Home దునియా అపార్ట్ మెంట్‌లో ఆత్మ

అపార్ట్ మెంట్‌లో ఆత్మ

Murder

“పోస్టల్ టెలిగ్రామ్సు బట్వాడా ఉందా? ఆ మధ్య ఎత్తేసారన్నారు” నిద్రపోతున్న భర్తను తట్టి లేపి ప్రశ్నించి మరీ చేతిలో టెలిగ్రావ్‌ు పెట్టింది.
తల విదలించి స్టీఫెన్ (32) టెలిగ్రావ్‌ు అందుకున్నాడు. ‘టెలిగ్రావ్‌ు అంటేనే ఒకరకమైన ఉత్సుకత. చావు కబురు చల్లగా చెప్పే తోకలేని పిట్ట. ఉద్యోగం వచ్చిందనే ఎనలేని ఆనందాన్ని నింపే దైవదూత. అలాంటి టెలిగ్రావ్‌ుకు పోస్టల్ డిపార్టుమెంట్ 2013లో చెక్ పెట్టేసింది. దానికి కారణం సెల్‌ఫోన్లు లేని చేతులు లేవు. చీమచిటుక్కుమంటే తెలియచెప్పే సాధనమయ్యింది. ఇక టెలిగ్రావ్‌ుతో పనేముంది?’ అంత నిద్రమత్తులో కూడా ఆలోచనలు సుడులు తిరిగాయి. చేతిలో టెలిగ్రావ్‌ును పట్టుకుని కిందేసి మీదేసి చదివాడు. స్థానిక పోస్టాఫీసు నుంచి వచ్చిందే. ఏ అర్ధరాత్రో, నిన్నో, మొన్నో టెలిగ్రావ్‌ు సర్వీసులు దేశ వ్యాప్తంగా తిరిగి ఆరంభించి ఉంటారని అనుకున్నాడు.
టెలిగ్రావ్‌ులో డాక్టర్ రషీద్ అబూల్ సీరియస్ స్టార్ట్ ఇమ్మీడియెట్లీ.‘ఎవరీ రషీద్? రాంగ్ టెలిగ్రావ్‌ు’ అని మడతపెట్టి టీపాయ్ మీద పెట్టేసాడు.
అప్పుడే బెడ్‌కాఫీతో వచ్చింది ఉజమాబేగం(29).
“టెలిగ్రావ్‌ు రావడమేమిటో? ఆ వ్యవస్థ ఎత్తేసి చేతులు దులుపుకుంది కేంద్రసర్కార్. బట్వాడా వాడు ఎలా ఉన్నాడు.” ఉత్సుకతతో అడిగాడు.
అప్పుడే అపార్టుమెంట్ వాచ్‌మెన్ వచ్చాడు.
“సార్ మిమ్మల్ని ఓనర్ రమ్మంటున్నారు. ఇలా వచ్చి అలా వెళ్లిపోవచ్చు అని చెప్పారు.”
“ఎందుకు? అసలే తిక్కలోడు ఈ ఓనర్‌” అని ఆలోచిస్తూనే టెలిగ్రావ్‌ు చేతబట్టుకుని కిందకు వెళ్లాడు.
ఓనర్ ఓ గదిలోకి తీసుకుపోయి సిసి కెమెరా ఫుటేజీ చూపాడు. “నీ ఇంటికి ఒక ఆత్మవచ్చి తలుపుతట్టి ఓ కాగితాన్ని నీ భార్యకు ఇచ్చింది.” చూడు అని చూపాడు. ఫుటేజిలో తెల్లని పొగమంచు ఆకారం కదులుతూ చకచకా తలుపు తట్టడం చూసి చెమటలు పట్టాడు. సెల్ ఫోన్‌లో ఉజమాను కిందకు రమ్మని పిలిచాడు. ఆమె ఫుటేజిలో ఆత్మను చూసి అదిరిపడింది.
“నాకు ఇలా పొగమంచు ఆకారం టెలిగ్రావ్‌ు ఇవ్వలేదు. పక్కా పోస్టల్ బట్వాడా ఉద్యోగి వచ్చి ఇచ్చాడు.”
“మీకు కన్పించే రూపం కెమెరాల్లో రాలేదన్నమాట.” అని అపార్టుమెంట్ ఓనర్ ఆశ్చర్యపోయాడు. తర్వాత అపార్టుమెంట్‌లో డెవిల్ తిరుగుతుందని క్షణాల్లో టావ్‌ు టావ్‌ు అయ్యింది. పోలీసులు వచ్చారు. విచారణ చేసారు.
వేకువ జామున టెలిగ్రావ్‌ు బట్వాడా చేయబడింది. స్టీఫెన్ వైఫ్ ఉజమా ఆత్మను చూసిన ప్రత్యక్ష సాక్షి. ఆమె తప్ప వేరెవ్వరు చూడలేదు.
ఆమె ఒకింత భయానికి లోనయ్యింది. తను చూసింది మనిషినే. కానీ, అది ఆత్మ అని సిసి
ఫుటేజిలో పొగమంచు ఆకారం చూడడంతో
కన్‌ఫర్మ్ అయ్యింది.
పోస్టల్ సూపరెండెంటు వచ్చాడు. టెలిగ్రావ్‌ు పరీక్షగా చూసాడు. నిజానికి ఎలాంటి అపకారం తలపెట్టని ఆదిల్ ఖుస్రూ పోస్టల్ డిపార్టుమెంటులో ఈ సిటీ ఓల్డు పోస్టాఫీసులో క్లాస్‌ఫోర్ ఉద్యోగమే చాలా కాలం చేసాడు. అతడే ఆత్మ అయ్యాడని, అప్పుడప్పుడు ఎవరెవరికో కన్పిస్తుంటాడని చెప్పాగా విన్నాను. అతడి ఫొటో నా సెల్‌లో ఫీడయి ఉందని సెల్‌లో ఆ ఫొటో చూపాడు.
అతడు నల్లగా ఎత్తుగా లావుగా చిన్నపిల్లలు చూస్తే దడుసుకునేలా ఉన్నాడు.
“ఆదిల్ ఖుస్రూ చనిపోయి చాలాకాలం అయ్యింది.” చెప్పి పోలీసులకు కూడా ఆ ఫొటో చూపాడు.
స్టీఫెన్, ఉజామాలకు పోలీస్ అధికారి ఖుస్రూ ఫొటో చూడమని చూపాడు.
“సార్ ఇతడినే నేను చూసానని చెప్పింది.”
“ఎలాంటి అపకారం చేయని ఆత్మ ఆదిల్ ఖుస్రూ. కనుక భయపడనక్కర్లేదు.” ధైర్యం చెప్పి అంతా వెళ్లిపోయారు.
ఉజమా బేగం, స్టీఫెన్ దంపతులు ఓ ఆత్మ టెలిగ్రావ్‌ు ఇవ్వడమేమిటో? పోలీసులు ఆ టెలిగ్రావ్‌ును స్వాధీనం చేసుకోవడమేమిటో అని వింతగా ఫీలయ్యారు. పదయ్యే సరికి ఆఫీసుకు వెళ్లిపోయాడు స్టీఫెన్.
ఒంటరిగా ఉన్న ఉజమాకు అంతవరకు లేని భయం అలా పెరిగి విషవృక్షం అయ్యింది. మద్యాహ్నానికి ఒళ్లంతా వేడెక్కిపోయింది. దుప్పటి కప్పుకుని నిద్రపోయింది. అదేపనిగా కాలింగ్‌బెల్

