Home తాజా వార్తలు టెస్లా వచ్చేసింది..

టెస్లా వచ్చేసింది..

Tesla sets up company in Bengaluru

 

బెంగళూరులో కంపెనీ పేరు రిజిస్టర్
కనీస ధర రూ.60 లక్షలు

ముంబై : ఎట్టకేలకు అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌గా ఆర్‌ఒసి (రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్) వద్ద కంపెనీ రిజిస్టర్ చేసుకుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆర్‌ఒసి ప్రకారం, బెంగళూరులో పేరు రిజిస్టర్ చేసుకున్న ఈ కంపెనీలో ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు. టెస్లా అనుబంధ సంస్థగా భారతీయ మార్కెట్లోకి వచ్చిన ఈ కంపెనీ డైరెక్టర్లుగా వైభవ్ తనేజా, వెంకట్రంగమ్ శ్రీరామ్, డేవిడ్ జాన్ ఫీన్‌స్టీన్‌లు నియమితులయ్యారు. టెస్లా చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్‌గా తనేజాను నియమించారు. నివేదిక ప్రకారం, కంపెనీ రూ.1.5 కోట్ల మూలధనంతో రిజిస్టర్ చేసుకుంది. టెస్లాకు కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప స్వాగతం పలికారు.

అయితే తయారీ కేంద్రం, ఆర్ అండ్ డి సెంటర్లను ఏర్పాటు చేసేందుకు గాను మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు వంటి ఐదు రాష్ట్ర ప్రభుత్వాలతో టెస్లా చర్చలు జరిపినట్టు మీడియా వర్గాలు తెలిపాయి. అదే సమయంలో గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థను నియమించుకుంది. టెస్లాను ఆహ్వానించేందుకు కర్నాటక ఆసక్తి చూపుతోందని, ఇప్పటికే వివిధ సెగ్మెంట్లలో కంపెనీ లొకేషన్ ఆప్షన్లను ఇచ్చినట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద సంపన్నుడు ఎలోన్ మస్క్ స్థాపించిన టెస్లా దేశంలో తొలిసారిగా పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ మోడల్ 3 సెడాన్‌ను ఏర్పాటు చేయనుంది, ఇది సుమారు రూ.60 లక్షలు ఉంటుంది.

2021లో ప్రారంభంలో భారత్‌లోకి టెస్లా ప్రవేశిస్తుందని డిసెంబర్‌లోనే కేంద్ర రోడ్డు రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. భారతదేశం ముడి చమురు దిగుమతి బడ్జెట్‌ను సుమారు రూ.8 లక్షల కోట్లు తగ్గించడానికి గ్రీన్ ఫ్యూయల్, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడం గురించి నితిన్ గడ్కరీ ఎప్పుడూ చెబుతుంటారు. ప్రతి పెట్రోల్ పంపు వద్ద ఎలక్ట్రిక్ చార్జింగ్ కియోస్క్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నివేదికల ప్రకారం, టెస్లా తన కారు ’మోడల్ 3’ను మాత్రమే భారత మార్కెట్లో విడుదల చేయనుంది. దీని లోపల 60 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. వాహనం టాప్ స్పీడ్ 162 ఎంపిహెచ్. దీని ధర సుమారు 60 లక్షల రూపాయలు ఉంటుంది.

Tesla sets up company in Bengaluru