Home ఎడిటోరియల్ ఎన్నికల హామీల విజృంభణ

ఎన్నికల హామీల విజృంభణ

Telugu story on Election Promises

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తున్న ఎన్నికల హామీలను గమనించి నపుడు కొన్ని ప్రశ్నలు అనివార్యంగా ముందుకు వస్తున్నాయి. ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం ఆయన అంటున్నట్లు పరిపాలనలో అన్ని విధాలుగా విఫలమైనట్లయితే, ప్రతి వర్గానికి చెందిన ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లయితే అపుడు వచ్చే ఎన్నికల లో కాంగ్రెస్ విజయం నల్లేరుపై బండి నడక కావాలి. అందుకోసం ఇక చేయవలసింది ఏమీ ఉండకూడదు. కాలు మీద కాలు వేసుకుని ఏమీ మాట్లాడకుండా ఉన్నా ప్రజలు టిఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని వద్దన్నా అప్పగించాలి. కాని పిసిసి అధ్యక్షుడు రోజు రోజు కూ విజృంభించి హామీలను ఎందుకు ప్రకటిస్తున్న ట్లు? అది కూడా ఆశ్చర్యం కలిగించే స్థాయిలో? ప్రభుత్వం పట్ల ప్రజలకు అసంతృప్తి ఉన్నట్లు ఆయన విశ్వసించటం లేదు గనుకనా? లేక ప్రజల కు మేలు చేసే తపనవల్లనా?

ఇది ఒక ప్రశ్న కాగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటనలు అన్నీ నగదు రూపంలో డబ్బు పంపిణీకి సంబంధించినవే తప్ప, అభివృద్ధి పథకాలు, కార్యక్ర మాల పరంగా ఫలానాది చేయగలమని ఆయన ఇంతవరకు ఒక్క హామీ అయినా ఇచ్చినట్లు లేరు. దీనిని బట్టి ఏమనుకోవాలి? తమకు డబ్బు వీలైనంత ఎక్కువగా పంచిపెట్టే పాలకులు రావాలని, నికరమైన అభివృద్ధితో పనిలేదని ప్రజలు భావిస్తున్నారనేది ఆయన ఆలోచనా? లేక అభివృద్ధి కార్యాలు దిశలో ఆలోచించి చెప్పలేకపోతున్నారనా? ఇది రెండవ ప్రశ్న కాగా, టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొంత కాలానికి ఆరంభించి ఇటీవలి వరకు కూడా ప్రభుత్వ హామీలు “అలవి కానివి” అంటూ కాంగ్రెస్ నాయకులు పదేపదే విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చర్యల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నదని అన్నారు. అయితే, తాము స్వయంగా విజృంభించి నగదు పంపిణీ హామీలను మొదలు పెట్టగానే ఆ మాట వదిలివేసిన ట్లున్నారు. ఎందువల్లనో తెలియదు. వారే చెప్పగల గాలి. తమ హామీల వల్ల రాష్ట్ర కోశాగా రంపై అదనపు భారమేమీ పడదని వారి అధ్యయ నాలు తేల్చాయా? లేక భారంపడినా సరే అధికార సంపాదన ముఖ్యమని రాజకీయ నిర్ణయం తీసుకున్నారా? లేక టిఆర్‌ఎస్ ప్రభుత్వ హామీలు అలవి కానవి, అంతకు మించిపోతున్న తమ హామీలు మాత్రం అలవికాగలవని చెప్తున్నారా? ఒకవేళ అటువంటిది అయితే, తాము జరిపామంటున్న అధ్యయనాలను యథాతథంగా వెల్లడించినట్లయితే ప్రజలు అర్థం చేసుకునేందుకు అవకాశముంటుంది. అవి సరైనవనే అభిప్రాయం ప్రజలకు కలిగితే కాంగ్రెస్ హామీలకు విశ్వసనీయత ఏర్పడుతుంది. కేవలం ఓట్ల కోసం తోచిన విధంగా హామీలు ఇస్తూ పోతున్నారనే అపనమ్మకం కలగకుండా ఉంటుంది.

