Wednesday, April 24, 2024

స్కెచ్ వేసాడు… కానీ

- Advertisement -
- Advertisement -

telugu-story

అంతరిక్షంలో గ్రహాలు వాటి కక్షలో అవి క్రమం తప్పక, తిరుగుతూ వేటికీ అంతరాయం కలిగించనట్లు, జనాలు కూడా తమ వాహనాలని, చాలా వేగంగానూ, పక్క వాహనం కన్నా ముందుగా దూసుకుపోయేలా.. రోడ్ల మీద పరిగెట్టిస్తున్నారు.

చాలాసేపటి నుండి చిన్న మార్కెట్టు వీధిలో ఉన్న బడ్డీకొట్టు దగ్గరే సిగరెట్ కాల్చుకునే నెపంతో నిలబడిపోయాడు ఆ యువకుడు. అక్కడికి దగ్గరలో… ఎదురుగా ఉన్న ఇంటి మీదే ఉంది అతని దృష్టి. రెండు అంతస్తుల మేడ, కింద రెండు పోర్షన్లు. ఆ లైను మొత్తానికి ఆ ఇంటికే కాంపౌండు వాల్ ఉంది. మిగిలిన అన్ని ఇళ్లు డైరెక్టుగా సైడు కాలువ మీదకే తెరచుకుంటాయి.
కింద రెండు పోర్షన్లు అద్దెకు ఇచ్చినట్లున్నారు. రెండు గుమ్మాలకి రెండు కర్టెన్లు వేలాడుతున్నాయి. ఒక ఇంట్లో అయితే జనాలు ఉంటారు. కాంపౌండు వాల్ పక్కనున్న పోర్షన్ పగలు తలుపు మూసే ఉంటుంది. గాలికి కదిలే కర్టెను మాటున తాళం కప్ప కనిపించీ.. కనిపించకుండా అతడిని ఊరిస్తుంది. రెండు గుమ్మాల ముందు రెండు గేట్లు ఉన్నాయి. ఒకటి జనాలు వెళ్లడానికి అయితే, రెండవది స్కూటర్లు ఎక్కించడానికి వీలుగా… ఉండేది.

