Home అంతర్జాతీయ వార్తలు ఉగ్రహింసతో లక్ష కోట్ల డాలర్ల నష్టం

ఉగ్రహింసతో లక్ష కోట్ల డాలర్ల నష్టం

Narendra Mod

 

రెండున్నర లక్షలకు పైగా బలి
సమాజ జీవనాలకు విఘాతం
బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ

బ్రెసిలియా : పేట్రేగిన ఉగ్రవాద చర్యలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక్క లక్ష కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఉగ్రవాద హింసాకాండతో దెబ్బతిన్న వాణిజ్యంతో ఆర్థికవ్యవస్థ గాడీ తప్పిందన్నారు. ఇక్కడ జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో గురువారం ప్రధాని మోడీ ప్రసంగించారు. ఉగ్రవాద చర్యలతో భయానక వాతావరణం ఏర్పడిందని, ఫలితంగా వాణిజ్య, వ్యాపార రంగాలపై తీవ్ర ప్రభావం పడిందని, ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు ఉగ్రవాదమే కారణమని తెలిపారు. బ్రిక్స్ బృందంలో వివిధ అంశాలకు సంబంధించి ఇంతకు ముందటితో పోలిస్తే విస్తృత సహకారం ఉందని, ఇది స్వాగతించాల్సిన విషయం అని చెప్పారు.

ఇక్కడి ప్రతీకాత్మక ఇటామెరాటీ ప్యాలెస్ వేదికగా జరిగిన 11వ బ్రిక్స్ ప్లీనరీ సదస్సుకు బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాధినేతలు హాజరయ్యారు. వారి సమక్షంలో చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ ప్రత్యేకించి ఉగ్రవాద సమస్యను ప్రస్తావించారు. శాంతి, సౌభాగ్యం, ప్రగతి వంటి కీలక పరిణామాలకు ఉగ్రవాదం పెనుసవాలుగా మారిందని మోడీ ఈ నేతల సమక్షంలో ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని విశ్లేషలు, అంచనాలతో తనకు తెలిసిన సమాచారం మేరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిందని, ఇది కోలుకోలేని దెబ్బ అని తెలిపారు. ఆర్థిక ప్రగతి ఒక్కటిన్నర శాతం దెబ్బతిందని ఇది ప్రజలకు అనేక కడగండ్లను తీసుకువస్తోందని తెలిపారు.

పది సంవత్సరాల వ్యవధిలో ఉగ్రవాద చర్యలతో ప్రపంచవ్యాప్తంగా రెండులక్షల పాతికవేల మంది బలి అయ్యారు. సమాజాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఉగ్రవాదంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. ఉగ్రవాద నిధులు, మాదకద్రవ్యాల రవాణా, వ్యవస్థీకృత నేరాలతో వాణిజ్యం దెబ్బతిందని, ఈ దశలో ఉగ్రవాద చర్యల ఆటకట్టు దిశలో వ్యూహాలపై ఏర్పాటయిన తొలి సెమినార్ విజయం సాధించిందని, ఇది అందరికీ సంతోషం కల్గించే విషయమని చెప్పారు. ఉగ్రవాదంతో ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో నీలినీడలు పర్చుకున్నాయి. వీటిని పటాపంచలు చేసేందుకు బ్రిక్స్ సదవకాశంగా మారుతుందని భావిస్తున్నట్లు మోడీ తెలిపారు. బ్రిక్స్ దేశాలు భద్రతా కోణంలో మరింత సమన్వయంతో పటిష్టంగా వ్యవహరిస్తే ఉగ్రవాదం నిర్మూలనకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. బ్రిక్స్‌కు సంబంధించిన ఐదు వర్కింగ్ గ్రూప్‌లు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

వివిధ ప్రాంతాలలో సమర్థవంతమైన నీటి నిర్వహణ, పట్టణాల్లో సమగ్ర పారిశుద్ధ చర్యలు కీలకమైన అంశాలని, బ్రిక్స్ కార్యనిర్వాహక బృందాలు వివిధ అంశాలపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రుల తొలి భేటీని భారతదేశంలో నిర్వహించాలని తాను ప్రతిపాదిస్తున్నట్లు ఈ సందర్భంగా మోడీ చెప్పారు. ఇటీవలే భారతదేశంలో ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టామని, మనిషి శారీరక ధారుఢ్యానికి పరిసర వాతావరణానికి సంబంధం ఉంటుందని , ఫిట్‌నెస్, ఆరోగ్యం వంటి విషయాలలో సభ్యదేశాల మధ్య మరింతగా సమాచార వినిమయం అవసరం అని ప్రధాని పిలుపు నిచ్చారు. బ్రిక్స్ అంతర్గత వ్యాపారం విలువ ప్రపంచ వ్యాపారంలో 15 శాతంగానే ఉంటుందని, అయితే ఈ దేశాల జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో 40 శాతంగా ఉంటుందని, ఈ విధంగా వ్యాపార వాణిజ్యాలలో బ్రిక్స్ ఏ స్థాయిలో ఉందనేది వెల్లడవుతోందని ప్రధాని తెలిపారు. 11వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా గురువారం నేతల సంప్రదింపులు ఆరంభం అయ్యాయి. వ్యాపార వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిరోధక చర్యలు వంటి కీలక రంగాలపై దృష్టి సారించారు.

ప్రపంచ సగం జనాభా సంపత్తి వేదిక
ప్రస్తుత బ్రిక్స్ సదస్సు ప్రారంభానికి ముందు బ్రెజిల్ అధ్యక్షులు జాయిర్ బోల్సోనారో, ప్రధాని మోడీ, చైనా అధ్యక్షులు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షులు పుతిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రామాఫోసాలు కలిసి గ్రూప్ ఫోటోలకు ఫోజులిచ్చారు.ప్రపంచ జనాభాతో పోలిస్తే బ్రిక్స్ దేశాల ప్రజల సంఖ్య సగభాగంగా ఉంటుంది. బ్రిక్స్ ఉమ్మడి జిడిపి 16.5 ట్రిలియన్ డాలర్లు.

Terrorism caused $1 trillion lost to world economy