Home అర్బన్ మ్యూజింగ్స్ దొంగ యెండ…

దొంగ యెండ…

Cartoon-of-Womanయీ రోజు వుదయం యెడతెరిపి లేని వానల తరువాత కనిపించిన లేత యెండని దొంగ యెండ కాదు కదా అనుకొంటూ ఆ బింబానికి అభిముఖంగా నిలబడి తలెత్తి చూస్తుండిపోయా… గుండ్రని తెల్లటి కిరణాల సూరీడుని అదే మొదటి సారి చూస్తున్నట్టు. నిన్న రాత్రి చందమామ కనిపించినప్పుడు నిన్నసలు నమ్మలేం వొట్టి మొహమాటస్తుడివి… యిట్టే మబ్బుల్ని కమ్ముకోనిస్తావ్… దోబూచులు నీకలవాటే… కానీ రోజుల తరబడి ముఖం చాటేస్తారు కదా చందమామవారు… నమ్మలేం… కానీ ఆదిత్యునికి అంత మొహమాటం వుండదు కదా అనిపించేది వొకప్పుడు. కానీ యిప్పుడు అతనికీ యీ శశాంకునికి మొహమాటం మొదలయింది కొన్నాళ్ళుగా… లేత మంచుతో రవికిరణాలు మిలమిలలాడకుండా అందరిని హడలెత్తించే వానలతో మబ్బుచాటుకి వెళ్ళిపోవటం యేంటో… చిక్ చిక్ చిక్ తలతిప్పి చూస్తే నా కళ్ళని నేనే నమ్మలేకపోయా… చిన్ని పిచ్చుక… యెన్నాళ్ళకెన్నాళ్ళకి యీ నగరంలో కనిపించింది. యిలా కనిపించే వాటిల్లో చిన్నప్పుడు నన్ను విపరీతంగా ఆకర్షించే వాటిల్లో యింట్లోకి చాల చొరవగా వచ్చే పిచ్చుకలుండేవి. వేకువలో సముద్రపు అలల హోరును డామినేట్ చేస్తూ కొబ్బరి చెట్లపై నుంచి, ప్రహరీ గోడలపై, బావి చప్టాల మీద నుంచి కాకుల అరుపులు ఆటల్లో పిల్లల తగాదా అరుపుల్లా వినిపించేవి. పిచ్చుకలు వరండాలోనో దక్షిణం వైపు గదిలోనో కిటికీ చువ్వల పై వాలి వాటి చిన్నిమెడని అటూయిటూ తిప్పుతూ యేదో గుర్తు వచ్చినట్టు తుర్రుమనేవి.

అలానే సాలీడు అల్లే గూడుని చూస్తూ వుంటే గది గోడకి పైన వున్న చిన్నివెంటిలేటర్ లోంచి సన్నని సూర్యకిరణాలు ఆ అల్లిక మీద పడి రంగురంగుల యింద్ర ధనస్సులా తళతళలాడుతోంటే ఆ రంగులు యెలా వస్తాయోనని భలే కుతూహలంగా వుండేది. అలానే తోటల్లో, పుంతదారుల్లో తిరిగేటప్పుడు సొగసైన బంగారు పిచ్చుక గూళ్ళు భలే ఆకర్షించేవి. వాటిని అవి యెలా అల్లేవో అనే కుతూహలంతో అక్కడే ఆగి పోయేదాన్ని… మనం చూస్తుండగా అటు రావటం చూడనే లేదు. భలే జాగర్త పరురాలు అనిపించేది. అడివిదారుల్లో నడిచేటప్పుడు ఆ నిశ్శబ్దంలో వడ్రంగిపిట్ట చెట్టు మానులని టిక్ టిక్ మని కొట్టటం వినిపిస్తుంటే ఆ పిట్టని చూడటం కోసం తలెత్తి చెట్టు బెరడు వైపు చూస్తు..పిట్ట కనిపిస్తే చాల ఆశ్చర్యం…! అంత చిన్న ముక్కుతో అంత లావు బెరడుని తోలుస్తుండేది. యెంత ఆత్మవిశ్వాసమో కదా.. అని కాస్త పెద్దయ్యాక అనిపించేది. వొక గోరువంకని చూస్తే జంటని చూడాలని రెండో గోరువంక కోసం చుట్టూ వెతకటం… ఆ రెండో గోరువంక కనిపిస్తే పెద్ద రిలీఫ్. వరి చేల గట్ల మీద పాలపిట్టలూ, గోరువంకలూ ఆ కంకులని ముక్కున కరచి వెళుతుంటే చూడటం చాల సరదాగా వుండేది. తేనె పిట్టలు మందార పూల చెట్ల చుట్టూ గిరికీలు కొడుతూ కిచకిచమంటుంటే వాటి వెంబడే చూపులు గిరికీలు కొట్టేవి.

