Home జాతీయ వార్తలు ఉగ్రవేట

ఉగ్రవేట

ind

జమ్ము సుంజువాన్ సైనిక శిబిరంపై టెర్రరిస్టుల దాడి
ఐదుగురు సైనికులు, ఒక పౌరుడు మృతి
ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
ముగ్గురూ జైషే మహమ్మద్ వర్గం వారే, కొనసాగుతున్న గాలింపు

జమ్ము : జమ్ములోని సుంజ్‌వాన్ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఐదుగురు సైనికులు, ఓ పౌరుడు మృతి చెందారు. సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శిబిరంలోకి చొరబడిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నట్టు సైన్యం ప్రకటించింది. పోలీసులు, సైన్యం క్వార్టర్స్‌ను ఆధీనంలోకి తీసుకున్నాయి. ము గ్గురు ఉగ్రవాదులను సైనికులు చుట్టుముట్టారు. కాగా, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జెసిఒ) సహా ముగ్గురు సైనికుల మృతదేహాలను గుర్తించినట్టు లెఫ్ట్‌నెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. ‘శనివారం ఉదయం వారు ముగ్గురు ఉగ్రవాదుల చేతిలో మృతి చెందారు’ అని ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపా రు. ఓ పౌరుడు, జవాన్ తండ్రి మృతదేహాలు కూడా లభ్యమయ్యాయని ఆయన చెప్పారు. ఈ దాడిలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పాయారన్నారు. అయితే, ప్రతిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు జైషే ఇ మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారని, అందులో ఓ ఉగ్రవాది భారీ ఆయుధాలు కలిగివున్నాడని, మిగతా ఇద్దరు ఎకె56, గ్రనేడ్లు ధరించివున్నారని ఆయన తెలిపారు. చనిపోయిన సైనికులం తా జమ్మూకశ్మీర్‌కు చెందిన వారే. కాగా, రెండు రోజులుగా జరుగుతున్న ఈ కాల్పుల్లో ఆరుగురు మహిళలు, ఓ చిన్నారి సహా 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన 14 ఏళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం జైషే ఇ మహ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఆఫీసర్ల క్వార్టర్స్‌లోకి ప్రవేశించేందుకు యత్నించగా సత్వర స్పందన బృందం వెంటనే ప్రతిఘటించింది. ఇక్కడవున్న 150 ఇళ్ల నుంచి నివాసితులను సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
గాయాలతో ప్రసవించిన గర్భిణీ
ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ గర్భిణీ ఆసుపత్రిలో చిన్నారికి జన్మనిచ్చింది. రైఫిల్ మ్యాన్ నజీర్ అహ్మద్, ఆయన భార్య శనివారం జరిగిన ఈ దాడిలో గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని సత్వారీ మిలటరీ హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ ఆమె ప్రసవించినట్టు అధికారులు తెలిపారు. ‘తీవ్రంగా గాయపడిన గర్భిణీ ప్రాణాన్ని కాపాడేందుకు ఆర్మీ వైద్యులు రాత్రంతా కష్టపడ్డారు. సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు’ అని లెఫ్ట్‌నెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం తల్లీబిడ్డల ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.
పోలీసులు, మిలటరీ దళాలకు ఆహారం అందిస్తున్న పౌరులు
ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఆపరేషన్‌ను కొనసాగిస్తున్న పోలీసులు, పారా మిలటరీ దళాలకు ఇక్కడి పౌరులు భోజనం, ఆహార పదార్థాలను అందిస్తున్నారు. సైనిక శిబిరం బయట ప్రధాన ద్వారం వద్ద శనివారం రాత్రి నుంచి పోలీసులు, పారా మిలటరీ దళాలకు ఇక్కడి వారు భోజనాలు, టీ, స్నాక్స్, మంచినీరు తదితరాలను పంపిణీ చేస్తూ సహకారాన్ని అందిస్తున్నారు. ‘మా తరపు నుంచి మేం అందిస్తున్నది చాలా స్వల్పం. జాతిసేవలో మేమూ భాగస్వాములం కావాలనుకున్నాం. అందుకే పోలీసులు, పారా మిలటరీ దళాలకు ఆహార పదార్థాలు అందిస్తున్నాం’ అని స్థానిక పౌరుడు సంజీవ్ మన్‌మోత్రా తెలిపారు. ఈ చర్య ద్వారా కశ్మీర్‌లో తప్పుదోవ పట్టిన యువతకు మంచి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నామని అన్నారు.