Friday, March 29, 2024

మూడు గొడ్డళ్లు

- Advertisement -
- Advertisement -

 

సరయూ నది ఒడ్డున రామశాస్త్రి గురుకుల పాఠశాలను స్థాపించి ఎంతో మందిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నాడు.  ఆ గురుకులానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పక్కనే గలగలమని పారే నది. చుట్టూ కొబ్బరి, అరటి, మామిడి, వేప చెట్లే కాకుండా రకరకాల పూల మొక్కలతో అక్కడి ప్రకృతి ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది.
ఆ గురుకులానికి కావలసిన ధాన్యాన్ని ఎంతో మంది దాతలు అందిస్తుంటారు. రామశాస్త్రిగారు ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకుంటారు.
సమయం చిక్కినప్పుడల్లా నీతి కథలు చెప్పి విద్యార్థులను మంచి మార్గం వైపు నడచుకునేలా చేసేవారు.
ఒకసారి గురుకులంలో కొన్ని ఎండిపోయిన చెట్ల ను కొట్టడానికి ముగ్గురు పనివాళ్లు వచ్చారు. వారి పేర్లు సత్యం, ధర్మం, న్యాయం. వాళ్ళు కొమ్మలు నరుకుతూ భోజనం సమయంలో విద్యార్థులతో పాటు భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటుండగా రామశాస్త్రిగారు ఒక కథను చెప్పసాగారు.
“ఇది ఈ నది ఒడ్డున జరిగింది. ఒకసారి రామయ్య అనే అతను ఎండిన చెట్టు కొమ్మలు గొడ్డలితో కొడుతుండగా అది పొరపాటున జారి నదిలో పడిపోయింది. అతను ఎంతో బాధతో ‘అయ్యో నా జీవనాధారం పోయిందే’ అని కన్నీరు పెట్టుకున్నాడు.
అప్పుడు జల దేవత ప్రత్యక్షమయ్యి “రామయ్యా! బాధ పడకు ఇదిగో నీ గొడ్డలి అని నీటి నుండి బంగారు గొడ్డలిని తీసి ఇవ్వబోయింది. అతను ఇది నాది కాదు అన్నాడు. దేవత మళ్లీ నీటిలో మునిగి వెండి గొడ్డలి తీసి ఇవ్వబోయింది. ఇది కూడా నాది కాదు అన్నాడు చివరకు దేవత ఇనుప గొడ్డలిని తీసి ఇవ్వబోయింది.
అతను ఎంతో సంతోషపడి ఇదే నా గొడ్డలి అని తీసుకున్నాడు. జల దేవత నీవు నిజాయతీపరుడవు అందుకు నీకు నీ గొడ్డలితో పాటు బంగారు, వెండి గొడ్డళ్లను కూడా కానుకగా ఇస్తున్నాను అని ఇచ్చి మంచి మార్గంలో ప్రయాణించు అని చెప్పి మాయమయ్యింది” అని కథను ముగించాడు.
కథ విన్న అందరూ చప్పట్లు కొట్టారు.
ఒక విద్యార్థి లేచి “గురువు గారు! ఇప్పటికీ ఆ జలదేవత ఉందా?” అన్నాడు.
“ఆ ఉంది నిజాయితీ ఉన్న వారిపట్ల ఇప్పటికీ కరుణ చూపిస్తోంది” అని సమాధానం చెప్పాడు.
తరువాత విద్యార్థులు చదువుకోసాగారు.
ఈ కథను విన్న సత్యం, ధర్మం, న్యాయం గురువు గారు మంచి కథను చెప్పారు అనుకున్నారు.
సాయంత్రం అయ్యేసరికి కొమ్మలు నరికే పనిని ఆపేశారు ఆ ముగ్గురూ. తరువాత సత్యం మిగతా ఇద్దరినీ తీసుకొని నది ఒడ్డుకు చేరాడు. ముందుగా అక్కడ ఉన్న ఒక పచ్చని చెట్టు కొమ్మను నరుకుతూ గొడ్డలిని నీటిలో కావాలని జారవిడిచాడు. తరువాత ధర్మాన్ని కూడా అలాగే చేయించాడు. న్యాయం మాత్రం అలా చేయనని ఒక పక్కగా కూర్చున్నాడు సత్యం న్యాయం చేతిలోని గొడ్డలిని తీసుకొని నీటిలో పడేశాడు. మీతో స్నేహం చేయడం నా పొరపాటు అని న్యాయం ఎంతో నొచ్చుకున్నాడు.
