Saturday, April 20, 2024

మరో తిరోగమనం!

- Advertisement -
- Advertisement -

The Economy in recession

 

దేశ పాలకుల ప్రాధాన్య క్రమంలోని లోపాలే మన ఆర్థిక వ్యవస్థ పుట్టిని ముంచి వేస్తున్నాయనే అనుమానం బలపడడానికి అవకాశమిచ్చే పరిణామాలు తరచూ సంభవిస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను వ్యవస్థను ఆవిష్కరించిన తీరు దేశ ఆర్థిక రంగాన్ని పుంజుకునేలా చేయడానికి బదులు దానిని మరింత బలహీనపరిచాయనే అభిప్రాయం ఉన్న సంగతి తెలిసిందే. అందుకే కరోనా దాపురించక ముందు నుంచే మన ఆర్థిక వ్యవస్థ గాయపడిన పక్షిని తలపించడం ప్రారంభించిందనే విమర్శ నిపుణుల నుంచి వినవచ్చింది. చైనాతో సరే, బాగుపడడంలో పొరుగునున్న అతి చిన్న దేశం బంగ్లాదేశ్‌తోనూ కొన్ని సందర్భాల్లో పోటీ పడలేకపోతునామని చాటే గణాంకాలు ఇంతకు ముందే వెలువడ్డాయి.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిగట్టుకొని అవధులు మీరి దేశాన్నంతటినీ ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగిస్తున్నప్పటికీ ఆర్థిక రంగంలో వెనుకడుగులు ఆగకపోడం, మేకిన్ ఇండియా వంటి చొరవలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోడం కళ్లముందున్న కఠోర వాస్తవాలే. కరోనా లాక్‌డౌన్‌లో స్తంభించిపోయిన పారిశ్రామిక వాణిజ్య కార్యకలాపాలను పూర్వపు స్థాయికి పునరుద్ధరింప చేయడంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లక్షలాది కోట్ల రూపాయల ఉద్దీపన పథకాలు ఘోరంగా విఫలమై మాంద్యం ముంచుకు వచ్చే ప్రమాదం భయపెడుతున్నదనే ఆందోళన ఇప్పుడు వ్యక్తమవుతున్నది.

నిరుద్యోగం పెరుగుదల రేటు నవంబర్ నెలలో 7.5 శాతం వద్ద ఉన్నది. ఉత్పత్తి కార్యకలాపాలలోని కార్మిక శక్తి కనీవినీ ఎరుగని రీతిలో 42 శాతానికి పడిపోయింది. పర్యవసానంగా వినియోగ వస్తువులకు గిరాకీ తగ్గిపోయింది. కొత్త పెట్టుబడులు, అదనపు ఉద్యోగాల కల్పన దాదాపు ఆగిపోయాయి. అనేక ఆసియా దేశాల్లో ఎగుమతులు పుంజుకుంటుండగా మనవి మాత్రం ఈ ఏడాది ఏప్రిల్ నవంబర్ కాలంలో 17.74 శాతం మేరకు కుంగిపోయాయని తాజాగా వెల్లడైంది. గత మూడు మాసాల్లో వియత్నాం ఎగుమతులు 12 శాతం పెరిగాయి. ఒక్క అక్టోబర్ నెలలోనే చైనా ఎగుమతులు 11 శాతం వృద్ధి చెందాయి. నవంబర్‌లో దక్షిణ కొరియా తన ఎగుమతులను 4 శాతం పెంచుకోగలిగింది. కరోనా కారణంగానే మన ఎగుమతులు తగ్గుముఖం పట్టాయని చెప్పడం పరమ అబద్ధమవుతుందని ఈ దేశాల ప్రగతి రికార్డు రుజువు చేస్తున్నది. మన దేశం నుంచి ముడి సరుకు ఎగుమతి అవుతున్నంతగా మన తయారీ వస్తువులు, అదనపు విలువ ఉత్పత్తుల విదేశీ వాణిజ్యం పెరగడం లేదు. మన దగ్గరున్న ఇనుప ఖనిజం తదితర ముడి సరుకును దిగుమతి చేసుకొని ఇతర దేశాలు వస్తూత్పత్తిలో దూసుకుపోతుంటే అందులో మనం వెనుకబడిపోతున్నాం.

దేశంలో గల విశాలమైన మార్కెట్‌ను ఆకట్టుకోడంలోనైనా మన పారిశ్రామిక వాణిజ్య రంగాలు కృతకృత్యమవుతున్నాయా? చైనా వంటి దేశాల ఉత్పత్తులకు మన మార్కెట్‌లో ఉన్న విపరీతమైన డిమాండ్ దీనికి సరైన సమాధానం చెబుతున్నది. అంటే అదీ అంతగా వినిపించడం లేదు. సేవల రంగంలో తప్ప ఉత్పత్తిలో మన పురోగతి తక్కువే. మన సరకులకు తగిన గిరాకీ విదేశీ మార్కెట్లలో కొరవడడమో, ఎగుమతి ప్రధానమైన పారిశ్రామిక వాణిజ్య కార్యకలాపాలకు మన ప్రభుత్వం నుంచి మెరుగైన ప్రోత్సాహకాలు లభించకపోడమో జరుగుతున్నదని భావించవలసి ఉంది. ఎగుమతి వ్యాపారులు కట్టే సుంకాలు, పన్నుల విత్తాన్ని తిరిగి వారికి ఇచ్చివేసే ఒకే ఒక ప్రోత్సాహక విధానంపైనే మన ప్రభుత్వం ఆధారపడి ఉన్నదని అర్థమవుతున్నది. భారతదేశం తన వాణిజ్య ఎగుమతులకు అన్యాయమైన రీతిలో ప్రోత్సాహకాలు కల్పిస్తున్నదని అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేసింది. అందుచేత కేవలం ప్రోత్సాహకాల మీదనే దృష్టి పెట్టకుండా ఎగుమతి వ్యాపారులకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని సులభంగా కల్పించడం ఆయా వస్తువుల ఉత్పత్తి, రవాణా, విక్రయ దశలలో ఆ కంపెనీలకు తగిన తోడ్పాటు ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవలసి ఉన్నదని నిపుణులు భావిస్తున్నారు.

ఇటువంటి సౌకర్యాలు లేకపోడం వల్ల పెట్టుబడి ప్రియమైపోయి మన ఎగుమతి ప్రధాన వస్తూత్పత్తి అత్యంత ఖరీదుతో కూడినదైపోతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇతర దేశాల నుంచి వచ్చిపడే చవుక వస్తువుల పోటీని మనవి తట్టుకోలేకపోతున్నాయి. మన వజ్రాలు, నగలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజినీరింగ్ సామగ్రి ఎగుమతులు దారుణంగా పడిపోయాయని తెలుస్తున్నది. ఇనుప ఖనిజం, బియ్యం ఎగుమతులు బాగా పెరిగినప్పటికీ అవి మన వికాసానికి అంతగా తోడ్పడేవి కావు. అందుచేత అదనపు విలువ చేరిన వస్తువుల ఎగుమతులను పెంచుకోడానికి వినూత్నమైన మార్గాలను అన్వేషించాలి. అటువంటి కృషి మీద విధాన కర్తలు దృష్టిపెట్టడం లేదనిపిస్తున్నది. పాలకులు దేశంలో మత వైషమ్యాలు పెంచి రాజకీయంగా లాభపడడం మీద శ్రద్ధ తగ్గించి ఎగుమతులను పెంచుకోడం మీద ఆసక్తిని కనపరచవలసి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News