Home కలం కందుకూరి శ్రీరాములు ‘అలుకుపిడచ’

కందుకూరి శ్రీరాములు ‘అలుకుపిడచ’

Alakupidacha

ఎప్పుడు 1974ల నుండి చినుకులంటి, మిణుగురులంటి కవితలతో ప్రథమ కవిత్వ సంకలనం ‘దివిటి’ వేసి, కొత్త కవిత్వపు రుచులు చూపిన కందుకూరి శ్రీరాములుగారు మంచికవి. చిక్కనైన కవి. సా మాజిక దృక్పథాన్ని మోసుకొచ్చే కవి. పది కవితా సంకలనాలుగా విస్తరించిన కవి.
తనదైన సామర్ధం మీద కొంత విశ్వాసం కలిగిన తర్వాతే మనిషి విశాలమైన తన పాదాన్ని మోపగలుగుతాడు. తనకు తానుగా ఆజ్ఞాపించుకున్న తర్వాతనే మనిషి కవి అవుతాడు. సమాజ చైతన్య వికసన విరాజిల్లే కవిత్వంతో మన ముందుకు మళ్లొకసారి వచ్చిన ఈ కవి ఎన్ని జ్ఞాన శ్రేణు లెక్కారో? ఎన్ని భావనా తంత్రులు మీటారో.
“పండగొచ్చిందంటే చాలు/ మా నాయనమ్మ అలుకుపిడుచయ్యేది” అంటూ నాయనమ్మనే అలుకుపిడచను చేసిన కవి ఈ కవి. అలుకు పిడచ అనేది గ్రామీణ నేపథ్యాన్ని పట్టిస్తుంది. పూర్వం.. అనగా అనగా .. అని చెప్పుకోవాల్సిన కొన్ని గత స్మృతుల్లో ఒద్దికగా ఒదిగిన శుభ్రతకు చిహ్నం అలుకుపిడుచ. ఇప్పుడైతే కిరోసిన్ స్టవులు, గ్యాస్ స్టవులు వాడకమెక్కువై మట్టి పొయ్యి, కట్టెల పొయ్యిలను మరిపిస్తున్నవి. కానీ, ఎన్కట పొయ్యి శుభ్రం చెయ్యడానికి ప్రత్యేకమైన ఒక పిడచ నుంచేవాళ్లు. ఎర్ర మట్టి బుడ్డిలో నానినాని సిద్ధంగా ఉండేది. తెల్లవారు జామున్నే మొదటి నిప్పు రాజేయాలంటే ఇల్లాలి చేతులు పిడుచను పట్టాల్సిందె. ఇల్లంతా ఎర్రమట్టితోనో, కుదిరితే ఆవు పెండతోనో పిడుచనందుకున్నారంటే అలికి, ముగ్గులు పెట్టే చేతల అలసట నెవరు గుర్తు చేశారు గనక. అందుకే అవి గుర్తు చేస్తూ శుచిత్ర ప్రతీక నెత్తుకుంటూ నిశ్శబ్దం రాత్రి ఉండే ఉండీ/ తొలి పొద్దు పొడుస్తుంటే/ పల్లె ఇళ్లు జూలు దులిపి జలదరించేది/ మూలకున్న చీపుర కట్టకు సిగమొచ్చి ఒళ్లెరుగకుండా ఇల్లంతా ఊగేది” అంటా రు కవి.
అస్త్రాన్ని ఉపయోగించిన వారిని చెప్పక ‘ఇల్లంతా ఊగేది’ అనే క్రియకు దాన్ని జోడించి చెప్పడం బావుందిక్కడ. షాబాద్ బండిలో, గచ్చుదో, టైల్స్ లేని కాలాన భూమాతకు ముగ్గులతో ముద్దు బెట్టి, గడ్పకి బొట్టు పెట్టిన చేతులు, పండుగలొస్తే పలారాలు జేసి మురిపించేవి. అమ్మ, నాయనమ్మలంటే ఎవరు? కయ్యుమన్నా కసిరినా కడుపునిండబెట్టే దేవతలు. కాబట్టే కందుకూరి శ్రీరాములుగారు ఈ కవితలో తమ చిన్ననాటి కలల సౌధాన్ని నోస్టాలిజియాలో “దర్వాజలన్నీ తీరొక్క నాట్యం చేస్తే, గొళ్లాలన్ని సంకెళ్లు వీడి తాళాలేసేవి” అని వర్ణించుకుంటూ నాయనమ్మ ముచ్చట్లతో ముగిస్తారు. ‘ఎయిలి వరంగలేచింది, మొదలు నడిరాత్రి పడుకునేదాకా పొక్కిలైన నేలకు, అలుకుపిడుచయ్యేది నాయనమ్మ’ అంటూ పల్లెల్లోకి, పాత జ్ఞాపకాల్లోకి తీసుకుపోతారు.
