Home ఎడిటోరియల్ సింగరేణి కార్మికుల సమ్మె పూర్వాపరాలు

సింగరేణి కార్మికుల సమ్మె పూర్వాపరాలు

singareni

సింగరేణి బొగ్గుగని ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో 6 జిల్లాల లో విస్తరించి యున్నది. శ్రీరాంపూర్, రామక్రిష్ణాపురం, మందమర్రి, బెల్లంపల్లి, గోలేటి, గోదావరిఖని, కొత్త గూడెం, ఇల్లందు, మణుగూరు, భూపాలపల్లి ప్రాంతా లలోని 36 భూగర్భ మరియు 16 ఓప్‌న్ కాస్ట్ బొగ్గుగనులలో 57వేల రెగ్యులర్ కార్మికులు, 25వేలకు పైగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. రోజుకు 2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ రూ.41కోట్ల ఆదాయం సమకూర్చుకుంటూ 20కోట్లకు పైగా ఉద్యోగులపై ఖర్చు చేస్తున్నారు. 1981లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) సింగరేణి యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందం మేరకు సింగరేణి లో ప్రమాదాలకు గురై మరణించిన, అంగవైకల్యం చెందిన, వయస్సు మళ్ళినవారు, అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికుల కుటుంబాల వారికి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ఒప్పందం మేరకు 1998 వరకు యాజమాన్యం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వచ్చింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ, ప్రైవేటీ కరణ విధానాల మూలంగా సింగరేణి నష్టాల పేరుతో పర్మినెంట్ ఉద్యోగులకు విఆర్‌ఎస్ స్కీం ద్వారా పంపించటంతో పాటు వారసత్వ ఉద్యోగాలకు యాజమాన్యం స్వస్తి పలికింది (నిలిపి వేసింది). ఆనాటి నుండి కార్మిక సంఘాలు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ వివిధ రకాల ఆందోళనలు చేపడుతూ వస్తున్నారు.
తెలంగాణాలో ప్రకృతి వనరులైన నీళ్ళు, నిధులు, ఖనిజాలు అక్రమ దోపిడీలు జరుగుతుందని వీటిని కాపాడుకోవాల్సినటు వంటి అవసరం ఉందని ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో టిఆర్‌ఎస్ పార్టీ సింగరేణి కార్మికులందరికి వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్ధానం చేస్తూ వచ్చింది. 2012లో వెరిఫికేషన్ కోసం జరిగిన సింగరేణి కార్మికుల యూనియన్ ఎన్నిక ల్లో టిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన నినాదం వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కార్మికులను నమ్మించి టిఆర్‌ఎస్‌కు అనుకూల కార్మిక సంఘం టిబిజికెఎస్ గుర్తింపు ఎన్నికల్లో నెగ్గింది.
గత 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టిబిజికెఎస్ వారసత్వ ఉద్యోగాలను ఇప్పించలేకపోయింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీ 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వారసత్వ ఉద్యోగాల నియామ కాల ను పట్టించుకోలేదు. 4 సంవత్సరాలకు ఒకసారి సింగరేణిలో 2016 లో జరగాల్సిన గుర్తింపు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని వారసత్వ ఉద్యోగాలను కల్పిస్తున్నట్లు గత అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. అధికార పార్టీ అనుకూలం గా ఉన్న టిబిజి కెఎస్ గెలిపించుకొనుటకు యాజమాన్యంతో వారసత్వ ఉద్యోగాలను కల్పిస్తున్నట్లు, 2016 డిసెంబర్‌లో ధరఖాస్తు లు చేసుకోవాలని యాజమాన్యంతో సర్కులర్ ద్వారా ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై తెలంగాణ జాగృతి సంఘం నాయ కులు హైకోర్టులో పిటిషన్ వేయటంతో ఉద్యోగ నియామకాలు చెల్లవని ఆదేశాలు రావటం దానిపై సుప్రీంకోర్టు కూడా కొట్టి వేయటంతో మేనేజ్‌మెంట్ ఇచ్చిన సరులర్‌ను నిలిపివేయటం జరిగింది.
