Home ఎడిటోరియల్ ఘాతుక మారణకాండ

ఘాతుక మారణకాండ

Terrorist attacks      న్యూజిలాండ్ కాల్పుల ఘాతుకాన్ని ఖండించడానికి మాటలు చాలవు. ఇస్లాం మతస్థులు ప్రార్థనలు జరుపుకుంటున్న సమయంలో క్రైస్ట్ చర్చి నగరంలోని రెండు మసీదుల్లో దుండగులు జరిపిన కాల్పుల బీభత్సంలో 49 మంది అమాయకులు బలికావడం ప్రపంచంలో రోజురోజుకీ విస్తరిస్తున్న విద్వేషాగ్నిని రుజువు చేస్తున్నది. ఇటీవల మన జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 40 మందికిపైగా సిఆర్‌పిఎఫ్ జవాన్లను హతమార్చిన ఆత్మాహుతి ఉగ్రదాడి దారుణ ఘటన మరపున పడకముందే సంభవించిన ఈ ఊచకోత హత్యాకాండ అందరినీ కలచివేయడం సహజం. ప్రపంచంలోని అతి ప్రశాంత దేశాల్లో ఒకటిగా పేరొందిన న్యూజిలాండ్‌లో సంభవించిన ఈ రక్తపాతం భిన్న వర్గాల ప్రజల మధ్య పెరిగిపోతున్న శత్రుత్వాన్ని చాటుతున్నది. వలసలపట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్న దుండగులే ఇందుకు పాల్పడినట్లు చెబుతున్నారు. పట్టుబడిన ఒక ముష్కరుడు ఆస్ట్రేలియాకు చెందినవాడని ఆ దేశ ప్రధాని స్వయంగా ప్రకటించారు.

కాల్పులను తీవ్రంగా ఖండించిన న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ బాధితులందరూ వలస ప్రజలు, శరణార్థులేనని అన్నారు. వారంతా తమ దేశంలో నివాసముంటున్నవారేనని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా గతంలో జరిగిన పలు దుర్ఘటనలు మాదిరిగానే ఇది కూడా మానవాళిని మరింతగా విభజించి పరస్పరం ద్వేషించుకునేలా చేస్తుంది. ప్రపంచం మరింతగా చీలిపోయి పగ, ద్వేషాలతో రగిలిపోయేందుకు దోహదపడుతుంది. విశ్వమానవ సమాజం అనే భావనను బలితీసుకుంటుంది. ముస్లింలపట్ల ద్వేషంతోనే ఈ దాడి జరిగిందని, 2001 సెప్టెంబర్ 11 నాటి అమెరికాలోని జంట ప్రాసాదాలపై దాడుల తర్వాత ప్రపంచంలో గల ముస్లింలందరినీ నిందించడం, దూరంగా ఉంచడం జరుగుతున్నదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తదితరులు చేసిన వ్యాఖ్యల్లో ఎంత ఆవేదన దాగి ఉన్నదో గమనించవచ్చు.

ఇది భవిష్యత్తులో మరెన్ని అకృత్యాలకు దారితీస్తుందోననే భయం కలగడం సహజం. ఉగ్రవాదానికి మతం, కులం ఉండవు. విద్వేష భావానలంతో అమాయకులను బలి తీసుకునేవారిని మనుషులని కూడా అనలేము. అయితే ప్రపంచ దేశాల మధ్య, ప్రజల మధ్య సమానత్వం కొరవడుతున్న కొద్దీ, అంతర్జాతీయ వ్యవస్థల్లో బలవంతులదే రాజ్యంగా ఉండే దుస్థితి పెరుగుతున్న కొద్దీ ఇటువంటి శక్తులు పుట్టుకొస్తుంటాయి. వాటికి అన్నెంపున్నెం ఎరుగనివారు ఆహుతి అయిపోతుంటారు.

ఈ మారణ కాండకు తెర పడాలంటే ప్రపంచ సమాజంలో సమానత్వ భావన వేళ్లూనుకోవాలి. బలవంతుల తీరులో సమూలమైన మార్పు రావాలి. ఇతర దేశాలను కొల్లగొట్టి బాగుపడాలనే దుర్బుద్ధి తొలగాలి. ఇటువంటి మంచి వాతావరణం కోసం చిత్తశుద్ధితో కృషి చేయవలసిన బాధ్యత దేశదేశాల నేతలందరిపైన ఉన్నది. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలు నిష్క్రియాపరత్వంగా, నామమాత్రంగా కొనసాగడం, ఏ న్యాయానికి తలొగ్గకుండా తాను చేసిందే సబబని భావించే అమెరికా వంటి దేశాల ఏకపక్ష నిరంకుశ వైఖరులు అంతం కావాలి. చరిత్రలో వెనుకకు వెళ్లి చూస్తే ఇరాక్ పై అమెరికా, దాని మిత్రదేశాల సంయుక్త దాడులు, సద్దాం హుస్సేన్ అంతు చూడడం, లిబియాలో గడాఫీని హతమార్చడం, అంతకు ముందు నుంచి పాలస్తీనీయులను నిర్వాసితులను చేసి ఆ భూభాగాన్ని దురాక్రమించుకోడం, ఇజ్రాయెల్ దురహంకారాన్ని పెంచి పోషించడం, అది అణ్వస్త్ర దేశంగా తయారైనా దానిపట్ల ఉదాసీనత వహించి దానిని భుజానికెత్తుకోడం, అలాగే పెట్రోలు నిక్షేపాల మీద కన్ను వేసి అరబ్ దాయాదుల మధ్య చిచ్చు పెట్టి, ఆయుధ వ్యాపారాన్ని పెంచుకోడం వంటి అమెరికా విధానాలు ప్రపంచంలో జాతి విద్వేషాలు, మత వైషమ్యాలు పెచ్చరిల్లడానికి దారి తీశాయనేది స్పష్టపడుతుంది.

ఆంక్షల అస్త్రాలు ప్రయోగించి అయినవారి పట్ల మెతకగాను, కానివారిపట్ల కఠినంగాను వ్యవహరించే దాని పద్ధతులు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఇవన్నీ పోయినప్పుడుగాని మానవాళికి మంచి రోజులు రావు. న్యూజిలాండ్ జనాభా 47 లక్షల పైచిలుకు అయితే అందులో ముస్లింలు 50 వేలు. వీరిలో ఎక్కువ మంది 1990లలో ఇరాక్, అఫ్ఘానిస్థాన్ యుద్ధాల కారణంగా వలస వెళ్లిన వారే. అందుచేత వలసల పట్ల వ్యతిరేకతతో కాకుండా జాతి విద్వేషం, మత వైషమ్యంతోనే జంట మసీదులపై ఈ దాడులు జరిగినట్టు బోధపడుతున్నది. తరచూ నిరాఘాటంగా సాగిపోతున్న ఇటువంటి మారణకాండలకు అసమ న్యాయ అంతర్జాతీయ అమెరికా విధానాలే కారణమని భావించి ఆవేదన చెందడం కంటే ఎవరూ చేయగలిగేదేమీ లేదని అనిపిస్తే ఆక్షేపించనవసరం లేదు.

Terrorist attacks on two mosques in New Zealand