మోగేసరికి లేవలేక లేచి డోర్ తెరిచింది. ఎదురుగా వాచ్‌మెన్‌తో కొత్తవ్యక్తి ఉన్నాడు. మీకు జ్వరంగా ఉందని ఫోన్ వచ్చింది. మందులు తీసుకుని వచ్చాను. ఈ బ్రెడ్ వేడిపాలతో తీసుకోండి. ఒంటి నొప్పులు, జ్వరం తగ్గిపోతుంది.” అని చిన్నప్యాక్ చేతిలో పెట్టాడు.
“నాకు ఒంటినొప్పులు, జ్వరం ఉందని నాకే తెలియదు. నీరసంగా ఉంటే నిద్రపోయాను. కనీసం నా భర్తకు కూడా తెలియదు. మా ఇద్దరిలో ఎవరో ఒకరు మీ మెడికల్ షాపుకు చెప్పాలి. ఏమిటో ఉదయం నుంచి ఏదేదో జరుగుతోంది. వీటి బిల్ ఎంత?” మందులు చూస్తూ అడిగింది.
“బిల్ ఓ పెద్దాయన పే చేసారు.” చెప్పి
వెళ్లిపోయాడు.
డోర్ క్లోజ్ చేసి ఒళ్లంతా తడిమితడిమి చూసుకుంది. నిజమే జ్వరం వచ్చింది. జ్వరం తగ్గించే టాబ్లెట్ వేసుకుంది. సాయింత్రం స్టీఫెన్ వచ్చిన వరకు కాలుకాలిన పిల్లిలా ఇంట్లో తిరుగాడింది. ఆ రోజు ఒక అడుగు ముందే వచ్చాడు. జరిగిన విషయాన్ని పూసగుచ్చింది.
“టెలిగ్రావ్‌ు ఇచ్చిన ఆత్మ అపార్టుమెంట్‌లో తిరుగుతోంది. అందుకే నీకు వచ్చిన జ్వరం నీకు తెలియదు. కానీ, ఆ ఆత్మకు తెలుస్తోంది. పైగా, అది నిన్ను పట్టుకుని పీడించేదో, రక్తం జుర్రుకునేదో కాదు. ఉన్నంతలో సాయపడుతోంది. నీవు ఉదయం ఆత్మను చూసినందున ఒంటరిగా కొన్ని గంటలున్నందున నీకు భయంతో జ్వరం వచ్చింది. భయపడకు అని ధైర్యం చెప్పాడు.”
స్టీఫెన్ చేతులు గట్టిగా పట్టుకుంది.
“నీవుంటే నాకు భయం ఉండదు. కానీ, నీవు లేకుంటే నేను తెలియకుండానే భయపడుతున్నాను.”
“అలా భయపడకూడదు. కిందికి వెళ్లి సిసి ఫుటేజి చూద్దాం. ఆత్మ తిరిగిందేమో తెలుస్తుంది.”
ఆమెను తీసుకుని కిందకు వెళ్లాడు. అక్కడ సిసి
ఫుటేజిని చూపించమంటే అక్కడే ఉన్న అపార్టుమెంట్ ఓనర్ లేదనేసాడు.
“పోలీసులు పట్టుకుపోయారు. వారు ఇచ్చేసరికి వారమో పదిరోజులో పడుతుంది” చెప్పి తలతిప్పేసాడు.
స్టీఫెన్, ఉజమా ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అపార్టుమెంటులో దయ్యమో, ఆత్మో తిరుగుతోందని మరింత ప్రచారమైతే క్షణాల్లో మొత్తం అందరూ ఖాళీ చేసేస్తారనే ఓనర్ భయంతో ఇలా ప్రవర్తిస్తున్నాడని గ్రహించేసారు.
***
అపార్టుమెంట్‌లో దయ్యమో, ఆత్మో తిష్టవేసిందని అన్ని ఫ్లాటుల్లో కుటుంబాల్లో అలజడి ఆరంభం అయ్యింది. పైగా, ఉజమాబేగంకు భయంతో కూడిన జ్వరం మళ్లీ మళ్లీ వచ్చేస్తోంది. ఆమె ఆసుపత్రి పాలయ్యిందని తర్కించుకుని ఒక్కొక్కరూ ఖాళీ చేసేసి వెళ్లిపోసాగారు.
ఆసుపత్రిలో ఉజమా బెడ్ పక్కనే నిద్రపోతున్న స్టీఫెన్‌కు అర్ధరాత్రి మెలుకువ వచ్చింది. కొత్త డాక్టర్ ఉజమాకు ఇంజక్షన్ ఇస్తూ కన్పించాడు. “ఇప్పటికి నాలుగు రోజులయ్యింది. జ్వరం తగ్గట్లేదు.” బెడ్‌మీద కూర్చుని అడిగాడు.
