Saturday, April 20, 2024

భారత్ బంద్ ప్రశాంతం

- Advertisement -
- Advertisement -

 

బిజేపియేతర రాష్ట్రాల్లో సంపూర్ణ బంద్
ఢిల్లీలో బంద్ ప్రభావం పాక్షికం
పలు రాష్ట్రాల్లో ప్రతిపక్షాల భారీ ర్యాలీలు
అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన ‘ భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. సామాన్యులకు ఇబ్బంది తలెత్తకుండా ఉండడం కోసం నాలుగు గంటలే బంద్ పాటించారు. బంద్ కారణంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సాధారణ జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత వాహనాల రాకపోకలు, షాపులు తెరుచుకోవడం మొదలు కావడంతో రోడ్లపై జన సంచారం మామూలుగా కనిపించింది. బంద్ కారణంగా చాలా రైళ్లను రద్దుచేశారు. వివిధ రాష్ట్రాల్లో జాతీయ రహదారులపై ప్రతిపక్షాలకు చెందిన నేతలు భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా గత 11 రోజులుగా ఢిల్లీ మర్యానా సరిహద్దుల్లోని టిక్రీ. సింఘు వద్ద రోడ్లపై బైఠాయించి ఆందోళన చేస్తున్న రైతులు మంగళవారం కూడా తమ ఆందోనను కొనసాగించారు.

మరో వైపు ఢిల్లీ యుసి సరిహద్దుల్లోని ఘాజీ పూర్ వద్దకు చేరుకున్న యుపి రైతులు అక్కడే నాలుగు గంటల పాటు ‘చక్కాజామ్’( రహదారుల దిగ్బంధం) ఆందోళనను కొనసాగించారు. పంజాబ్ రైతులు మొహాలీలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి చండీగఢ్ హైవేను దిగ్బంధం చేశారు. రైతులకు మద్దదతుగా పంజాబ్‌లో 50 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం మూకుమ్మడి సెలవు పెట్టారు. దేశ వాణిజ్య రాజధాని ముంబయితో పాటుగా మహారాష్ట్రలోని ప్రధాన నగరాలైన పుణె, నాసిక్, నాగపూర్‌లలో హోల్‌సేల్ మార్కెట్లు మూతపడ్డాయి. చాలా పట్టణాల్లో చిల్లర దుకాణాలు కూడా మూతపడ్డాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌లో ప్రధాన నగరాల్లో వ్యాపారసంస్థలు మూతపడ్డంతో పాటు ఆర్‌టిసి బస్సులు కూడా నడవకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రతిపక్షాలకు చెందిన కార్మిక సంఘాల కార్మికులు కూడా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు.

బంద్ దృష్టా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అనేక ప్రాంతాల్లో ప్రదర్శకులు ప్రభుత్వానికి, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లోని అన్ని ఎంట్రీ పాయింట్ల వద్దకు మంగళవారం కొత్తగా అనేక మంది రైతులు వచ్చి చేరడంతో అక్కడ రైతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో అందోళనకారులు రైళ్ల పట్టాలపై బైఠాయించి నిరసన తెలియజేయడంతో చాలా రైళ్ల రాకపోకలు ఆలస్యమైనాయి. ముందు జాగ్రత చర్యగా ప్రభుత్వం పలు రైళ్లను రద్దు చేసింది.25 రాష్ట్రాల్లో 10,000 ప్రాంతాల్లో బంద్ పాటించారని స్వరాజ్ ఇండియా నాయకుడు యోగేంద్ర యాదవ్ చెప్పారు.

కేజ్రివాల్ ఇంటి వద్ద హైడ్రామా

చాలా ప్రాంతాల్లో భారత్ బంద్ ప్రశాంతంగా జరిగినప్పటికీ అక్కడక్కడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల మధ్యఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలో బంద్ ప్రశాంతంగానే జరిగినప్పటికీ, ముఖ్యమంత్రి కేజ్రివాల్ సోమవారం సింఘు సరిహద్దును సందర్శించి తిరిగి వచ్చినప్పటినుంచి పోలీసులు ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించడంతో కొంత ఉద్రిక్తత తలెత్తింది. హోం ంత్రి ఆదేశాలతో పోలీసులు కేజ్రివాల్ నివాసాన్ని అన్ని వైపులనుంచి బారికేడ్లతో దిగ్బంధం చేశారని, ఎవరినీ ఇంటిలోపలికి వెళ్లనీయడం లేదని ఆప్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవని తోసిపుచ్చారు.

ముఖ్యమంత్రి నివాసం వద్ద పోలీసు బలగాలను నియమించడం నిజమేనని వారు తెలిపారు. అయితే కేజ్రివాల్ సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బైటికి వెళ్లి పది గంటల ప్రాంతంలో తిరిగి వచ్చారని, ఆయన తిరిగి వచ్చిన కొద్ది సేపటికి ఆప్ కార్యకర్తలు అక్కడ ఏర్పాటు చేపిన బారికేడ్లను తొలగించడానికి ప్రయత్నించారని వారు చెప్పారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో చాలా మార్కెట్లను తెరిచే ఉంచారు. కొన్ని తప్ప యాప్ ఆధారంగా నడిచే క్యాబ్‌లు, ఆటోలు మామూలుగా నడిచాయి. మెట్రో సర్వీసులుకు సంబంధించి గ్రీన్‌లైన్‌లో పండిట్ శ్రీరాం శర్మ స్టేషన్ ఎంట్రీ ఎగ్జిట్ గేట్లను మాత్రం మూసివేశారు. కాగా తాము పిలుపునిచ్చిన భారత్ బంద్‌ను ప్రశాంతంగా నిర్వహించిన వారందరికీ రైతుసంఘాలు కృతజ్ఞతలు తెలియజేశాయి.

టిక్రి వద్ద హర్యానా యువ రైతు మృతి

కాగా ఢిల్లీహర్యానా సరిహద్దుల్లోని టిక్రీ వద్ద హర్యానా రాష్ట్రం సోనిపట్‌కు చెందిన అజయ్ మూర్ అనే 35 ఏళ్ల రైతు చనిపోయాడు. గత కొన్ని రోజులుగా ఇక్కడ జరుగుతున్న రైతు ఆందోళనలో పాల్గొన్న మూర్ రాత్రి పూట ఆరుబైట నిద్ర పోయే వాడని, బహుశా చలివల్లే అతను చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు.

తాడో పేడో తేల్చుకుంటాం: రైతు సంఘాలు

కాగా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు తాము కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ చెప్పారు. తమ డిమమాండ్లను ఆమోదిస్తారో లేదో చెప్పాలని ఆ సమావేశంలో అమిత్‌షాను తాము సూటిగా కోరనున్నామని , ఆయన సమాధానాన్ని బట్టి బుధవారం కేంద్ర మంత్రులతో జరగబోయే సమావేశంలో వ్యూహాన్ని నిర్ణయించుకుంటామని రైతు నాయకుడు రుద్రుసింగ్ మాన్సా విలేఖరులకు చెప్పారు. కాగా బుధవారం సాయంత్రం 5 గంటలకు ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ నేతృత్వంలో ప్రతిపక్ష నేతల బృందం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో సమావేశం కానున్న విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News