లేకవారి అధ్యయనాలు రహస్యాలా? ఇది మూడవ ప్రశ్నకాగా, అసలు మొత్తం రాష్ట్ర బడ్జెట్‌లో దేనికి ఎంత కేటాయింపులన్నది బడ్జెట్ పత్రాలలో ఉండేదే. ఆ ప్రకారం కాకుండా ఉండా లంటే, తమ హామీల విజృంభణకు నిధులు అందు బాటులో ఉండాలంటే ఆదాయాలు పెంచి ఖర్చులు తగ్గించాలి. ఆ విధంగా ఒక ‘నమూనా బడ్జెట్’ను వారు తయారు చేసి ప్రజల ముందుంచగలరా? ఆదాయాలు పెంచటం ఖర్చులు తగ్గించటం అయి నా కావచ్చు, లేదా ఖర్చుల పద్దులను వేర్వేరు శాఖల మధ్య సర్దుబాట్లు చేయటం అయినా కావచ్చు, మొత్తం మీద నిధుల రాబడి, పంపిణీకి సంబంధించి స్థూలమైన లెక్కలు మాత్రం అవసరం. అపుడే వారి మాటలకు విశ్వసనీయత ఏర్పడుతుంది. ఆ పని వారు ఇప్పటికే చేసి ఉండకపోవచ్చు. అయినా నష్టం లేదు. కాని వీలైనంత త్వరలో చేయాలి. లేనట్ల యితే, ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీలు ప్రస్తుతా నికి ప్రజలకు ఆశ్చర్యాన్ని మాత్రమే కలిగిస్తు న్నాయి. ప్రజల తమ ఆశ్చర్యం నుంచి తేరుకునే సమ యానికి కాంగ్రెస్ వివరాలు ముందుకు వస్తే సరేసరి. లేనట్లయితే అపనమ్మకం మొదలవు తుంది. అప్పుడది కాంగ్రెస్‌కు నష్టానికి దారి తీస్తుం దని వేరే చెప్పనక్కరలేదు.

ఈ తరహా ప్రశ్నలను అట్లుంచి ఈ సందర్భంలో కొన్ని విషయాలు గుర్తుకు వస్తున్నాయి. అందులో ఒకటి తమ పార్టీకే చెందిన నాయకుడు అయిన వై.ఎస్. రాజశేఖర రెడ్డికి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి మధ్య ఏర్పడిన ఒక పరిస్థితి. 2004లో ఓడిపోయినా చంద్ర బాబు అంతకు కొద్ది ముందే రైతులకు ‘కోటి వరాలు’ అంటూ తిరుపతిలో ప్రకటించారు. వాటిలో కొన్ని ఆకర్షణీయంగా ఉండిన మాట నిజం. అయినప్పటికీ తన పరిపాల నా కాలమంతా ఆయన వ్యవసాయాన్ని నష్టాల పాలు చేయటంతో రైతులు, ఇతర గ్రామీణులు తన కోటి వరాలను నమ్మక 2004 ఎన్నికలలో ఓడించారు. దానితో ఆయన ఏ విధంగా నైనా సరే 2009లో గెలవాలన్న ఆతురతలో పలు వర్గాలకు వరుసగా ‘ఉచితా’ లు ప్రకటించసాగారు. అది చూసి రాజశేఖర రెడ్డి తన బహిరంగ సభలలో, చంద్రబాబు ‘ఆల్ ఫ్రీ బాబు’ గా మారారని ఆయన మాటలను నమ్ముతారా అని, అటువంటివీ సాధ్యమా అని ప్రశ్నలు వేస్తూ పోయారు. ప్రజలు ‘నమ్మం నమ్మం’ అంటూ చేతులెత్తి ఊపేవారు. చివరకు చంద్రబాబు హామీలు ఆయనను రెండవసారి కూడా గెలిపించలేక పోయారు. ఇక్కడ కూడా 2014లో గెలవలేక పోయిన తెలంగాణ కాంగ్రెస్, 2019 కోసం విజృంభించి హామీలిస్తున్నది. వాటిని ప్రజలు నమ్ముతారో లేక ‘ఆల్ ఫ్రీ బాబు’ తరహా ఎన్నికల మాటలుగా తీసుకుంటారో కాలమే సమాధానం చెప్పగలదు.

