Home ఎడిటోరియల్ చేను మేసిన కంచె…!

చేను మేసిన కంచె…!

 Election Commission

 

ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విఘాతం కలుగుతున్నదనే అభిప్రాయానికి తావివ్వరాదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడానికి కొన్ని గంటల ముందు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం మన ప్రజా పాలక వ్యవస్థలో ఇంత వరకు ఎదురుకాని ఒక బాధాకరమైన స్థితిని ప్రతిబింబిస్తున్నది. పోలింగ్ ముగిసిపోయిన తర్వాత ఫలితాలు ప్రకటించే వరకు ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఇవిఎంలు) బాధ్యత, ప్రజల తీర్పుకి కీడు కలగకుండా చూడవలసిన కర్తవ్యం ఇసిదేనని ప్రణబ్ ముఖర్జీ ఆ లేఖలో పేర్కొన్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇవిఎంలపై తలెత్తిన గగ్గోలు ప్రణబ్ ముఖర్జీ లేఖకు తక్షణ ప్రేరణ అయి ఉండాలి. అంతేగాక ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఇవిఎంలలోని జనాభిప్రాయాన్ని తారుమారు చేసే ప్రమాదం గురించి ప్రతిపక్షం నుంచి తరచూ ఆందోళనలు వ్యక్తం కావడం కూడా ఆయన ఈ లేఖ రాయడానికి కారణమై ఉంటుంది. ప్రణబ్ ముఖర్జీ స్వయంగా కాకలు దీరిన రాజకీయ నేత కావచ్చు. కాని రాష్ట్రపతిగా, దేశ రాజ్యాంగాధినేతగా పని చేసిన నేపథ్యం ఆయన లేఖకు ప్రాధాన్యాన్ని కలిగిస్తున్నది. అందుకే ఇవిఎంలను దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు చేసే ఆరోపణకు వాటి విషయంలో జాగ్రత్త వహించాలని ప్రణబ్ ముఖర్జీ ఇసికి రాసిన లేఖకు తేడా ఉంది.

సుదీర్ఘ వ్యవధి తీసుకొని ఏడు విడతల్లో సాగిన 17వ లోక్‌సభ ఎన్నికల పొడుగునా ఇసి ఆరోపణ ఎదుర్కోని రోజంటూ లేదనడం అతిశయోక్తి కాదు. ఎన్నికల సంఘం మీద ఇంతగా ఆరోపణలు, విమర్శలు దూసుకు రావడం మన ఎన్నికల చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి. ప్రచార నియమోల్లంఘన మీద పరంపరగా ఫిర్యాదులొస్తున్నా ఇసి నిష్క్రియాపరత్వంతో చేతులు ముడుచుకొని కూర్చోడంపై ఒక దశలో సుప్రీంకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. తనకు న్యాయపరమైన అధికారాలు లేవని ఎన్నికల సంఘం బేలతనం ప్రదర్శించగా దాని ప్రతినిధిని పిలిపించుకొని అత్యున్నత న్యాయస్థానం దానికి ధైర్యం చెప్పవలసి వచ్చింది.

రాజ్యాంగంలోని 324వ అధికరణ కింద ఇసికి గల అపరిమిత అధికారాలను గుర్తు చేయక తప్పలేదు. ఆ తర్వాతే కొద్ది మంది నేతల ప్రచారంపై ఇసి నిషేధం ప్రయోగించింది. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలంటే ప్రధాని మోడీ ప్రచార నియమోల్లంఘనల విషయంలో ఎన్నికల సంఘం చూసీచూడనట్టు వ్యవహరించడం, కొన్నిసార్లు క్లీన్‌చిట్ ఇవ్వడం దేశ ప్రజల దృష్టికి బాగా వచ్చింది. సైన్యాన్ని, సర్జికల్ దాడులను ప్రధాని మోడీ తన సొంత ఖాతాలో వేసుకొని ఈ దేశ భద్రతకు తనకు మించిన రక్షకుడు ఉండడని ప్రచార ప్రసంగాల్లో చెప్పుకుంటుంటే ఇసి ప్రశ్నించలేకపోడం ప్రజలను, పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. సైన్యం జాతిది, దేశానిది. అది ఏ ఒక్క ప్రధాని లేదా రక్షణ మంత్రి సొంత దళం కాదు. పాలక పార్టీ ముల్లె అసలే కాదు.

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోల్‌కతా సభలో జరిగిన హింసాత్మక సంఘటనను పురస్కరించుకొని దేశ చరిత్రలో మొదటిసారిగా బెంగాల్‌లో ఒక రోజు ముందుగానే ప్రచారానికి తెర దించిన ఇసి చర్య తీవ్ర విమర్శలకు గురయింది. ఇవిఎంల విషయంలో ప్రతిపక్షాలు వాస్తవికమైన భయంతోనో, రాజకీయ దురుద్దేశంతోనో పదేపదే ఆందోళన వ్యక్తం చేసినప్పుడు వాటిని మొండిగా ఒక్క మాటతో తిరస్కరించడానికి బదులు ఓపికతో తగిన వివరణ ఇచ్చి సమాధాన పర్చిఉంటే బాగుండేది. లెక్కింపు సమయంలో ఒకటి కంటె ఎక్కువ వివిప్యాట్ (ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) స్లిప్పులను పరిశీలించాలన్న డిమాండ్‌ను కూడా ఇసి అదే పనిగా తిరస్కరిస్తూ వచ్చింది. చివరికి ప్రతిపక్షాలు ఆశ్రయించడంతో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఐదు వివిప్యాట్‌లలోని చీటీలను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇసి ముందుగానే ఇటువంటి నిర్ణయం తీసుకొని ఉంటే సుప్రీంకోర్టు వరకు వ్యవహారం వెళ్లి ఉండేది కాదు. ఇవిఎంల వివాదంపై ఇసి సమావేశంలో తన అసమ్మతిని రికార్డు చేయలేదని ఎన్నికల కమిషనర్లలో ఒకరైన అశోక్ లావాసా చేసిన ప్రకటన గమనించదగినది.

ఇలా ఇంటా బయటా ఎన్నడూ లేనంతగా ఈ కీలక ఎన్నికల ఘట్టంలో ఇసి భ్రష్టు పట్టిపోయింది. ప్రచార ఘట్టం పూర్తిగా ముగిసిపోయి తుది విడత పోలింగ్‌కు ఒక రోజు వ్యవధి ఉందనగా ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ గుహల్లో 17 గంటల పాటు ధ్యాన ముద్ర చిత్తగించడానికి ప్రధాని మోడీకి అనుమతి ఇవ్వడం ఆ దృశ్యాలు మీడియాలో రాకుండానైనా చూడలేకపోడం ఇసిపై మరో విమర్శనాస్త్రానికి అవకాశమిచ్చింది. పార్లమెంటు, సుప్రీంకోర్టు తర్వాత అంతటి స్వతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల సంఘం నిష్పాక్షికత తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేసుకునేలా చూడవలసిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రియుల మీద ఉంది.

The Election Commission should Fulfill its Duty