సింగరేణిలో పనిచేయుచున్న 5 కేంద్ర కార్మిక సంఘాలైన ఎఐటి యుసి, ఐఎన్‌టియుసి, బిఎంఎస్, హెచ్‌ఎంఎస్, సిఐటియు కార్మిక సంఘాలు జెఎసిగా ఏర్పడి సింగరేణిలో సిఎం కెసిఆర్ ఆర్భాటంగా ప్రకటించిన వారసత్వ ఉద్యోగాల పథకం అమలు కోరుతూ సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా సింగరేణి యాజ మాన్యం కార్మిక సంఘాలతో చర్చలు జరిపి 1981లో కార్మిక సంఘా లతో చేసుకున్న విధంగా తిరిగి ఉద్యోగుల నియామకాల కోసం విధివిధానాలు రూపొందించి ఒప్పందానికి రావాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చినవి. దీనిపై సెంట్రల్ రీజినల్ లేబర్ కమీషనర్ కార్మిక సంఘాలతోను, యాజ మాన్యాలతో పలు దఫాలుగా చర్చలు చేపట్టినప్పటికీ యాజమాన్యం సానుకూలంగా స్పందించ క పోవటంతో చర్చలు విఫలమయ్యాయి. ఉద్యోగాలు వస్తాయని ఆశించిన కార్మిక కుటుంబాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి.
గత నెలరోజులుగా సింగరేణిలో అన్ని బొగ్గుగని బావుల వద్ద గేటు మీటింగ్‌లు పెడుతూ కార్మికులను చైతన్య పరుస్తూ వారసత్వ ఉద్యోగాలు సాధించుకొనుటకు సమ్మెకయినా సిద్ధంగా ఉండాలని జెఎసి యూనియన్‌లు ఆందోళనలు సాగిస్తూ వచ్చినవి. అధికార పార్టీ కి అనుకూలంగా ఉన్న టిబిజికెఎస్ సమ్మెకు దూరంగా ఉంటూ వచ్చింది.
సమ్మెతో స్థంభించిన సింగరేణి: జూన్ 15 నుండి సింగరేణి వ్యాప్తంగా 5 జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సమ్మె జయప్రదంగా జరుగుతుంది. దీనికి రాష్ట్రంలోని వామపక్ష పార్టీలతో పాటు వారి అనుబంధ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటిం చాయి. భూగర్భ గనులలో 90శాతం, ఓపెన్‌కాస్ట్‌లో 50శాతంపైగా ఉత్పత్తి నిలిచిపోయింది. కార్మిక సంఘా లు ఇచ్చిన సమ్మె పిలుపును పట్టించుకోకుండా మెజార్టీ కార్మికులు విధులకు హాజరైనట్లు యాజమాన్యం తప్పుడు ప్రకటనలు ఇస్తూ వారసత్వ ఉద్యోగాలు ఇవ్వటానికి ప్రభుత్వం ధృడనిశ్చయంతో ఉన్నదని పేర్కొంటూ సమ్మెను నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది.
గనుల వద్ద పోలీసు బలగాలు మోహరింపు: కార్మికుల సమ్మెతో ఉత్పత్తి నిలిచిపోవటంతో ప్రభుత్వం, యాజమాన్యం, సమ్మెను వ్యతి రేకిస్తున్న టిబిజికెఎస్‌తో కుమ్మకై పోలీసు సహకారంతో కార్మికులను పనుల్లో చేరే విధంగా తీవ్రంగా ఒత్తిళ్లు తీసుకు వస్తున్నారు. గనుల వద్ద 144 సెక్షన్ విధించి పోలీసుల బలగాలను మోహరించి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే వివిధ గనుల వద్ద యూనియన్ నాయకులను అరెస్టులు చేసి పోలీసు స్టేషన్‌లో నిర్భందించటం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం పంతాలు, పట్టింపులకు పోకుండా తక్షణమే సమ్మెలో ఉన్న కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వారసత్వ ఉద్యోగ నియామకాలకు విధివిధానాలు రూపొందించాలని, అప్రజా స్వామ్యంగా అక్రమ అరెస్టులను ఆపాలని, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.