Home సినిమా అలా నటించడం తప్పు కాదు

అలా నటించడం తప్పు కాదు

smt

‘పెళ్లయిన తర్వాత నాలో ఎలాంటి మార్పు రాలేదు. అంతా ఎప్పటిలాగే ఉంది”అని అంటోంది సమంత. గత ఏడాది నాగచైతన్యను వివాహమాడిన ఈ అందాల తార ప్రస్తుతం తెలుగు, తమిళ్‌లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. “కథకు గ్లామర్ అవసరమైతే అలా నటించడం తప్పు కాదని నా అభిప్రాయం. అయితే అనవసరంగా గ్లామర్ గుప్పించడం నాకిష్టం ఉండదు. చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే కెరీర్ ముగిసిపోతుందని భయపడతారు. కానీ పెళ్లయిన తర్వాత కూడా హీరోయిన్‌గా సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను. ఇక ‘సంసార జీవితం ఎలా సాగుతోంది’ అని చాలా మంది అడుగుతున్నారు. భార్యభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని జీవిస్తే నటనా రంగంలో కొనసాగడం కష్టం కాదు. వివాహానంతరం నా భర్త నాగచైతన్య, ఆయన కుటుంబ సభ్యులు కానీ నన్ను నటించవద్దని చెప్పలేదు. హీరోయిన్‌గా కొనసాగడాన్ని నేను ఎంతో ఇష్టపడతాను. ఇక నాగచైతన్యకు మీకూ మధ్య గొడవలు వస్తుంటాయా అని కొందరు అడుగుతుంటారు. మా మధ్య గొడవలు వస్తుంటాయి. గొడవ తర్వాత చైతూ దిగిరారు. నేనే మాట్లాడుతాను. నిజం చెప్పాలంటే… చైతూ గొడవ పడరు. నేనే గొడవ చేస్తా”అని సమంత పేర్కొంది. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ కాస్త తీరిక దొరికిందని… సమయాన్ని వృథా చేసుకోకుండా ఆస్వాదిస్తున్నానని బికినీ వేసుకున్న ఓ ఫొటోతో సోషల్‌మీడియాలో దర్శనమిచ్చింది. తమిళనాడులోని తెన్‌కాశీలో బికినీ వేసుకొని సేదతీరుతున్న ఫొటోనే పోస్ట్ చేసింది. అయితే ఈ బికినీ ఫొటోపై నెటిజన్లు మండిపడ్డారు. పెళ్లయిన తర్వాత ఇలాంటి ఫొటోలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. బాలీవుడ్ నటిలా ప్రవర్తించకు… నీకు పెళ్లయిందని కొందరు నెటిజన్లు గుర్తుచేశారు. దీనికి సమంత దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. “నా రూల్స్ నేను రాసుకుంటా… మీరు నా నియమాలు రాయడం కాదు… మీ రూల్స్ రాసుకోండి”అని పేర్కొంది.