శ్రావణం వస్తే మృదువైన వానజల్లు చెవుల్లో గిలిగింతలు పెడుతుంటే అవనికి ముఖమల్ చుక్కలు అద్దే ఆరుద్రల వెంట కళ్ళు అతి సోమరిగా కదిలేవి. యింత పెద్ద పాదాలు చిత్తడి చిత్తడి నేలలో దిగిపోతుంటాయి కదా యీ ఆరుద్రల పాదాలు యెలా వుంటాయో చూడాలనిపించేది. యిప్పటికీ వాటి పాదాలని పరీక్షించనే లేదు. వాటి కదలిక చూడటానికే రెండు కళ్ళు సరిపోవటం లేదు. యింక ఆ పాదాల కోసం చూపులని యివ్వలేను అనిపిస్తుంటుంది. సీతాకోక చిలుకలు రంగుల వాహినిలో పసిచూపులు బహు హుషారుగా పరుగులు తీసేవి. యింక సన్నని గజిబిజి బాటలో వెళ్ళుతున్నప్పుడయితే వొకే రంగు సీతాకోకలు చాల బద్దకంగా యేదో వొక పచ్చికపై దారికి వాలి వుండేవి. అడుగేస్తే వాటికి యిబ్బంది కదాని అవి దారి యిచ్చే వరకు ఆగాలని వాటినే చూస్తూ కూర్చునేదాన్ని. యెప్పుడో తీరుబడిగా లేచి రివ్వున యెగిరి కొద్దిగా ముందుకి వెళ్ళి మళ్ళీ దారికి అడ్డంగా వాలేవి. యెంత అందమైన అడ్డంకి ముందుకు సాగటానికి..! అలాంటప్పుడు అక్కడే ఆగిపోయినా మనసుకేం తరుగు..!?

నిత్య జీవితంలో యిలా పక్షులు పిట్టలు భాగమై పోవటం అప్పుడు అదో వింత గాధగా అనిపించలేదు. యీ నగరంలో కాకులు అరుదుగా కనిపించటం చిన్నతనంలోనే గమనించా. కానీ పావురాలుండేవి. పిచ్చుకలుండేవి. మెల్లమెల్లగా పిచ్చుకలు కళ్ళ ముందే అదృశ్యం అయిపోవటం బాగ గుర్తుంది. అవి అలా అవ్వటానికి వొక ప్రధాన కారణం సెల్ టవర్స్ అని చెప్పుకోవటం మనలో చాల మందే వినుంటాం. అలానే మరిన్ని కారణాలు కూడా వుండి వుండొచ్చు. యిప్పుడు నగరంలో కనిపించే బూడిద రంగు పావురాలు గుట్టల వెనుక రాళ్ళలో గూళ్ళు కట్టుకునేవి. యిప్పుడు నగరమంతా అపార్ట్ మెంట్స్ వచ్చాక కిటికీలపై యిలా చాల చోట్ల గూళ్ళు పెట్టు కొంటున్నాయి. యీ అపార్ట్ మెంట్స్ నే రాళ్ళ గుట్టలు అనుకుంటున్నాయేమోనని అప్పుడప్పుడూ చిన్న చిన్న జోక్స్ వేసుకొని నవ్వుకొంటుంటాం. అయితే యీ పావురాలు యెక్కువై పోయి అవి బాల్కనీల్లో కి కూడా వచ్చేస్తుంటే యిప్పుడు అవి రాకుండా బాల్కనీలకి కొన్ని చోట్ల మొత్తం బిల్డింగ్ గోడలకి నెట్స్ వేస్తున్నారు. నగరాన్ని వానలు యింత అతాలాకుతలం చేసిన తరువాత బహు కాలానికి వొక చిట్టి పిచ్చుక కనిపించటంతో మనసున మసకేసిన ముసురుపై లేత యెండేదో వాలినట్టుంది… యెంత చిలిపి దొంగ యెండైనా యెండ యెండే…! సూర్యకిరాణామృతం.

-కుప్పిలి పద్మ, kuppilipadma@gmail.com