ్నించలేదు. మెక్‌డోనాల్డ్ మాత్రం పలకరించాడు. రెండు జంటలకు అరగంట తేడాలో విడాకులు మంజూరయ్యాయి.
“మిషెల్ మరణించదనే ఆలోచన మానెయ్యండి. ఏదో రోజు తిరిగి రావచ్చు. అంతదాకా ఏం జరిగిందో మనకి ఎవరికీ తెలీదు.” మెక్‌డోనాల్డ్ జిమ్‌తో అనునయంగా చెప్పాడు.

“అదేం? ఎందుకని?” నివ్వెరపోతూ అడిగింది.
“ఒకప్పుడు ఆనందాన్ని ఇచ్చిన ఆ ఇల్లు ఇప్పుడు నాకు విచారాన్ని ఇస్తోంది. ఆ జ్ఞాపకాలతో ఇక్కడ ఉండలేను. రేపు మాకు విడాకులు మంజూరు అవబోతున్నాయి. నేను ప్లజంట్‌విల్‌లో ఇంకో ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతున్నాను.”(పాలిన్ సి స్మిత్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి
Telugu Story About Bad Characters