Home జాతీయ వార్తలు కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం

కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం

ind

మోడీ ప్రభుత్వంపై 27న అవిశ్వాస తీర్మానానికి స్పీకర్‌కు నోటీసు అందజేసిన ఖర్గే
చర్చకు వచ్చి తీరుతుందని ధీమా
ప్రధానికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని విమర్శ

మనతెలంగాణ/న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వంపై ఈ నెల 27న కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి  సిద్ధమయింది. తీర్మానానికి సంబంధించి అనుమతి కోరు తూ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు మల్లికార్జున ఖర్గే నోటీసులు అందించారు. ఆ తరువాత  కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జె.డి.శీలం మాట్లాడుతూ తాము పెట్టబోయే అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని విమర్శించారు.కావాలనే అవిశ్వాస తీర్మానాలు సభలో చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బయట సభల్లో గొప్పగా నీతులు చెప్పే మోదీ సభా సంప్రదాయాల్ని ఎందుకు గౌరవించడం లేదని మం డిపడ్డారు. అదెవిధంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు అవిశ్వాసం పెట్టినా కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానికి స్పీకర్‌కు నోటీసులు ఇచ్చినప్పుడు తాము మద్దతు ప్రకటించామని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్, టీడీపి లు శుక్రవారం లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు మరోసారి నోటీసులు అందచేశారు. శుక్రవారం ఉదయం 11గంటలకు లోక్ సభ ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్, అన్నాడీఎంకే సభ్యుల ఆందోళనతో సభ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా పడింది. తిరిగి 12గంటలకు సభ ప్రారంభం కాగానే .. వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నర్సింహంలు అవిశ్వాస తీర్మానంపై నోటీసులు ఇచ్చారన్న స్పీకర్.. “సభ సజావుగా సాగినప్పుడు మాత్రమే దానిపై ముందుకు వెళతానని స్పష్టం చేస్తున్నా.. అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే ఎంపీలంతా ఒకచోటి వస్తే లెక్కింపునకు సులువుగా ఉంటుంది. ఇదంతా జరగాలంటే ఆందోళన చేస్తోన్న ఎంపీలు తమ తమ స్థానాల్లో కూర్చోవాలి..’ అని అన్నారు. కాని అప్పటికే పోడియం వద్దకు చేరుకొని ఆందోళన చేస్తోన్న టీఆర్‌ఎస్, ఎంపీలు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు రాజ్యసభలోనూ సీన్ అసలు మారలేదు. వారం రోజులుగా ఏం జరుగుతుందో ఇవాళ అదే జరిగింది. కాకపోతే లోక్ సభ ప్రారంభమైన 2, 3 నిముషాల్లోపే వాయిదా పడితే… రాజ్యసభలో కనీసం ఓ 10 నిముషాలు హడావుడి జరిగింది. విపక్షాల నిరసనలతో సభ హోరెత్తింది. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, అన్నాడీఎంకే సభ్యులు రాజ్యసభ ఛైర్మన్ పోడియం వద్దకు చేరుకొని తమ డిమాండ్లపై నిరసన తెలిపారు. ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఎంత వారించినా సభ్యులు వినకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. అనంతరం పలువురు రాజ్యసభ సభ్యులు ఛైర్మన్ వెంక్యనాయుడుని ఆయన కార్యాలయంలో కలసి, సోమవారం లోక్ సభ కు సెలవు ప్రకటించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. రాజ్యసభ కు కూడా సెలవు ప్రకటించాలని కోరారు. వారి విన్నపాన్ని అంగీకరించిన ఛైర్మన్ సభకు సోమవారం సెలవు ప్రకటిస్తూ నిర్ణయాన్ని వెలువరించారు. లోక్ సభ వాయిదా పడిన అనంతరం వైఎస్సార్ పార్టీ ఎంపీలు మాట్లాడుతూ…. అవిశ్వాసంపై ఈ నెల 27న చర్చకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ప్రత్యేక హోదాపై చర్చ జరిగే వరకూ తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సభలో చర్చ జరిగే వరకూ నోటీసులు ఇస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇంతకు ముందు ఆరుసార్లు ఇచ్చిన నోటీసులపై సభలో చర్చ జరగని సందర్భంగా మళ్లీ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వియసాయిరెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ప్రధాని కార్యాలయాన్ని కించపరుస్తూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని, రాష్ట్ర శాసనసభలో లేని తన గురించి చంద్రబాబు విమర్శిస్తూ మాట్లాడారని అందుకే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానన్నారు. అలాగే కేసుల మాఫీకి ఎన్డీఏతో మళ్లీ కలవాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాజకీయ పార్టీలు, కూటములకు విడాకులు ఇవ్వడం, మళ్లీ మళ్లీ కలిసిపోవడం చంద్రబాబుకు అలవాటేనని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులతో టీడీపీ ఎంపీల రహస్య భేటీలు, ప్యాకేజీ సాధన కోసం జరుగుతోన్న ప్రయత్నాలను ఆయన తప్పుపట్టారు. అవినీతి, అక్రమాలు బయటపడతాయనే భయంతోనే తిరిగి బీజేపీతో రీయూనియన్ అయ్యేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని చెప్పారు. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. రోజుకొక వేషధారణతో నిరసన తెలిపే తెలుగుదేశం పార్టీ ఎంపీ శివప్రసాద్ ఇవాళ పోలవరం రైతు అవతారంతో నిరసన వ్యక్తం చేశారు.