Home తాజా వార్తలు ఇఎంఐలు కట్టలేం.. వేధింపులు మానండి

ఇఎంఐలు కట్టలేం.. వేధింపులు మానండి

Tension at bajaj finance office due to EMI

 

హైదరాబాద్ సోమాజిగూడలోని బజాజ్ ఫైనాన్స్ కార్యాలయం వద్ద రుణ గ్రహీతల ఆందోళన, మారటోరియం తమకు వర్తించదన్న యాజమాన్యం

మనతెలంగాణ/ సిటిబ్యూరో: ఇఎంఐలు కట్టాలని వేధింపులకు గురిచేస్తున్నారంటూ బాధితులు సోమాజిగూడలోని బజాజ్ ఫైనాన్స్ ఎదుట గురువారం ఆందోళన చేశారు. కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో అన్ని రాష్ట్రా ల్లో కేంద్రం లాక్‌డౌన్ విధించింది. దీంతో రుణాలు తీసుకున్న వారికి పనిలేకుండా పోయింది. ఇఎంఐలు చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు మారటోరియం విధించింది. మూడు నెలల తర్వాత మాత్రమే వాటిని చెల్లించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా రుణాలు ఇచ్చిన సంస్థలు తీసుకున్న వారిని వేధింపులకు గురిచేయవద్దని ఆదేశించింది. అయితే దానికి విరుద్ధంగా బజాజ్ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది వ్యవహరిస్తున్నారు.

కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో చాలామంది రుణగ్రహీతలు ఇఎంఐలను గత రెండు నెలల నుంచి చెల్లించడంలేదు. బజాజ్ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు రుణాలు తీసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి వెంటనే ఇఎంఐలు చెల్లించాలని వేధింపులకు గురిచేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన వెసులుబాటు తమకు వర్తించదని వెంటనే చెల్లించాలని పట్టుబడుతున్నారు. అంతేకాకుండా ఇఎంఐలు చెల్లించకుండా వాయిదా వేస్తే వడ్డీ అధికంగా వేస్తామని హెచ్చరిస్తున్నారు. రోజురోజుకూ వారి వేధింపులు ఎక్కువ కావడంతో బాధితులు సోమాజిగూడలోని సంస్థ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. చేసేందుకు పనిలేదని ఇప్పుడిప్పుడే పనిలోకి వస్తున్నామని ఇప్పట్లో ఇఎంఐలను చెల్లించలేమని స్పష్టం చేశారు.

కిందిస్థాయి సిబ్బందికి టార్గెట్లు…
బజాజ్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న పైస్థాయి ఉద్యోగులు కింద స్థాయిలో పనిచేస్తున్న వారికి టార్గెట్ పెట్టడంతో వేధింపులు పెరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయకపోతే ఉద్యోగం పోతుందనే ఆందోళనతో వారు రుణాలు తీసుకున్న వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. బాధితులను ఈఎంఐలు కట్టాలని వేధిస్తున్నారు.