Home ఎడిటోరియల్ ప్రజాస్వామ్య చేదు నిజాలు

ప్రజాస్వామ్య చేదు నిజాలు

Cash

దేశంలో గత రెండు ఎన్నికల మధ్య రాజకీయ నేతల ఆస్తులు భారీగా 500శాతందాకా పెరిగినందున ఆ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకున్నది వెల్లడించాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల సంస్కరణలకు వ్యతిరేకం కాదంటూనే అవసరమైన సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తిని వ్యక్త పరిచింది. ఇప్పటిదాకా మీరేం చేశారు? అని జస్టిస్ జె. చలమేశ్వర్, ఎస్. అబ్దుల్ నజర్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ పత్రాల్లో ఆదాయ వనరులకు మూలమేమిటో వెల్లడించాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ “లోక్ ప్రహరీ” దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్నికల సంఘానికి, కేంద్ర
ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. స్వచ్ఛభారత్ ద్వారా చెత్త శుభ్రం చేయడం కాదు. అవినీతి మహమ్మారిని దేశంలో లేకుండా చేయాలి సుమా! అప్పుడే దేశ ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల విలువ, నమ్మకం పెరుగుతుంది.
2007లో యునైటెడ్ నేషన్స్ (యు.ఎన్) జనరల్ అసెంబ్లీ ప్రజాస్వామ్య సూత్రాలను ప్రజలకు అవగాహన పరిచే ఉద్దేశ్యంతో సెప్టెంబర్ 15ను అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా ప్రకటించింది.
యు.ఎన్‌లో 193 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
ప్రజలు తమ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలలో జీవితంలోని అన్ని అంశాలలో పూర్తి భాగస్వామ్యాన్ని స్వేచ్ఛగా అనుభవించ గలిగే సార్వత్రిక విలువగా ప్రజాస్వామ్యాన్ని నిర్వచించడం జరిగింది. 2006 నుండి ప్రతి ఏటా ప్రజాస్వామ్యదేశాలలో ప్రజాస్వామ్యం వృద్ధి సూచీని ఎకనామిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఈ.ఐ.యు.) రూపొందిస్తుంది.
ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థను సుమారు 50 శాతం దేశాలు అనుసరిస్తున్నాయి. సంపూర్ణ ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్న దేశాలు 2015 నాటికి 9% శాతం కాగా, 2016 నాటికి సగానికి తగ్గి 4.5% శాతానికి చేరుకున్నాయి. సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాల జాబితాలో “నార్వే” తరువాత వరుస క్రమంలో ఐస్‌లాండ్, స్వీడన్, న్యూజిలాండ్, డెన్మార్క్, కెనడా, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, పిన్‌లాండ్, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. 160 దేశాలతో రూపొందించిన సూచిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థపట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుండగా, లాటిన్ అమెరికా, యూరప్ దేశాలకన్నా, ఆసియా దేశాల ప్రజల్లో విశ్వాసం ఎక్కువగా తగ్గడం గమనించవలసిన అంశం. బ్రిటన్ ప్రజల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల విశ్వాసం పెరుగుతున్నది. సంపూర్ణ ప్రజాస్వామ్యం కలిగిన దేశాలల్లో “నార్వే” అగ్రస్థానంలో ఉంది.
కుబేరుల గుప్తధనాన్ని స్వదేశానికి తెచ్చి జాతికి పంచుతామన్న భారతదేశ పాలకులు మాట నిలబెట్టుకోవాలి. మీరు “నాయకులు” కాదు! సేవకులు పాలేరులు అనే భావన ప్రజల్లో కలిగే రోజులు రావాలి! నాయకులు స్వార్ధం వీడి, మారినప్పుడు ఈ దేశానికి పట్టిన దరిద్రం పోతుంది. ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాల్లోకంటే భారత దేశంలోనే పరిఢవిల్లుతున్నదన్న భావన రావాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు తీర్చండి. ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయండి. ఎన్నికల సమయంలో దగాకోరు హామీలు (వాగ్ధానాలు) మానండి. మీరు మారండి. ప్రజల బాగోగులు చూడండి. ఓటు విలువను కాపాడండి.
ఈ దేశంలో సామాన్యులకు, సంపన్నులకు మధ్య రోజురోజుకు అగాధం పూడ్చలేని విధంగా పెరుగుతున్నది. ఇలాగే జరిగితే ఈ దేశ భవిష్యత్తు ఏమిటి? ప్రభుత్వాలు ఎన్ని మారినా జాతి సంపద చట్టబద్ధంగా, సమంగా ప్రజలకు అందితే ప్రతిపౌరుడు సంపన్నుడే అవుతాడు. ఈ దేశసంపద ఎంత పెరిగినా సామాన్యుల వాటా మాత్రం పెరగటం లేదు. ఇది ప్రజాస్వామ్య పాలనకు విరుద్ధం కాదా ! ఇలాగే జరిగితే ప్రజాస్వామ్యం అంటే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లదా ! దీనికి బాధ్యులు పాలకులు కాదా!

(“15, సెప్టెంబర్ అంతర్జాతీయ ప్రజాస్వామ్య” దినోత్సవం)