కాసేపటికి జలదేవత నీళ్లలో నుండి పెద్ద శబ్దం చేస్తూ పైకి వచ్చింది. సత్యం, ధర్మం ఎంతో సంతోషించారు.
“మీరు చెప్పే మాటలు వినే సమయం నాకు లేదు” అని జల దేవత రెండు బంగారు గొడళ్లు, ఒక ఇనుప గొడ్డలితో పాటూ మూడు బంగారు నాణాలను వారికి చూపించింది. నాది ఈ బంగారు గొడ్డలి అని సత్యం ఒకటి, ధర్మం ఒకటి తీసుకున్నారు. నాది మాత్రం ఇనుప గొడ్డలి అని న్యాయం తీసుకున్నాడు.
ఈ బంగారు నాణేలు మీకోసం తెచ్చాను అని తలా ఒకటి ఇచ్చింది. నాకు వద్దు అన్నాడు న్యాయం. జల దేవత ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిందేనని న్యాయం చేతిలో బలవంతంగా పెట్టింది.
అన్నట్టు మీకు ఒకముఖ్యమైన విషయం చెబుతున్నాను… ‘మీరు తీసుకున్న వస్తువులు మీరు చేసిన మంచి పనులను బట్టీ మారతాయి’ అని నీటిలో మునిగి మాయమయ్యింది.
ముగ్గురూ ఎవరి ఇళ్లకు వారు చేరారు.
సత్యం తన భార్య పిల్లలతో దేవత అనుగ్రహించి బంగారు గొడ్డలినీ, బంగారు నాణేన్ని ఇచ్చిందని చెప్పాడు. ధర్మం కూడా అలాగే చెప్పాడు. ఆ రాత్రి వరకూ ఆ వస్తువులలో ఎలాంటి మార్పు లేదు.
న్యాయం గొడ్డలి గురించి కానీ నాణెం గురించి కానీ ఏమీ పట్టించుకోకుండా భార్యా పిల్లలతో హాయిగా భోజనం చేసి పడుకున్నాడు.
తెల్లారింది. సత్యం బంగారు గొడ్డలితో పాటూ నాణెం కూడా ఇనుముగా మారాయి. లబో దిబోమని మొత్తుకున్నాడు.
అవును మరి సత్యం పేరుకే గానీ అతను ఆడేవన్నీ ఆబద్ధాలే అందుకే వస్తువులు అలా అయ్యాయి.
సత్యం గబగబా ధర్మం ఇంటికి వెళ్ళాడు. విషయం చెప్పేలోపల తన వస్తువులు కూడా ఇనుముగా మారాయని ధర్మం చెప్పాడు. అవును ధర్మం మాత్రం తక్కువ తినలేదు అతను కూడా ఏ విషయంలోనూ ధర్మాన్ని పాటించ లేదు. అలా జరిగినందుకు సత్యం లోలోపల చాలా ఆనందించాడు.
ఇద్దరూ కలిసి న్యాయం ఇంటికి వెళ్లారు.
ఏదీ నీ బంగారు నాణేన్ని చూపించు అన్నారు.
గొడ్డలి పక్కన నాణాన్ని పెట్టిన విషయం గుర్తుకు వచ్చింది. లోపలకు వెళ్ళి చూశాడు. ఇనుప గొడ్డలి కాస్తా బంగారంగా మారింది. పక్కన పెట్టిన నాణెం కూడా బంగారం మాదిరిగానే ఉంది అవి తీసుకెళ్లి వారికి చూపించాడు.
సత్యం ధర్మం మారు మాట్లాడకుండా అక్కడనుండి జారుకున్నారు.
అవునురా! మనం ‘పేరు గొప్పగా ఊరు దిబ్బగా’ అన్న రీతిన ప్రవర్తించాం, న్యాయం సంగతి మనకు తెలుసు అందుకే వాడికి బంగారు వస్తువులు దక్కాయి అని అనుకున్నారు.
అవును న్యాయం ఎప్పుడూ న్యాయంగానే ప్రవర్తించాడు. ఉన్నదాంట్లో ఇతరులకు సహాయం చేయడం వల్ల అందరూ అతణ్ని పేరును సార్థకం చేసుకున్నాడు అని మెచ్చుకునేవారు.
న్యాయం బంగారు గొడ్డలిని గ్రామ అధికారికి ఇచ్చి దానిని అమ్మి ఆ వచ్చిన ధనాన్ని గ్రామ అభివృద్దికి ఉపయోగించమన్నాడు.
తరువాత న్యాయం బంగారు నాణేన్ని అమ్మి చిన్నగా కట్టెల వ్యాపారాన్ని ప్రారంభించాడు. అది తొందరలోనే పుంజుకొని పెద్దగా అయ్యి ఆ ఊరికి పెద్ద షావుకారు అయ్యాడు. బీద వాళ్ళకు తన వంతు సహాయాన్ని అందించి మరింత మంచి పేరు తెచ్చుకున్నాడు.

యు. విజయశేఖర రెడ్డి
99597 36475

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News