Home తాజా వార్తలు టైటాన్స్ ఘన విజయం

టైటాన్స్ ఘన విజయం

Telugu-Titans
చెన్నై: ప్రొ కబడ్డీలో తెలుగు టైటాన్స్ మరో విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 4029 తేడాతో హర్యానా స్టీలర్స్ జట్టును చిత్తు చేసింది. ప్రారంభం నుంచే టైటాన్స్ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. హర్యానాపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు సిద్ధార్థ్ దేశాయ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. జట్టును ఒంటిచేత్తో విజయం అందించాడు. ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శిస్తూ హర్యానాను బెంబేలెత్తించాడు. సిద్ధార్థ్ అసాధారణ ఆటతో ఆకట్టుకున్నాడు. అద్భతు రైడింగ్‌తో ప్రత్యర్థి జట్టును వణికించాడు. అతని దూకుడు ముందు హర్యానా ఆటగాళ్లు ఎదురు నిలువలేక పోయారు. సిద్ధార్థ్ ఏకంగా 18 పాయింట్లతో టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సూరజ్ ఆరు పాయింట్లతో తనవంతు పాత్ర పోషించాడు. మరోవైపు హర్యానా జట్టులో వికాస్ మాత్రమే రాణించాడు. తెలుగు టైటాన్స్‌పై ఎదురుదాడి చేసిన వికాస్ 9 పాయింట్లు సాధించాడు. మిగతావారిలో వినయ్ (4), ప్రశాంత్ (3) మాత్రమే కాస్త రాణించారు. ఇతర ఆటగాళ్లు విఫలం కావడంతో హర్యానాకు ఓటమి తప్పలేదు. ఈ సీజన్‌లో టైటాన్స్‌కు ఇది రెండో విజయం మాత్రమే కావడం గమనార్హం. ప్రారంభంలో వరుస ఓటములతో టైటాన్స్ అభిమానులను నిరాశకు గురి చేసింది. కాగా, హర్యానా 8 మ్యాచుల్లో నాలుగు గెలిచింది. మరోవైపు తమిళ్ తలైవాస్, పుణేరి పల్టన్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ టైగా ముగిసింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు 3131 పాయింట్లతో సమంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ టైగా ముగియక తప్పలేదు.
ప్రారంభం నుంచే రెండు జట్ల ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగింది. ఇదే క్రమంలో మ్యాచ్ తరచూ చేతులు మారుతూ వచ్చింది. రెండు జట్లు క్రీడాకారులు కూడా అద్భుత పోరాట పటిమను కనబరచడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

Telugu Titans Won on Tamil Thalaivas