గత రెండు రోజులుగా ఆ ఇంటిని పరిశీలిస్తున్నాడు. తాళంలో ఉన్న ఇంటికి సాయంత్రానికే ఆ ఇంటామె, పిల్లలూ రావడం గమనించాడు. ఆమె రోజూ స్కూటీ మీద వెళ్లి వస్తుంది. అమ్మాయి కాలేజీ బస్సులో దిగితే, చిన్న వాడైన అబ్బాయి సైకిలు మీద వస్తున్నాడు. ఆ ఇంటామె ఆడంబరంగానే ఉంటుంది.
బహుశా ఇంటి యజమాని ఉండి ఉండడు. బొట్టు పెట్టుకోదు. అతడి ఉద్యోగమే వచ్చింది కాబోలు. ఫర్వాలేదు. వర్క్ అవుట్ అయ్యే బేరమే అనుకున్నాడు.
ఆ మరునాడు… కాస్సేపు బడ్డీకొట్టు దగ్గరే ఆగి కూల్‌డ్రింక్ తాగుతూ పరిసరాలు గమనించాడు. ఆ ఇంటికి ఎప్పటిలాగే తాళం పడింది. రోడ్ల మీదకు వచ్చిన జనాలకి, గబగబా తమ పనులు చక్కబెట్టు కుని గమ్యస్థానం చేరిపోవాలన్న తపనేగాని, దేశం ఎటుపోతుందో… ఏమై పోతుందో.. పక్కన ఏం జరుగుతుందో కాస్సేపు ఆగి తెలుసుకుందామన్న ధ్యాస లేదు. అంతరిక్షంలో గ్రహాలు వాటి కక్షలో అవి క్రమం తప్పక, తిరుగుతూ వేటికీ అంతరాయం కలిగించనట్లు, జనాలు కూడా తమ వాహనాలని, చాలా వేగంగానూ, పక్క వాహనం కన్నా ముందుగా దూసుకుపోయేలా.. రోడ్ల మీద పరిగెట్టిస్తున్నారు. చీమలబారుల్లా రోడ్ల నిండా వాహనాలే. గ్రహగతులు బాగుండ బట్టి, కాలంతో పాటు పరిగెత్తుతున్నాయి.
అన్నీ అందరికీ కావాలనుకుంటే ఎలా? తమ లాంటి వాళ్ల్లూ బతకాలి కదా! తన ఆపరేషన్ స్టార్ట్ చేశాడు.
రోడ్డు దాటి.. ఎంతో పరిచయమున్న వాడిలా ఆ ఇంటి మెట్టెక్కి మెల్లగా గేటు తీసాడు. ఎంత మెల్లగా తీసినా చిన్న చప్పుడు చేసింది. ఆ చప్పుడు ఎవరికీ విన్పించినట్లు లేదు, అంతా నిశ్శబ్దం… తనని ఎవ్వరూ గమనించలేదు. గాలి కోసం తెరచిన కిటికీ రెక్క లోపలికి చెయ్యి పోనిచ్చాడు. దాని వెనుకగా వేలాడే తాడు అంది పుచ్చుకుంటే… చివరిగా కట్టిన ‘ తాళం చెవి’ చేతికందింది.
నిన్న సాయంత్రం ఆ ఇంటి పిల్లాడు… కాస్సేపు జేబులు తడుముకుని, తరువాత స్కూల్ బేగ్ తడుముకుని, తన తాళం దగ్గర లేదని గ్రహించి, చివరికి… అలాగే వెతికి ఇంటి తలుపు తెరిచాడు. కాబట్టి, తన వెంట తెచ్చుకున్న పనిముట్లకు పని చెప్పకుండా… అలాగే ప్రయత్నించాడు. తాళం తెరిచాడు. బయట ఆట్టే సేపు నిలబడడం మంచిది కాదని, వెంటనే లోపలికి అడుగుపెట్టాడు. తనని ఎవ్వరూ గమనించలేదనుకున్నా, రెండవ పోర్షన్ పక్క నుంచే పైకి వెళ్లే మెట్లున్నాయి. ఆ మెట్ల పక్కన ఉన్న ఖాళీ జాగాలో గాలి కోసం అన్నట్లు ఆ ఇంటి ‘ ముసలమ్మ’ మంచం వేసుకుంటుంది. వీధిలోకి ఆ ఖాళీ జాగా కనిపించదు.
ఓ మనిషి రావడం… తాళం తీయడం ఆ ముసలమ్మ గమనించింది. గదిలో ఉన్న మనుమరాలిని పిలిచి “ అమ్మా! కోమలా… తాహేరా ఆంటీ ఇంటికి ఎవరో వచ్చారు చూడు. ఆ వచ్చిన మనిషి చెప్పులతోనే ఇంట్లోకి వెళ్లిపోయాడు.
ఆంటీ ఇంటికి ఈ టైములో ఎవ్వరూ రారుగా… ఎవరో అడుగు” పురమాయించింది ముసలమ్మ.
