Home రంగారెడ్డి కొత్త కలెక్టరేట్ల నిర్మాణం తీరిది

కొత్త కలెక్టరేట్ల నిర్మాణం తీరిది

collecterరెండు చోట్ల చురుకుగా..
ఒక చోట నెమ్మదిగా

రంగారెడ్డి జిల్లా : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం కొన్ని చోట్ల వేగంగా మరో చోట నత్తనడకన సాగుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు ఉద్యోగులకు సౌకర్యార్దంగా సకల సౌకర్యాలతో నిర్మించ తలపెట్టిన కొత్త కలెక్టరేట్‌లపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. 2019 ఎన్నికలలోపు కొత్త కలెక్టరేట్‌ల నిర్మాణం పూర్తి చేసి సత్తాచాటాలని ప్రభుత్వం భావిస్తుంది.  కొత్త జిల్లాల ఏర్పాటు చేసిన సంవత్సరం అనంతరం కొత్త కలెక్టరేట్‌ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బాటంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించింది. దసరా పర్వదినం పురస్కరించుకుని గత నెల 11న వికారాబాద్‌లో మంత్రి మహేందర్ రెడ్డి, మేడ్చల్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, 12 న రంగారెడ్డిలో మంత్రులు పద్మారావు, మహేందర్‌రెడ్డిల చేతుల మీదుగా జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. భూమి పూజ నిర్వహించడానికి ముందుగానే కలెక్టరేట్‌ల నిర్మాణ పనులకు సంబంధించి ఆర్ అండ్‌బి అధికారులు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు కావలసిన కార్యక్రమాలు పూర్తిచేశారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ నిర్మాణం పనులు మిగత జిల్లాల కన్న వేగంగా ముందుకు సాగుతున్నాయి. శంకుస్థాపన చేసిన అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు నిర్మాణ పనులను కలెక్టర్ యం.వి.రెడ్డి అధికారులతో కలసి నేరుగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎడాధి లోపు నిర్మాణం పూర్తి చేయాలన్న లక్షంతో కలెక్టర్ స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. వచ్చే దసరా నాటికి ప్రస్తుతం కొనసాగుతున్న ఆద్దె భవనం నుంచి స్వంత భవనంలోకి మారడంతో పాటు రాష్ట్రంలోనే మొదటగా నిర్మాణం పూర్తిచేసి రికార్డు సృష్టించాలన్న లక్షంతో కలెక్టర్ అధికారులకు, కాంట్రాక్టర్‌లకు సూచించడంతో పనులు జోరుగా సాగుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో సైతం పనులు చకచక సాగుతున్నాయి. కలెక్టర్ దివ్యదేవరాజన్ కలెక్టరేట్ నమూనాను అధికారులతో సమీక్షించి పనులు వేగంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.రంగారెడ్డి జిల్లాలో నిర్మాణ పనులు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంబించలేదు. భూమిని కొంత వరకు చదును చేసి వదిలేశారు. నెల రోజులు సమీపిస్తున్న కేవలం ఒక్క బోరు వేసి నిర్మాణ పనులు చేపడుతున్న సంస్థ సిబ్బంది కోసం గదులు నిర్మాణ ప్రక్రియ ప్రారంబించారు. జిల్లా అధికారులు గాని ఆర్‌ఆండ్‌బి యంత్రాంగం గాని పనుల పురోగతి గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త జిల్లాల్లో పనులు వేగంగా సాగుతుండగా రంగారెడ్డిలో ఎందుకు వెనకబడుతున్నారో అధికారులకే తెలియాలి. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ విషయంలో జిల్లాలోని ఎమ్మెల్యేల మద్య మనస్పర్దల మూలంగా పనుల ముందుకు సాగడంలో ఆలస్యం జరుగుతుందా అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ సియం కెసిఆర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ స్థల ఎంపిక జరుగడంతో స్థల మార్పిడి ప్రశ్న ఉత్పన్నం ఆయ్యే వాతావరణం లేదు. భూమి పూజకు రాకుండా నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు సైతం ప్రస్తుతం మౌనంగా తమ పని తాము చేసుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడ కలెక్టరేట్ స్థల విషయంపై మాట్లాడటం లేదు. కొత్త కలెక్టరేట్‌ల నిర్మాణం వేగంగా పూర్తి చేసి ఆద్దెభవనం నుంచి స్వంత భవనంకు త్వరగా మార్చడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవలసిన అవసరం చాలా వరకు ఉంది.