డాక్టర్ బదులీయలేదు. తన పని అయ్యిందన్నట్లు సీరియస్‌గా చూస్తూ బయటికి వెళ్లిపోయాడు.
డాక్టర్‌ను నిలదీయడానికి వరండాలోకి వెళ్లాడు స్టీఫెన్. అక్కడ టెలిగ్రావ్‌ు ఇచ్చిన పోస్టల్ ఉద్యోగి (ఆత్మ)తో డాక్టర్ మాట్లాడుకుంటూ వెళ్లిపోవడం చూసి గతుక్కుమన్నాడు. పక్క రూవ్‌ులోంచి వచ్చిన ఓ నర్సుకు ఆ డాక్టర్‌ను చూపించి ఆయన కొత్త డాక్టరా?” అడిగాడు.
“ఇప్పటికే డాక్టర్లు ఎక్కువయ్యారు. అంత ఎత్తుండే డాక్టరే ఈ ఆసుపత్రిలో లేరు. ఆయనెవరో ఏమిటో?” చెప్పి వెళ్లిపోయింది.
మరింత భయపడి ఉజమా బెడ్‌వద్దకు వెళ్లాడు. అప్పటికే ఆమె కళ్లువిప్పింది. “స్టీఫెన్ జ్వరం తగ్గింది. ఇక డిశ్చార్జి తీసుకుని వెళ్లిపోదాం. ఎందుకలా ఉన్నావు?”
“ఏమిలేదు. ఉదయం వెళ్లిపోదాం.” డిశ్చార్జీ తీసుకున్నాక అదే అపార్టుమెంటుకు వెళ్లకూడదని అనుకున్నాడు. ఆ ఆత్మ ఉజమాను అనుసరిస్తోంది. ఆసుపత్రికి వచ్చింది. ఏకంగా కొత్త డాక్టర్‌ను తీసుకువచ్చి ట్రీట్‌మెంట్ చేయించింది. ఎందుకిలా జరుగుతోంది. వెంటాడే ఆత్మల గోల ఏమిటి?” అని ఆలోచించుకుంటూ కిందకి వెళ్లి అక్కడ సిబ్బందికి సిసి ఫుటేజి చూపమని చెప్పి చూసాడు. ఫుటేజిలో రెండు ఆత్మలు పొగముద్దల్లా నడుచుకుంటూ వెళ్లడం చూసాడు. తను చూసింది ఆత్మలే అని నిర్ధారణ చేసుకుని వెనుదిరిగాడు.
***
సెంల్ క్రైవ్‌‌సు ఇన్‌స్పెక్టర్ జోసఫ్(45) ఆత్మ ఉజమాకు ఇవ్వబడ్డ టెలిగ్రావ్‌ును పదేపదే చూసాడు. ఎవరీ డాక్టర్ రషీద్‌అబూ? అతడి కండీషన్ ఎందుకు సీరియస్‌గా ఉంది. అతడు ఏడేళ్ల క్రితం డాక్టర్‌గా ఇదే టవున్‌లో పని చేసాడు. తర్వాత ఏమయ్యాడో తెలియదు. మిస్సింగ్ కేసుగా పోలీస్ రికార్డుల్లో ఉంది. వెంటనే పాత పోస్టాఫీసుకు వెళ్లాడు. పోస్టల్ సూపరెండెంట్ ఓ ఫైలు రెడీచేసి ఇన్‌స్పెక్టర్ జోసఫ్‌కు అందించాడు. ఏడేళ్ల క్రితం టెలిగ్రావ్‌‌సు ఇచ్చే పనిలో ఆదిల్‌ఖుస్రూ ఉండేవాడు. అతడికి దీర్ఘకాల చర్మ వ్యాధిని నయం చేసిన డాక్టర్ రషీద్ అబూతో చాలా సన్నిహితం ఉండేది. ఓ రోజు వేకువ జామున అప్పటి పోస్టుమాష్టరే టెలిగ్రావ్‌ు సెక్షన్‌లో కూర్చుని రషీద్ అబూ ఇచ్చిన టెలిగ్రావ్‌‌సు బుక్‌చేసాడు. ఆ తర్వాత రషీద్ ఆసుపత్రి వర్గాలు కన్పించలేదని పోలీసు ఫిర్యాదు చేసారు. అదో మిస్సింగ్ కేసు అయ్యింది. ఇక ఆయన చివరగా ఏడుగురికి టెలిగ్రావ్‌‌సు ఇచ్చాడు. ఏ ఒక్కరికి కూడా ఆ టెలిగ్రావ్‌ు బట్వాడా కాలేదు. అందుకు ఆదిల్ ఖుస్రూ విలవిలలాడిపోయి పది రోజులుగా డెలివరీ చేద్దామనుకున్నాడు. ఏడుగురు డోర్

