Home ఎడిటోరియల్ సంపాదకీయం : ఆర్థిక వ్యవస్థకు ‘బూస్ట్’

సంపాదకీయం : ఆర్థిక వ్యవస్థకు ‘బూస్ట్’

Sampadakeeyam-Logo

దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రవేశించిన మందగమనం తాత్కాలిక లక్షణం కాదు, వాస్తవం అని ఆర్థికవేత్తలు నిర్థారణకు రావటం కేంద్రప్రభుత్వాన్ని కలవరపరుస్తున్నది. జూన్‌తో ముగిసిన 2017 తొలి త్రైమాసికంలో జిడిపి వృద్ధిరేటు గత మూడేళ్లలోకెల్లా తక్కువగా 5.7శాతానికి దిగజారటం తర్కవాదనలతో బుకాయించే అవకాశాన్ని నిరాకరిస్తున్నది. వరుసగా 18 మాసాలుగా వృద్ధిరేటు తగ్గుతూ వస్తున్నది. మరోవైపున ఎగుమతులు తగ్గుతున్నాయి, పారిశ్రామిక వృద్ధిరేటు గత ఐదేళ్లలో కెల్లా తక్కువస్థాయికి పడిపోయింది. కరెంట్ అక్కౌంట్ లోటు (విదేశీ మారకద్రవ్యం రాకపోక మధ్య తేడా) ఏప్రిల్‌జూన్‌లో జిడిపిలో 2.4శాతానికి పెరిగింది. ప్రపంచంలో వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అంతర్జాతీయ పెట్టుబడి ప్రశంసలు పొందుతున్న మనదేశం ఇప్పుడా స్థానాన్ని మళ్లీ చైనాకు కోల్పోయింది. 2016 నవంబర్‌లో ప్రధాని నరేంద్రమోడీ ‘మహాత్కార్యం’గా ప్రకటించిన పెద్ద విలువ కరెన్సీనోట్ల రద్దును ప్రభుత్వం గట్టిగా సమర్థించుకుంటున్నప్పటికీ, డీమానిటైజేషన్‌వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బ తగిలిందని, సరైన సన్నాహకాలు లేకుండా ఆదరాబాదరా ప్రవేశపెట్టిన వస్తుసేవల పన్ను ఆ కష్టాలను మరింత పెంచిందని ప్రపంచంలోని ప్రధాన వ్యవస్థాగత అంచనాల సంస్థలు నిర్ధారణకు వచ్చాయి. 2018 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7 శాతానికి దిగువనే ఉంటుందని జోస్యాలు చెబుతున్నాయి. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బుకాయింపులకు అవకాశమివ్వని రీతిగా గణాంకాలు ప్రశ్నిస్తున్నాయి. అయినా అలవాటు ప్రకారం ఆయన 3.6 శాతం ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) సబబేనంటున్నారు. వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ధరల పెరుగుదల 4శాతం వరకు ఉండవచ్చునంటున్నారు. పెట్రోలియం ధరలు విపరీతంగా పెరగటాన్ని విమర్శించేవారి పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘విమర్శిస్తున్న కాంగ్రెస్, సిపిఐ(ఎం) ప్రభుత్వాలు పన్నులు తగ్గించమనండి, కేంద్ర పెట్రోలియం పన్నుల్లో వాటా వదులుకోమనండి’ అని మండిపడటం అసహనానికి పరాకాష్ట.
ఆర్థిక వృద్ధిరేటు స్తబ్దతలో పడటమంటే ఆర్థిక వ్యవస్థలోని కీలకరంగాలన్నీ మందగించటం. మోడీ ప్రభుత్వానిది అసలే ఉపాధి రహిత వృద్ధి. ఏటా 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని విద్యాధిక యువతను ఆకర్షించిన మోడీ, గత మూడేళ్ల అధికారకాలంలో 1,35,000 ఉద్యోగాలు మాత్రమే కల్పించారు. ఇప్పటి పరిస్థితుల్లో ఇది మరింతగా తగ్గుతుంది. అంతేకాదు, డీమానిటైజేషన్‌వల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఉద్యోగాలు కోల్పోయిన కోటిన్నరమంది, వారి కుటుంబాల ఉద్యోగ ఆశలు అడియాసే.
‘ఒక దేశంఒకే పన్ను’ అనే సెంటిమెంటల్ నినాదంతో సన్నాహాలు పూర్తికాకుండా ప్రవేశపెట్టిన జిఎస్‌టి కూడా లక్షలాదిమంది ఉద్యోగాలు ఊడగొడుతోంది. జిఎస్‌టి నిబంధనల ప్రకారం వ్యాపారులు ప్రతినెల జిఎస్‌టి అక్కౌంట్ సమర్పించాలి. జులైలో జిఎస్‌టి అమలులోకి రాక మునుపు ప్రభుత్వానికి చెల్లించిన పన్నును జిఎస్‌టి చెల్లించాక తిరిగి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడేమో పూర్తి స్క్రూటినీ ముగిశాక ఎన్నినెలలు పడుతుందో చెల్లిస్తామంటోంది. దాంతో వ్యాపారులు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతున్నారు, రిట్రెంచిమెంట్ మొదలైంది. రాష్ట్రాలకు 1వ తేదీకి జమ చేయాల్సిన వాటి వాటాను 1520 రోజులు ఆలస్యంగా కేంద్రం చెల్లించటంతో అవి కటకటపడుతున్నాయి.
మార్కెట్ మాంద్యంవల్ల ఉత్పత్తుల విస్తరణకు ప్రైవేటు పెట్టుబడులు రావటంలేదు. అప్పుల ఎగనామం భారంతో బ్యాంకులు దివాళా అంచున ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం కల్పించటానికి ప్రభుత్వమే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టక తప్పదు. ఆర్థికమంత్రి జైట్లీ గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఆర్థికవ్యవస్థ స్తబ్దతను గ్రహించకపోలేదు. గత రెండ్రోజులుగా మౌలిక వసతుల శాఖల మంత్రులు, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, ఆర్థిక సలహాదారుతో సమావేశాలతో బిజీబిజీగా ఉన్నారు. వాస్తవ పరిస్థితిని ప్రధానికి వివరించి దిద్దుబాటు చర్యలకు ఒప్పించాల్సి ఉంది. అందువల్ల ఏ కొత్త ప్యాకేజీతో ముందుకు వస్తారో వేచి చూదాం. అది పెట్టుబడిదారులకు రాయితీలుగా గాక
ఉపాధులు పెంచేదిగా, కిందిస్థాయి ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కలిగించేదిగా ఉంటేనే ప్రయోజనకారి అవుతుంది.