వణిపోతున్న నగర వాసులు
హైదరాబాద్: నివర్ తుఫాన్ ప్రభావం నగరం మీద కూడా పడటంతో పగటిపూట ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి. దాంతో నగరం నుంచి బయటకు రావాలంటే ప్రజలు వణికి పోతున్నారు. దానికి తోడు నగరంని విద్యానగర్, ఆర్‌టిసి క్రాస్ రోడ్స్ ,కోఠీ, అబిడ్స్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్సార్‌నగర్ తదితర ప్రాంతాల్లో రాత్రి నుంచే ఒక మోస్తరు వర్షం పడటంతో నగరవాసులు ఇబ్బంది పడ్డారు.ముఖ్యంగా హయత్‌నగర్, ఎల్‌బినగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం పడటంతో ఆ ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు ప్రవేశించడంతో ఆ ప్రాంత వాసులు నీటిని ఎత్తి పోస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం తుఫాను ప్రభావంతో నగరంలో భారీవర్షాలు కురిసి జన జీవనం అస్తవ్యస్తంగా మారడంతో ప్రస్తుత నివర్ తుఫాన్ ప్రభావం కూడా అదే స్థాయిలో ఉంటుందనే ఆందోళనను నగర వాసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే నివర్ తుఫాన్ ప్రభావం నగరంపై అంతంగా ఉండదని వాతావరణశాఖ అధికారులు చెప్పడంతో ఉపిరి పీల్చుకుంటున్నారు. అంతే కాకుండా కరోనా వైరస్ చల్లని ప్రాంతాల్లోనే ఎక్కువగా విస్తరించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్పడంతో నగర వాసులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. దీంతో కొంత మంది దైనందిత కార్యాకలాపాలకు స్వస్తి చెప్పి ఇంటి పట్డునే ఉండగా మరి కొందరు కార్యాలయాలకు సెలవు పెడుతున్నారు.
38 మిలియన్ యూనిట్లకు పడిపోయిన విద్యుత్ డిమాండ్
తఫాన్ ప్రభావంతో నగరంలోని ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడంతో విద్యుత్ వాడకం కూడా గణనీయంగా తగ్గిపోయింది. నగరంలో విద్యుత్ డిమాండ్ 38 మిలియన్ యూనిట్లుగా నమోదైందని అధికారులు చెబుతున్నారు. గతంలోనూ ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రాలేదని అధికారులు చెబుతున్నారు. సాధారంగా విద్యుత్ డిమాండ్ 40 నుంచి 42గా నమోదవుతుందని కాని నివర్ తుఫాన్ ప్రభావంతో ఇంత తక్కువ స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదు కావడం మొదటి సారని చెబుతున్నారు.