సామాజిక జీవితంలోని వాస్తవికతను ప్రతిబింబింపచేయడం కందుకూరిగారి కవిత్వంలో గమనిస్తాం. ‘ఆది’ అనే కవితలో ఉగాది చైత్యంగా వారి నాన్న గారిని తలచుకోవడంలో తన ఎదుగుదలకు తానోపొన్నుగర్రలా ఎట్లా ఉన్నాడో అదుతంగా రాశాడు. ‘బురదలో దిగితే కాళ్లు చెడతాయట. బుర్రతో చదువులో దిగమన్నాడు ‘కళ్లు వెలుగుతాయట’ అంటూనే, తన ‘హలాన్ని పట్టినట్టే నన్ను కలాన్ని పట్టమన్నాడు/ మా నాన్న దేవుడైతే బాగుండు అని ఆశపడతాడు, ఆశపెడతాడు. ఆయన పొలాన్ని దున్నితే ఈయన తెల్లకాగితాలను దున్నుతున్నాడు. కనిపించని దేవుణ్ణి ధైర్యానికి ఆలంబననుకొని ఊహిస్తూ మొక్కుకొనే మనుషులు కనిపించే దేవుళ్లంటే కన్నవారిపై కనికరంలేకుండా ఉండటానికి చెంపపెట్టు.
భావ ప్రతిబింబమే కవిత్వ మనడానికి వీరి కవితలో ‘పలకగీతల గోరుముద్దలు తినీతినీ/ శషసల పలుకుల విన్యాసం నేర్చుకొని ’ శిష్యుడు పెరుగుతుంటాడంటారు. ‘ప్రశ్న శిలను చెక్కి జవాబు శిల్పాన్ని చేయడం ఒక కళ/ ఆ ‘కళ’ ఒక గురువు/ ఆ గురువుకు ఒక ‘కల’ శిష్యుడు’ అంటూ గురు శిష్యులు అనే కవితలో రాసినా, ‘ఇక నుంచి / తల్లీతండ్రి ఆచార్యునితో పాటు / రైతు దేవోభవ అనాల్సిందే’ అని జీవచ్ఛవం కవితలో శాసించినా, / ఒకే ఒక కలం/ ఒకే ఒక్క కలాం / ఒకే ఒక్క దేశం అయినవాడు’ అంటూ అబ్దుల్ కలాంపై రాసినా ప్రస్తుత ఉరుకుల పరుగుల పరధ్యాన్నాల సమాజానికి కావలసినవారు గురువులు, రైతులు, మేధావులుగారు అని సూటిగానే చెప్పారు కందుకూరి.
కవి కలమెప్పుడూ కల్లోల జీవితాలవైపు ఉండాలి. కల్లోలాలు సృష్టించేవారిని పీకి, పెకిలించే నిర్ణయానికి రావాలి. ‘ఎన్ని పర్యాయాలు తిరగేసినా ఉద్యమ బుద్ధి జీవి ఖండధారే కాని / అస్త్ర సన్యాసం చేయడు’ అని గెలమెత్తుతాడు కవి. ‘బాధల గుండె పొరల్లో నుండి రాలిన / కంటి చినుకు ఉద్యమ ఊరేగింపులోపడి / అగ్గిమీద గుగ్గిలమై / భగ్గుమంటదని తెలుసు’. అని తమదైన నమ్మకాన్ని వ్యక్తపరుస్తాడు. ఇప్పుడు కలలు సాకారమైనవి. కాపు రాజయ్య గురించి, క్యాన్సర్‌తో మరణించిన మిత్రుని భార్య లీల గురించి, రైల్వే స్టేషన్‌లో తాగే నీరు లేక చనిపోయిన జంట గురించి, గుడి హాళం కవి గురించి ఆర్ద్రమైన కవితలు అందించాడు.
“కంశ్రీని గారిని దగ్గరగా బేరీజు వేయడంలో శివారెడ్డి విజయవంతమైయ్యారనుకుంటాను. అతని ఊహలకు జిగేలుమని మెరిసే లక్షణం లేదనడాన్ని అంగీకరించలేను గాని, ఫినిషింగ్‌మీద శ్రద్ధ లేదని ఒప్పుకుంటాను. కందుకూరి శ్రీరాములు తాత్విక పునాది ఉన్న కవిత్వం అనడంలో వి.వి.ఆప్యాయత కనిపిస్తుంది’ అని ‘శ్రీరాములు నీవే కలవు’ అంటూ ఈ కవితా సంపుటికి పీఠిక రాసిన కె.శ్రీనివాస్ గారి మాటలు అక్షర సత్యాలు. బహుశ జిగేలు మనే వ్యాక్యాలతో మెరిసినా ఎత్తుకున్న అంశాలన్నీ ముగింపు కష్టమైయ్యేంత దారుణంగా ఉన్నాయేమో కవి మనస్సుకి. కందుకూరి శ్రీరాములు గారికి అభినందనలు తెలిపి ‘అలుకు పిడుచను’ చదువుకుందాం.