గుర్తుకు వస్తున్న మొదటి విషయం ఇది కాగా మరొకటి, దేశంలో ఆర్థిక సంస్కరణల దశను ప్రపంచ బ్యాంకు సలహా మేరకు పాతికేళ్లకు పైగా క్రితం ప్రవేశపెట్టిన కాంగ్రెస్, ప్రజలకు సబ్సిడీల కోతలు, హామీల కోతల దశను తీసుకు వచ్చింది. ఇదిమారుమూల సామాన్యుల వరకు అందరికీ అర్థమైపోయిన విషయం. కాని ఇటు ఇదీ చేయక, అటు సాధారణ రూపంలో అభివృద్ధినీ సాధించక ఆ పార్టీ రెంటికి చెడిన రేవడి అయింది. 1991 సంస్కరణల నాటికే బలహీనపడి ఉండిన కాంగ్రెస్ పరిస్థితి కేంద్రంలోగాని, వివిధ రాష్ట్రాలలో గాని తర్వాత మరింత బలహీనపడిందో కళ్ల ఎదుట కన్పిస్తున్నది. ఈ తరహా ఒడిదుడుకుల రాజకీయ పరిణామాల మధ్య జరిగిన 2014 ఎన్నికలలో ఆ పార్టీ బలం లోక్‌సభలో చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 44 సీట్లకు పడిపోయింది. తెలుగు రాష్ట్రాలు రెండింటిలో పరిస్థితి తెలిసిందే. ఇటువంటి నేపథ్యం లో జరగనున్న 2019 ఎన్నికలు వారిని మహా తీవ్రమైన వత్తిడికి గురి చేస్తున్నాయి. ఏమి చేసైనా సరే అధికారానికి రావాలన్నది వారి లక్షం. సరిగా అందుకోసమనే, తాము ప్రవేశపెట్టి ఎంతో గర్వంగా చాటుకునే ఆర్థిక సంస్కరణల ఫిలాసఫీకి విరుద్ధంగా తెలంగాణలో విజృంభించి డబ్బు పంపిణీ హామీలనిస్తున్నారు. అంతిమంగా ఇది వారికి ఫలితాన్ని ఇవ్వగలదా లేదా అనేది డబ్బుపైన కాదు, కాంగ్రెస్ నాయకత్వం పట్ల గల రాజకీయ విశ్వస నీయతపై ఆధారపడి ఉంటుంది. విశ్వసనీయత చాలా సున్నితమైన, ఆయువుపట్టు వంటి ప్రశ్న. ఈ రహస్యాన్ని రాజశేఖర రెడ్డి కనుగొన గలిగారు. అందువల్లనే ప్రజల దృష్టిలో ‘ఆల్ ఫ్రీ బాబు’ ను తేలిక చేసి ఓడించగలిగారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్ది నెలల క్రితం తన హామీల పరంపరను ప్రారంభించినపుడు కాంగ్రెస్ జాతీయ నాయకులు అందుకు ఎక్కువ సుముఖత చూపినట్లు లేరు. అదే విషయమై పత్రికల వారు ప్రశ్నించగా, ఇక్కడి వారు ఏమని చెప్పినా చివరకు మేనిఫెస్టోలో చేర్చేటపుడు జాతీయ నాయకత్వం ఆమోదం అవసరమవుతుందన్నారు. ఆ సందర్భం లో పిసిసి అధ్యక్షుని హామీల పరిస్థితి ఏమిటో వెంటనే చెప్పగల పరిస్థితి లేదు. కాని ఈ లోపల ఆయన ఇంచుమించు వారానికి ఒకసారి సరికొత్త డబ్బు పంపిణీ హామీలు ప్రకటిస్తున్నారు. వాటిలో కొన్ని ఆసరా పెన్షన్లను రెట్టింపు చేయటం పిల్లలు ఉద్యోగులైనా తల్లిదండ్రులకు పెన్షన్లు ఇవ్వటం, ఒకే కుటుంబంలో ఎందరు అర్హులు ఉంటే వారందరికీ ఇవ్వటం, నిరుద్యోగులలో కనీసం పది లక్షల మందికి కలిపి నెలకు రూ. 300 కోట్ల నిరుద్యోగ భృతి ఇవ్వటం వంటివి ఉన్నాయి. రైతు బంధు ఎకరానికి నాలుగు వేలు చాలవని ఇప్పటికే విమర్శించారు గనుక రాగల రోజులలో ఆ మొత్తాన్ని ఎనిమిది వేలకు పెంచే హామీని, డబుల్ బెడ్ రూం ఇళ్లను నాలుగు బెడ్ రూములకు పెంచుతామన్నా అనగలరు. ప్రజలకు కలిగే నమ్మకం ఏమిటో చూడవలసి ఉంది.

– టంకశాల అశోక్, 9848191767