అవును. ఆంటీ ఇంటికి వాళ్ల అమ్మా, చెల్లెళ్లు తప్ప మరెవరూ రారు. వాళ్లకి ఘోషా ఎక్కువ. గుమ్మం వరకూ వచ్చిన కోమల అక్కడే నిలబడి… మధ్యగదిలో ఉన్న ఆగంతకుడ్ని చూస్తూ “ఎవరండీ మీరు. ఎవరి కోసం వచ్చారు. ఎవరు కావాలి. అలా చెప్పులతో ఇంట్లోకి వెళ్లిపోయారే” అడిగింది.
తనని ఎవరూ గమనించడం లేదని, సులువుగా కోటలో పాగా వెయ్యగలిగినందుకు సంతోషపడుతూ అక్కడే నిలబడి… ఎక్కడ ఏం ఉన్నాయో పరిశీలిస్తు న్నాడు. ఇంట్లో అంత విలువైన వస్తువులేం కనబడ లేదు. ఆమె ఏం ఉద్యోగం చేస్తుందోగాని, టీ.వీ కూడా పాతకాలం నాటి డబ్బానే, దాన్ని ఎత్తేస్తే దొరికిపోతాడు.
చీరలేవో దండెం మీద బాగానే వేలాడుతున్నా, తను వాటినేం చేసుకుంటాడు. బీరువా పరిస్థితి ఏమిటో చూడాలి అనుకుంటున్న తరుణంలో గుమ్మం ముందు ఓ పదిహేనేళ్ల అమ్మాయి ప్రత్యక్షం అయి ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తుంటే… క్షణ కాలం తత్తరపడ్డాడు.
ఏం చెప్పాలో తెలియక తికమక పడ్డాడు. ఆమెనే రెప్ప వేయడం మరచిపోయినట్లు చూస్తూ ఉండిపోయాడు.
“ చెప్పండి. మా తాహేరా ఆంటీ లేనప్పుడు వచ్చారే… ఎవరు మీరు.” రెట్టించింది. ఆ మాటలకి తేరుకొని అమాయకురాలు క్లూ ఇచ్చేసిందని అనుకుంటూ “ మీ తాహేరా ఆంటీ తమ్ముడినే” అన్నాడు రిలాక్సుడుగా. తమ్ముడిని కాబట్టి, ఎలా తిరిగినా ఫర్వాలేదు అన్నట్లు.
“ తమ్ముడా! ఆంటీకి తమ్ముళ్లు ఎవ్వరూ లేరే. మీ పేరేంటీ” అడిగింది ఆరాగా. మళ్లీ తత్తరపడ్డాడు. పక్క ఇంటిలో ఉన్నందుకు ఆమె బయోడేటా అంతా ఈ అమ్మాయికి బాగా తెలిసినట్లుందే అనుకుంటూ. “ పేరా… సురేష్‌” చెప్పాడు తడుముకోకుండా.
అతడు తడుముకోకపోయినా కోమల పట్టుకుంది. “ సురేషా… తహేరా తమ్ముడు, సురేషా” ఓ నిమిషం పాటు ఆశ్చర్యపోయి… అతని వంక అనుమానంగా చూస్తూ కళ్లలో ఎన్నో ప్రశ్నలు కదలాడుతుండగా… పైకి ఏమీ మాట్లాడలేక
“ ఉండండి ఆంటీకి ఫోన్ చేస్తాను” అంటూ చేతిలో ఉన్న ఫోన్లో, నెంబరు వెతికే ప్రయత్నం చేసింది కోమల. ఆమె పోలీసు కానిస్టేబుల్ కూతురు. ఇంగువ కట్టిన గుడ్డలా తండ్రి లక్షణాలు ‘ కొన్ని’ వంటబట్టించుకుంది.
ఇక్కడ అడ్డంగా దొరికిపోయాడు
“ చెయ్యండి. నష్టం ఏముంది. మాట్లాడతాను” బింకంగా పలికాడు ముఖాన్న పట్టిన చెమట తుడుచుకుంటూ. ఫోన్ రింగు అవుతుంది. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని, సిగ్నల్ కోసం అన్నట్లు దగ్గర నుంచి గేటు వైపు నడచి, అటూ ఇటూ పచార్లు చేస్తూ
“ ఆంటీ… ” అంటూ విషయం చెబుతుంది. ఇంతలో వెనుక… గేటు చప్పుడవడంతో అటు తిరిగింది. ఆగంతకుడు గదిలోంచి ఎప్పుడు బయటకొచ్చాడో గాని… ఆమెని దాటుకుని… మెల్లగా దాటేసాడు. అతడి చర్యకి నోట మాట రాక అవాక్కయ్యింది కోమల.

Telugu Story About Robbery

పి.ఎల్. ఎన్. మంగారత్నం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News