Home తాజా వార్తలు రాష్ట్రాలే కీలకం

రాష్ట్రాలే కీలకం

ktr

రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలపడుతుంది

పరిశ్రమల స్థాపనపై దేశ దేశాల దౌత్యాధికారులు రాష్ట్రాలతో నేరుగా చర్చించాలి
డెక్కన్ డైలాగ్ సదస్సులో మంత్రి కె. తారకరామారావు స్పష్టీకరణ

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రాలు బలంగా ఉంటేనే మొత్తం దేశం బలంగా ఉంటుందని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రమే అయినప్పటికీ అనేక రంగాల్లో మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన రాష్ట్రంగా గుర్తింపు సాధించిందని అన్నారు. సులభ వాణిజ్య విధానంలో మొత్తం దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంద ని, వరుసగా రెండేళ్ళుగా ఆదర్శనీయమైన ఫలితాలు సాధిస్తూ ఉందని చెప్పారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నగరంలో ఆదివారం అభివృద్ధి కోసం ఆర్థిక దౌత్యం అనే అంశంపై సంయుక్తంగా నిర్వహించిన ‘డెక్కన్ డైలాగ్’ అనే సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవహారాలు, దౌత్య సంబంధాలు ఒకదానికొకటి విడదీయరాని అంశాలని, మారుతున్న ప్రస్తుత ప్రపంచ సంబంధాల్లో ఇలాంటి సదస్సులు ఆయా దేశాలకు, రాష్ట్రాలకు దోహదపడతాయని అన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో సులభ వాణిజ్య విధానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నదని, తెలంగాణ రాష్ట్రం అద్భుత ఫలితాలు సాధిస్తున్నందున అన్ని దేశాల దౌత్యాధికారులు ఇకపైన రాష్ట్రాలతో నేరుగా సంప్రదింపులు జరిపి పరిశ్రమల స్థాపనపై నిర్ణయం తీసుకోవడం సహేతుకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతి రాష్ట్రానికీ ఒక ప్రత్యేకత ఉంటుందని, వివిధ దేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు ఆయా దేశాల దౌత్యాధికారులు ఆ దిశలో వివరించవచ్చని సూచించారు. యావత్తు దేశం గురించి తెలుసుకోవాలనుకుంటే ఆయా రాష్ట్రాల్లోని అభివృద్ధి, ప్రత్యేకత, వనరులు తదితరాలను చూడాలని, కేవలం ప్రపంచ బ్యాంకు నివేదిక లేదా కన్సల్టెంట్ల నివేదికలను బట్టి నిర్ణయం తీసుకునే పద్ధతుల్లో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవహారాలు, దౌత్యపర సంబంధాలు ఒకదానికొకటి విడదీయరానివని అన్నారు. ప్రస్తుతం ఈ రెండు అంశాలనూ కలిపి సదస్సు నిర్వహిస్తుండడం, అనేక రంగాలకు చెందిన భాగస్వామ్యపక్షాలను ఆహ్వానించడం మంచి పరిణామమని అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో తాజా పరిస్థితులను పరిశీలిస్తే ఉపాధి కల్పన అనేది చాలా పెద్ద సమస్య అని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ సదస్సు జరుగుతుండడం ఆహ్వానించదగినదని, ఇకపైన ప్రతి ఏటా హైదరాబాద్ నగరంలో ‘డక్కన్ డైలాగ్’ను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశంలోని ఉత్తర, దక్షిణ భాగాలను కలిపే కీలక ప్రాంతం తెలంగాణ రాష్ట్రమేనని, ముఖ్యంగా హైదరాబాద్ నగరమేనని, ఇక్కడే ఇకపైన ప్రతీయ ఏటా ‘డక్కన్ డైలాగ్’ జరగడం సమంజసంగా ఉంటుందన్నారు. దౌత్యపర సంబంధాలను వృద్ధి చేయడానికి ప్రత్యేకంగా ఒక వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు.
కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వికె సింగ్ ఈ సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, వివిధ రంగాలకు చెందినవారిని ఒకే వేదికమీదకు తీసుకొచ్చేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తీసుకున్న చొరవ అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం మనం బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నందువల్ల మన దేశ, యువత, మానవ వనరుల శక్తిని ఇలాంటి సదస్సుల ద్వారా వ్యక్తీకరించవచ్చునని, ఇలాంటి సదస్సులు దేశానికి చాలా ఉపయోగపడతాయని అన్నారు. మరే దేశానికీ లేని విలువైన ‘యువశక్తి’ భారత్‌కు ఉందని, అనేక సవాళ్ళను ఎదుర్కోవడంలో యువత పాత్ర భారత్‌కు చాలా కలిసొచ్చే అంశమని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారత్ చాలా సమర్ధవంతమైన తీరులో వ్యవహరిస్తూ సంతృప్తికర ఫలితాలను సాధించిందని అన్నారు. అమెరికా కాన్సుల్ జనరల్ కాథరిన్ బి హడ్డా మాట్లాడుతూ, భారతదేశం నుంచి హెచ్చు సంఖ్యలో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్లను, టెక్నోక్రాట్లను, అక్కడ పరిశ్రమలను స్థాపించిన పారిశ్రామికవేత్తలను పరిగణనలోకి తీసుకోకుంటే ఇప్పుడు మనం ‘సిలికాన్ వ్యాలీ’ గురించి గొప్పగా మాట్లాడుకునేవారమే కాదని వ్యాఖ్యానించారు. ఏ దేశ ఆర్థిక వృద్ధికైనా అంకుర పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలో చోదకశక్తి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటి కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ, సాంకేతికరంగంలో సృజనాత్మకతకు యువతే కీలక శక్తి అని, ఆర్థిక దౌత్యపర సంబంధాల్లో ‘బ్రాండ్ అంబాసిడర్’లుగా ఉన్నవారిలో యువతీ యువకులే ఎక్కువగా ఉన్నారని గుర్తుచేశారు. సమీప భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాల్లో తెలంగాణ చాలా క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తోందని, రాష్ట్రంలో ఇందుకు గణనీయమైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వారికి ప్రోత్సాహం ఇచ్చే వాతావరణం ఉండడమే కారణమని అన్నారు. అంకుర పరిశ్రమలకు ఇప్పుడు మొత్తం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ‘రోల్ మోడల్’గా ఉందని, మరే నగరంలో కంటే హైదరాబాద్‌లో ఎక్కువ ఇన్‌క్యుబేటర్స్ ఉన్నాయని, ఒకేచోట పరస్పర సహకారంతో పనిచేస్తున్న వివిధ రంగాలకు చెందిన అంకుర పరిశ్రమలు కూడా ఉన్నాయని అన్నారు. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞాన యుగంలో మానవాళి దైనందిన జీవితంలో టెక్నాలజీ, సృజనాత్మకత గణనీయమైన పాత్రను పోషిస్తున్నాయని గుర్తుచేశారు.