Home ఎడిటోరియల్ సంపాదకీయం : టెర్రర్‌పై బ్రిక్స్ ప్రకటన

సంపాదకీయం : టెర్రర్‌పై బ్రిక్స్ ప్రకటన

Sampadakeeyam-Logo

సాధారణంగా వాణిజ్యం, పెట్టుబడులు, పరస్పర సహకారాభివృద్ధి అంశాలకు పరిమితమయ్యే బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) శిఖరాగ్రసభల డిక్లరేషన్ తొలిసారి అసాధారణంగా టెర్రరిజాన్ని ఖండించటమే గాక, అట్టి సంస్థల పేర్లను పొందుపరిచింది. పాకిస్థాన్ భూభాగం నుంచి ఐఎస్‌ఐ అండతో పనిచేస్తూ, భారత్‌లో టెర్రరిస్టు చర్యలకు పాల్పడుతున్న జైష్‌ఎమహమ్మద్(జైష్), లస్కర్‌ఎ
తోయిబా (లెట్)ఉండటం విశేషం. జైష్ అధినాయకుడు మసూద్ అజార్‌ను టెర్రరిస్టుగా అధికారికంగా ప్రకటించటానికి ఐరాస భద్రతామండలి చేసిన ప్రయత్నాలను చైనా తన వీటోతో అడ్డుకున్న నేపథ్యంలో, ఈ డిక్లరేషన్‌కు ప్రాధాన్యత ఉంది. టెర్రరిస్టు సంస్థలకు ఆశ్రయమివ్వటానికి ముగింపు పలకాలని ఇది పాకిస్థాన్‌కు పరోక్ష హెచ్చరిక. డిక్లరేషన్ అనేది అభీష్ట ప్రకటన. సభ్యదేశాలు దాన్ని ఎలా ఆచరణలో పెడతాయి, తమ గాఢ మిత్రమైన పాకిస్థాన్ విషయంలో చైనా ఎలా వ్యవహరిస్తుందనేది వేచి చూడాల్సిన అంశాలు. ఆగ్నేయ చైనాలో రేవుపట్టణమైన క్సియామెన్‌లో జరిగిన బ్రిక్స్ 9వ అగ్రనాయక సమావేశం తొలిసారి టెర్రర్ సంస్థలన్నిటినీ ఒకేరీతిగా చూడాలని ప్రకటించింది. గోవాలో జరిగిన 8వ అగ్రనాయక సమావేశంలో టెర్రరిజాన్ని ప్రస్తావనకు తేవటాన్ని చైనా వ్యతిరేకించింది. క్సియామిన్ సమావేశానికి వారం రోజులముందు, టెర్రర్ సమస్యలకు బ్రిక్స్ సరైన వేదిక కాదని, అందువల్ల పాకిస్థాన్ స్థావరంగా జరిగే టెర్రర్ కార్యకలాపాలను లేవనెత్తవద్దని చైనా, భారత్‌కు సూచించింది. ప్రతి అంతర్జాతీయ సమావేశంలోనూ టెర్రరిజం సమస్యను లేవనెత్తి ఉమ్మడి కార్యాచరణను కోరే భారత ప్రధాని నరేంద్రమోడీ, క్సియామెన్ ప్రసంగంలో టెర్రర్ ప్రస్తావన చేయకపోవటం గమనార్హం. చైనాకు అరమరికలున్నా, మిగతా నాలుగు దేశాల ఏకీభావం వల్లనే అది డిక్లరేషన్‌లో చోటు చేసుకుంది.
43 పేజీల బ్రిక్స్ క్సియామెన్ డిక్లరేషన్ టెర్రర్‌కు ఐదు పేరాలు కేటాయించింది. ఆప్ఘనిస్థాన్‌లో పరిస్థితిపట్ల ఆందోళన వ్యక్తం చేసిన అనంతరం, టెర్రరిస్టు సంస్థల పేర్లు పొందుపరిచింది. అవి తాలిబన్, ఐఎస్‌ఐఎల్/దయేష్, అల్‌ఖైదా, దాని అనుబంధ సంస్థలైన తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ (ఇది చైనాలోని క్సిన్‌జియాంగ్ రాష్ట్రంలో చురుకుగా ఉంది), ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఉజ్బెకిస్థాన్, హిజ్స్ ఉత్‌తహ్రీర్, హక్కానీ నెట్‌వర్క్, లస్కర్‌ఎతోయిబా, జైషేఎమహమ్మద్, టిటిపి (తెహ్రీక్‌ఎతాలిబాన్, పాకిస్థాన్). వీటిలో చివరి నాలుగు పాకిస్థాన్‌నుంచి పనిచేస్తున్నాయి.
చైనా వైఖరిలో స్పష్టమైన మార్పును డిక్లరేషన్ సూచిస్తున్నదని చైనా వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. లెట్, జైష్‌లపై చర్యలు తీసుకోవాల్సిందిగా చైనా పాకిస్థాన్‌ను కోరే అవకాశముందని భావిస్తున్నారు. ఇటీవల ఇద్దరు చైనా జాతీయులను హత్యచేసిన మరింత ప్రమాదకర టెర్రర్ గ్రూపులు పాకిస్థాన్‌లో ఉన్నాయని, వాటిని కూడా జాబితాలో చేర్చాలంటున్నారు. చైనా విదేశాంగ శాఖ ప్రకటన ప్రకారం, బ్రిక్స్ డిక్లరేషన్ పేర్లు ప్రస్తావించిన సంస్థలు “స్వభావరీత్యా హింసాత్మకమైనవి”, “యుఎన్ భద్రతా మండలి ఖండనకు గురైనవి”. అంతేగాక, ఆప్ఘన్‌లో భారీ పెట్టుబడులు పెట్టిన చైనా, హక్కానీ నెట్‌వర్క్(తాలిబాన్‌కు మరో రూపం) ఆగడాలను సహించలేక పోతున్నది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల, టెర్రరిస్టు సంస్థలకు పాకిస్థాన్ ఆశ్రయమివ్వటాన్ని ఖండిస్తూ, ఇలా అయితే పాకిస్థాన్‌తో తమ ‘టెర్రర్ వ్యతిరేక సహకారం’ కొనసాగించటం కష్టమని హెచ్చరించటం గుర్తు చేసుకోదగింది. అమెరికా, చైనా, భారత్ ఒత్తిడి చేస్తే పాకిస్థాన్ ఇరకాటంలో పడక తప్పదు. ఆప్ఘనిస్థాన్ లో సుస్థిరత నెలకొల్పటంలో మూడు దేశాలకు ఆసక్తి, ప్రయోజనాలు ఉన్నాయి. టెర్రరిజాన్ని అంతం చేయకుండా అవి నెరవేరవు.