Home తాజా వార్తలు డాక్టర్లు, నర్సులకు కృతజ్ఞతలు: నటి తమన్నా

డాక్టర్లు, నర్సులకు కృతజ్ఞతలు: నటి తమన్నా

Thanks to Doctors and Nurses: Actress Tamanna

 

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇటీవల కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న ప్రముఖ సినీనటి తమన్నా బాటియా తనకు వైద్యం అందించిన డాక్టర్లు, నర్సులకు కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం తాను పూర్తిగా రికవరీ అయ్యానని, తనకు కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించారని పేర్కొన్నారు. అంతేగాక అక్కడి సిబ్బంది కూడా తనను ఎంతో బాగా చూసుకున్నారని ఆమె వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు తాను వ్యాయమాలు కూడా చేస్తున్నానని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యసిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. ప్రతి రోజు తన ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు సూచనలు సలహాలు ఇచ్చారని, వాటిని పాటించడం వలనే తాను కరోనాను సులువుగా జయించగలిగానని ఆమె స్పష్టం చేశారు.

ఈసందర్బంగా కాంటినెంటల్ సిఈఓ డా రాహుల్ మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్‌తో తమ ఆసుపత్రిలో చేరిన తమన్నాకు మెరుగైన వైద్యం అందించామన్నారు. కాంటినెంటల్‌లో నైపుణ్యమైన డాక్టర్లు, నర్సులు, ఇతర సహాయ సిబ్బందిలతో వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. తామంతా ఒక టీంలా ఏర్పడి అన్ని విభాగాల సిబ్బందితో సమన్వయమై పేషెంట్లకు ఇబ్బందులకు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఒక సారి తమ ఆసుపత్రిని సందర్శించిన రోగులు తమకు రెగ్యులర్ పేషెంట్లుగా మారుతారని ఆయన అభిప్రాయపడ్దారు. ఇదిలా ఉండగా ఇటీవల ఓ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆమె సెట్లోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ తేలగా, కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నారు.