*ఇద్దరి పరిస్థితి విషమం, ముగ్గురికి తీవ్ర గాయాలు
*బోలెరో, టాటాఏసి వాహానాలలో ఉన్న వారికి స్వల్పగాయాలు
మన తెలంగాణ/నర్సంపేటః అతివేగంతో బొలెరోను ఇండికా కారు ఢీకొట్టడంతో కారు, బొలెరోతో పాటు మరో టాటాఏసి వాహనం నుజ్జునుజ్జు కాగా ఇద్దరి పరిస్థితి విషమం, ముగ్గురికి తీవ్రగాయాలు, పలువురికి స్వల్పగాయాలు అయిన ఘటన మండలంలోని ముత్తోజిపేట గ్రామ శివారు రాజిపేట స్టేజి సమీపంలోని జాతీయ రహాదారి(365)పై జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడారం నుండి మల్లంపల్లి మీదుగా నర్సంపేట వైపు వస్తున్న టాటా ఇండికా కారు అతివేగంతో వస్తు అదుపుతప్పి మల్లంపల్లి వైపు వెళుతున్న బొలెరోను ఢీకొట్టడంతో బొలెరో వెనుకాల వస్తున్న టాటాఏసి బొలెరోను ఢీకొని మూడు వాహానాలు ధ్వంసం అయినాయి. కారులో ఉన్నటువంటి డ్రైవరుతో సహా ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో వెంటనే సమాచారం అందుకున్న టౌన్ సిఐ కొత్త దేవేందర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు . అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తు తీవ్రంగా గాయపడ్డ వారు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం మల్లారెడ్డిపాలెం గ్రామానికి చెందిన డ్రైవర్ లింగరాజు, వెంకట్‌రెడ్డి, కృష్ణారావులకు తీవ్ర గాయాలు కాగా వీరారెడ్డి , సమ్మిరెడ్డిలకు స్వల్పగాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న బావుసింగ్, ధర్మ, లక్ష్మణ్‌లకు స్వల్పగాయాలు కాగా టాటాఏసి వాహానంలో ప్రయాణిస్తున్న బానోతు రమేష్, జాటోతు ధన్‌సింగ్, సరోజన, అమ్మి, నీలాలకు స్వల్పగాయలు అయినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సిఐ తో పాటు ఎస్‌ఐ నాగ్‌నాద్ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.