లాక్‌లో ఉన్నారు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో ఆదిల్‌ఖుస్రూ మృతి చెందాడు. ఈ వివరాలన్నీ ఆ ఫైలులో ఉన్నాయి. టెలిగ్రామ్సు ఎవరెవరికి ఇచ్చాడా అని ఇన్‌స్పెక్టర్ చూసాడు. ఏదో ప్రమాదం డాక్టర్ రషీద్ అబూని కబళించేసి ఉంటుంది. లాంగ్ పెండింగ్ కేసుగా పోలీసు రికార్డుల్లో ఉంది. పైగా, డాక్టర్‌కు బంధువులు, భార్యా పిల్లలు లేరు. అడిగేవారే లేరు. అయినా ఈ రోజు ఆ కేసు తిరగతోడడానికి మనిషిగా ఉన్నప్పుడు టెలిగ్రావ్‌ు డెలివరీ చేయలేకపోయిన ఖుస్రూ ఆత్మగా ఆ పని చేసాడు. ఇందులో ఏదో మర్మం ఉంది. ఇందులో మూలాలు టచ్ చేద్దామని ఆ
వైపుకు పట్టుదలగా దృష్టి సారించాడు.

వారం రోజులయ్యింది. ఇన్‌స్పెక్టర్ శ్రమ ఫలించింది. డాక్టర్ రషీద్‌అబూకి పెళ్లయ్యాక తొలిరాత్రి ఆమె తను తల్లిదండ్రుల బలవంతంపై నిఖాకు ఒప్పుకున్నాను. నాకు వేరే వానితో లవ్‌ఎఫైర్ ఉంది. నీతో నేను కలిసి జీవించలేనని చెప్పింది. దాంతో రషీద్ ఆమెను ఆ లవర్‌ను కలిపేసి అప్పుడు ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. తట్టుకోలేని వారు పగబట్టి పరువుతీసిన కూతురుని, నిన్ను చంపంది వదలమని హెచ్చరించారు. అక్కడకి నాలుగునెలల తర్వాత కూతురుని మాయమాటలు చెప్పి రప్పించి పరువు హత్యకు పాల్పడ్డారు. కానీ, డాక్టర్‌ను చంపినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. అపార్టుమెంట్‌కు, అందులో ఉండే స్టీఫెన్‌కు ఆత్మలతో సంబంధం ఏమిటి? ఇంకా ఆత్మ అపార్టుమెంటులో తిరుగుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలని నిర్ణయించాడు. ఆ దిశలో అపార్టుమెంటులో నాలుగు సిసి కెమెరాలు ఫిట్ చేయించాడు.
మొత్తం అపార్టుమెంట్ దయ్యం భయంతో ఖాళీ అయిపోయింది. ఓనర్ అపార్టుమెంట్‌కు తాళాలు వేసేసి ఆ ఎదురింట్లోకి వెళ్లిపోయాడు. రాత్రంతా గడిచాక వేకువజామున ఇన్‌స్పెక్టర్ తన సిసి కెమెరాల్లో ఫుటేజిని పరిశీలించాడు. పొగమంచు ఆత్మలు రెండు (ఖుస్రూ, మరొకటి డాక్డర్) అపార్టుమెంటు అంతా కలియ తిరిగి వెనుకనే ఆనుకుని ఉన్న శిథిలమై కూలిన ఇంట్లోకి వెళ్లిపోయాయి.

