Home దునియా రామ చిలుక

రామ చిలుక

Parrotరామాపురం గ్రామంలో రామయ్య, సీతమ్మ దంపతులు నివసించే వారు. వారి పెరట్లోని జామ చెట్టుకు విపరీతమైన పండ్లు కాసేవి. వాటి కోసం రామచిలుకలు గుంపులు, గుంపులుగా వచ్చి వాలేవి. వాటి పలుకులు, కులుకులు చూసుకుంటూ దంపతులిరువురూ మురిసి పోయేవారు. ఒకరోజు జామపండు తింటున్న ఒక రామచిలుక గిలగిలా రెక్కలు కొట్టుకుంటూ కింద పడిపోయింది. అది చూసి సీతమ్మ గుండెలు బాదుకుంటూ పరుగెత్తింది. రామచిలుకను చేతిలోకి తీసుకొని రెక్కలు పైకి లేపి చూసింది. రక్తం ఉండ కట్టింది. ఎవరో గులేరు(ఉండేలు)తో కొట్టినట్లుగా ఉంది. రామచిలుక దీనంగా తన వంక చూస్తుంటే.. సీతమ్మ కళ్ళళ్ళో నీళ్ళు తిరిగాయి. గాయపడిన రామచిలుకను వంటింట్లోకి తీసుకొని వెళ్ళింది. గాయాన్ని శుభ్ర పరిచి పసుపు అదిమింది. కొన్నాళ్ళు విశ్రాంతి అవసరమన్నట్టుగా రామచిలుకను పంజరంలో ఉంచింది. దానికి ప్రతీ రోజు జామపండు తినిపించేది.. నీళ్ళు తాగించేది.

చిలుక బాధతో అడుగులు వేయడం చూసినప్పుడల్లా ’రామా..’ అని భగవన్నామస్మరణం చేసేది. ఒక రోజు రామచిలుక గూడా ‘రామా..’ అనడం విని సీతమ్మ ఆశ్చర్యపోయింది. ఆ విషయాన్ని రామయ్యకు చెప్పింది. రామయ్య మదిలో ఒక ఆలోచన మెదిలింది. తాను గ్రామ పెద్దగా చెప్పే నీతులు ప్రజలు బుర్రకెక్కించుకోవడం లేదు. రామచిలుక ద్వారా చెప్పిస్తే ఫలితముంటుందను కున్నాడు. అదే విషయం సీతమ్మకు చెబుతూ.. “రామచిలుకకు సమాజానికి ఉపయోగకరమైన నీతులు నేర్పించు” అని సలహా ఇచ్చాడు. అలా పంజరంలో బంధించి బలవంతంగా శిక్షణ ఇవ్వడం నేరం. ఎవరికైనా స్వేచ్చా వాయువుల మధ్య శిక్షణ ఇవ్వాలి. చిలుకకు గాయం మానిన తరువాత పంజరం నుండి విముక్తి కలిగించు. దానికిపాటలు.. పాఠాలు నచ్చితే తప్పకుండా మనింట్లోనే ఉండి నేర్చుకుంటుంది.. లేకుంటే ఎగిరి పోతుంది అని దానికి నేర్పించాల్సిన సూక్తులు కొన్ని చెప్పాడు. రామ చిలుక గాయం పూర్తిగా మానిన తరువాత సీతమ్మ రామచిలుకను పంజరం నుండి బయటికి తీసింది.అది స్వేచ్ఛగా పెరట్లో తిరుగుతూ.. వీధులు తిరుగుతూ.. తిరిగి ఇంట్లోకి రాసాగింది. ఇక సీతమ్మ నిశ్చింతగా సూక్తులను రామచిలుకకు రోజూ వల్లె వేసేది.

ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని తర్ఫీదు ఇచ్చేది. రామచిలుక శ్రద్ధగా వింటూ కొద్ది కాలంలోనే చిన్న, చిన్న పదాలు పలుకసాగింది. ప్రతీరోజు రామచిలుక ఊరు చివర ఒక చెట్టుకొమ్మ మీద కూర్చునేది. దారిన వచ్చీ, పోయే వాళ్ళకు నీతులు వినిపించేది. అంతా రామచిలుకను అభినందించేవారు. ‘చిలుకకున్న బుద్ధి మనకు లేకపాయే..’ అని వాపోయే వారు. వారిలో కొద్ది, కొద్దిగా మార్పురాసాగింది. ఒక రోజు చెట్టు కొమ్మపై కూర్చోన్న రామచిలుక ఒకటి.. రెందు.. మూడు.. అంటూ లెక్కించసాగింది. ఒకతను పరుగెడ్తున్న వాడల్లా ఆగి రోజూ నీతులు చెప్పేదానివి. ఈ రోజు అంకెలు లెక్కపెడుతున్నావు ఎందుకు అంటూ అడిగాడు. మన గ్రామంలో ఎంతమంది బుద్ధిహీనులున్నారో.. లెక్కిస్తున్నా అంది. అంటే నేను గూడానా!, నేను గూడానా! అంటూ దాదాపు మరో పది మంది గుమిగూడారు. రామ చిలుక నిర్భయంగా ఔను. మీరంతా.. అంది. దారికి ఆవల వైపు జరిగే ఒక సంఘటనను చూపించింది. అంతా అటువైపు తిరిగి చూడసాగారు.

ఒక చిన్న కాకిపిల్ల పొరబాటున గూట్లో నుండి కింద పడింది. ఒక పిల్లి, కాకి పిల్లను నోట కరుచుకొని పోవాలని ప్రయత్నిస్తోంది. తల్లికాకి కావు.. కావు మంటూ అరిచింది. దాని అరుపులకు కాకుల గుంపు కావు, కావుమంటూ.. వచ్చి పిల్లి మీదకు దాడికి దిగాయి. కాకులు ముక్కులతో పొడుస్తూ.. పిల్లిని ముప్పుతిప్పలు పెట్టాయి. కాకిపిల్ల తెరువు రాకుండా.. పిల్లి పారిపోయింది. తల్లికాకి రివ్వున కిందకు వాలి తన పిల్లను నోట కరుచుకొని గూడుకు తీసుకెళ్ళింది. అది చూసి అది కాకుల లక్షణం. అయితే మాకెందు కు చూపావు అంటూ అడిగారంతా. అంటే కాకుల కున్న బుద్ధి.. ఐకమత్యం మీలో లేదన్న మాట. తోటి మనిషికి ప్రమాదం జరిగి అలా రోడ్డు మీద పడి, చావు బతుకుల మధ్య ఉన్నాడు. మీరంతా చూసీ చూడనట్టు పరుగెడుతున్నారు. అతణ్ణి ఆసుపత్రికి తీసుకెళ్ళి బతికించాలి, అనే ఆలోచన లేని మీరంతా బుధ్ధిహీ నులు గాక మరేమవుతారు? అంటూ ప్రశ్నించింది. అంతా సిగ్గుతో తలలు దించుకున్నారు. లెంపలు వేసుకున్నారు. వెంటనే నడీ రోడ్డు మీద గాయపడి పడిపోయిన వ్యక్తి రక్షణ కోసం పరుగులు తీశారు.

చెన్నూరి సుదర్శన్, 94405 58748
Telugu Story About Parrot