Home లైఫ్ స్టైల్ ఏకవీర నాట్యధీర

ఏకవీర నాట్యధీర

ప్రస్తుతం ఒక రంగంలో రాణించడమే కష్టం. అందులోనూ మహిళలు రెండు రంగాల్లో రాణించడమంటే కత్తిమీద సాములాంటిదే. అలాంటిది జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో నర్సుగా పనిచేస్తూ రోగులకు సేవలందిస్తూనే తాను ఇష్టపడి నేర్చుకున్న కూచిపూడి నృత్యాన్ని పలువురికి నేర్పించాలనే తపనతో ‘నృత్యమాల అకాడమీ’ని స్థాపించి చిన్నారులకు నృత్యాన్ని నేర్పిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది. కూచిపూడి నృత్యంలో పలు ప్రదర్శనలిస్తూ, తన శిష్యులతోనూ ఉత్తమమైన కళారూపాల్ని ప్రదర్శింపజేస్తోంది. ఆమె ప్రతిభకు, పడుతున్న కష్టానికి తగిన గుర్తింపుగా గౌరవ డాక్టరేట్‌తో పాటు పలు అవార్డులు దక్కాయి. జోడు రంగాల్లో రాణిస్తున్న ‘ఏకవీర’పై ‘మనతెలంగాణ’ ప్రత్యేక కథనం.

Eka-Veera-Dance

వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన ఏకవీరకు చిన్నప్పటి నుంచీ నృత్యమంటే ఆసక్తి. తల్లిదండ్రులు దేవి, కిషన్‌లు వ్యవసాయదారులు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. నలుగురి సంతానంలో ఒక్కతే ఆడపిల్ల. ఆమె ఆసక్తిని గమనించిన సమీప బంధువులైన నిర్మల, దయానందరావ్‌లు ఆమెను నృత్యం నేర్చుకోవడంలో ప్రోత్సహించారు. కూచిపూడి నృత్య గురువైన బి.సుధీర్‌రావు వద్ద ఐదేళ్ల చిరుప్రాయం నుంచి సాధన ప్రారంభించింది ఏకవీర. పలు జిల్లా, రాష్ట్ర స్థాయి వేదికలపై ప్రదర్శనలిచ్చి అందరి మన్ననలు పొందింది. బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది. రాజీవ్ గాంధీ వైద్య కళాశాల(రిమ్స్)లో నర్సుగా ఉద్యోగాన్ని ఆరంభించింది. అంతటితో ఆగకుండా కూచిపూడిలో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా సాధించింది. అనంతరం భర్త వీరేష్ సహకారంతో జిల్లా కేంద్రంలోని గోపాలకృష్ణమఠంలో ‘నృత్యమాల అకాడమీ’ని స్థాపించి ఔత్సాహిక విద్యార్థులకు కూచిపూడి, భరతనాట్యం, పేరిణి, తెలంగాణ జానపద నృత్యాలలో ఓనమాలు నేర్పుతోంది. క్రమం తప్పకుండా సాధన చేస్తూ చిన్నారులకు నాట్యంలో మెళకువలను నేర్పిస్తూ నృత్యంలో మమేకం కావడమే తన విజయ రహస్యమంటోంది. తన వద్దకు వచ్చే విద్యార్థులతో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కర్నూల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల్లో, దేశ రాజధానిలో సైతం ప్రదర్శనలిప్పిస్తున్నారు. అనేక అవార్డులను దక్కించుకొని చిన్నారుల తల్లిదండ్రులచే శభాష్ అనిపించుకుంటోంది. ఇటు రిమ్స్‌లో నర్సుగా రోగులకు మెరుగైన సేవలందిస్తూ మన్ననలు అందుకుంటోంది.

నృత్యంలో డాక్టరేట్…

జిల్లాతో పాటు వివిధ రాష్ట్రాలలో అత్యుత్తమ ప్రదర్శనలిస్తూ ఎన్నో అవార్డులు దక్కించుకొని శభాష్ అనిపించుకుంటున్న ఏకవీర ఐక్యరాజ్యసమితిలోని 77 దేశాల ఆమోదం పొందిన అకాడమి ఆఫ్ యూనివవర్సల్ గ్లోబల్‌పీస్ ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చి 4న బెంగుళూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నృత్యంలో గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకుంది. దేశంలోని ఏ ప్రాంతంలో ప్రదర్శనలిచ్చినా ఏకవీరతో పాటు ఆమె శిష్యబృందం ప్రత్యేకతను చాటుకుంటూ అవార్డులను దక్కించుకుంటూ జిల్లాలోని కళాభిమానుల మన్ననలు అందుకోవడం విశేషం. ఇక ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం న్యత్యంపై ఉన్న మక్కువతో పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది చిన్నారులకు నామమాత్రపు ఫీజుతో నాట్యంలో మెళకువలు నేర్పుతూ క్రమం తప్పకుండా సాధన చేయిస్తూ వివిధ ప్రాంతాలలో జరిగే వేడుకలు, పోటీలలో భాగస్వామ్యులను చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఓపికున్నంత వరకు నాట్యంపై ఆసక్తి ఉన్న చిన్నారులకు నేర్పిస్తానంటోంది.

అందుకున్న అవార్డులు..

 • గిన్నిస్ బుక్ ఆఫ్‌రికార్డులో చోటు
 • గురుశ్రీ, రాజహంస, కళాసాగర్, నాగార్జున అర్ధ శతాబ్ది అవార్డ్
 • గోదావరి పుష్కరాల అవార్డు
 • తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్
 • తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్
 • నృత్యగురు అవార్డ్
 • కిడ్స్‌బుక్ ఆఫ్ రికార్డ్

వివిధ రంగాల్లో ప్రతిభ

 • కూచిపూడిలో నాట్యమయూరి అవార్డు, గోల్డ్‌మెడల్
 • దూరదర్శన్‌లో ‘బి గ్రేడ్’ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
 • 26 జనవరి, 2008న ఢిల్లీలో జరిగిన పరేడ్‌లో నృత్య ప్రదర్శనకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.
 • హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఆల్‌ఇండియా కూచిపూడి పోటీల్లో ప్రథమ స్థానం సాధించారు.
 • హైదరాబాద్‌లో నిర్వహించిన కోటి దీపోత్సవంలో తెలంగాణ బోనాలు, కూచిపూడి, భరతనాట్యంలో ప్రదర్శనలిచ్చి మన్ననలు పొందారు.
 • గచ్చిబౌలి స్టేడియంలో ‘సిలికానాంధ్ర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్’లో పాల్గొన్నారు.
 • ఆదిలాబాద్ జిల్లాలో కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
 • గోదావరి పుష్కరాల సందర్భంగా బాసరలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలిచ్చారు.
 • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ప్రదర్శనలిస్తూ ఆకట్టుకుంటున్నారు.
 • ఢిల్లీలో జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలో భాగస్వామ్యులయ్యారు.
 • బెంగుళూర్‌లో జరిగిన జానపద నృత్య ప్రదర్శనలో శిష్యులతో కలిసి పాల్గొన్నారు.