ఇన్‌స్పెక్టర్ అక్కడ చుట్టుపక్కల వారిని ఆ పాడుబడ్డ ఇంటి గురించి అడిగాడు. కోర్టుకేసుల్లో ఆ ఇల్లు అలా పాడు పడిపోయిందని చెప్పారు. అందులోకి మెరికల్లాంటి కానిస్టేబుళ్లతో కలిసి వెళ్లాడు. ఓ గదిలో రెండు చివికిన బూట్లు, గుడ్డ
పీలికలు, కొన్ని బుక్సు, చింకిచేటలాంటి బ్యాగ్ అక్కడ పడున్నాయి. వాటితో బాటు సగం కప్పబడ్డ పుర్రె ఉంది. దాన్ని వెలికి తీయించి మరికొన్ని ఎముకలు సేకరించి రసాయినిక పరీక్షలకు పంపాడు. మరోవైపు సెంట్రల్ జైలులో ఉన్న డాక్టర్ రషీద్‌కు పిల్లనిచ్చి పెళ్లిచేసిన పరువు కోసం హత్యచేసే తండ్రీకొడుకును కలిసాడు. డాక్టర్ రషీద్‌ను చంపిన పాపం ఇన్నాళ్లకు మీముందుకు చట్టం వెతుక్కుంటూ వచ్చిందని చెప్పాడు. వారు ఆశ్చర్యపోయారు. నిజం ఒప్పుకోండి లేకుంటే పోలీస్‌కస్టడీ కోరుతాం. అప్పుడు ఎలా చెప్పించాలో అలా చెప్పిస్తాం అని ఒకింత కటువుగా చెప్పాడు. తామే చంపి శవాన్ని ఆ పాడుబడ్డ ఇంట్లో పూడ్చివేసాం అని ఒప్పుకున్నారు.

Telugu Story About Murder in Apartment

యర్నాగుల సుధాకరరావు, 99852 65313