Saturday, April 20, 2024

క్యూబన్ తొలి విప్లవకవి హోజె మార్తి

- Advertisement -
- Advertisement -

The first Cuban revolutionary was Ho J Marty

 

నీవు గాని ఓ కొండంత సముద్రపు అలల నురగను చూచి ఉంటే, నీవు చూచింది నా కవిత్వమే; అదివింజామరై విచ్చుకుంటున్న నా కవన పర్వతం- హోజె మార్తి. హోజె మార్తి కేవలం కవి మాత్రమే కాదు; అతను ఒక స్వాతంత్య్ర సమర యోధుడు. ఒక గొప్ప రచయిత, జర్నలిస్ట్, అనువాదకుడు, విప్లవాత్మక తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, పత్రికా సంపాదకుడు. స్పానిష్ సామ్రాజ్య వలస దుష్పరిపాలన నుండి తన దేశాన్ని విముక్తి చేసేందుకు కలంతో పాటు కత్తి దూసిన క్యూబా దేశ నాయకుడు – క్యూబన్ నేషనల్ హీరో.

విప్లవ శంఖం ఊదిన తొలి వైతాళికుడు. Apostle of Cuban Independence గా, లాటిన్ అమెరికన్ సాహిత్యాకాశంలో ధ్రువతారగా చరిత్రలో నిలిచిపోయాడు. హోజె మార్తి పూర్తి పేరు Jose Julian Marti y Perez. జనవరి 28, 1853 న క్యూబాలోని Havana లో జన్మించి మే 19, 1895 న dos Rios లో మరణించాడు. దేశ స్వాతంత్య్రం కోసం తోటి లాటిన్ అమెరికన్ దేశాలను కూడదీసి, సమరవ్యూహాన్ని రచించి యుద్ధభూమిలో 42ఏట అమరుడయ్యాడు. గొంతెత్తిన స్వాతంత్య్రేచ్ఛా పర్యాయపదమై చరిత్రలో నిలిచిపోయాడు.

విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే The Free Fatherland అనే పత్రికను స్థాపించి, పదహారేళ్ల వయసులో తన విప్లవ గీతాలు ప్రచురించాడు. పర్యవసానంగా అతనికి ఆరు నెలల కఠిన కారాగార శిక్షపడింది. దేశ బహిష్కరణకు గురియై స్పెయిన్ దేశానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడే ఎం.ఎ చదివి, న్యాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకొని, విస్తృతంగా పొలిటికల్ వ్యాసాలు రాసి రగులుతున్న క్యూబా ఉద్యమానికి ఆజ్యం పోశాడు. కొన్నాళ్లు ఫ్రాన్స్, మెక్సికో, గౌటమేలాలో గడిపి 1878లో స్వంత దేశానికి తిరిగి వచ్చాడు. నిరంతరంగా ఉద్యమ కార్యక్రమాలు నెరపుతున్నందున అతనికి మళ్లీ దేశ బహిష్కరణ తప్పలేదు. అతన్నిమళ్లీ స్పేన్‌కు పంపించారు. అక్కడి నుండి కొన్నాళ్లు వెనిజ్వేలాకు వెళ్ళి, అక్కడ కూడా క్రాంతి భావాల Venezuelan Review పత్రికను నడిపినందున, అక్కడి నియంత Antonio Guzman Blanco హోజె మార్తిని న్యూయార్క్ సిటీకి వెళ్లగొట్టాడు. అతని చివరి దశ అక్కడే గడచిపోయింది.

హోజె మార్తి ఒక తండ్రి జైలు గార్డ్. అతని ఎనిమిది బిడ్డల సంతానంలో మార్తి మొదటి వాడు. స్కూల్లో పేంటింగ్, శిల్పం చదువుకున్నాడు గాని సాహిత్యమే అతని ప్రవృత్తి అయింది. అతని కవిత్వం, నవలలు, వ్యాసాలు అన్నీ విప్లవ ధోరిణిలోనే నడిచాయి. మిత్ర దేశమైన ఉత్తర అమెరికా ప్రమేయం సైతంలేని సంపూర్ణ స్వదేశ విముక్తి అతని జీవన ధ్యేయం. లాటిన్ అమెరికన్ దేశాలన్నింటికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వం ఉండాలని కలలు కన్నాడు. ప్రొఫెసర్ గాకొన్నాళ్లు, పలు లాటిన్ అమెరికన్ దేశాల రాయబార సభ్యునిగా కొన్నాళ్లు పని చేసినా, అతని జీవితం అంతా ఉద్యమబాటలో సాగిన సాహిత్య సమరంగానే కొనసాగింది. మెక్సికో లో ఉంటున్న కాలంలో Carmen Zayas తో వివాహం జరిగింది. ఆమె ఒక స్పానిష్ బహికృత కుటుంబానికి చెందింది. వాళ్లకు ఒక కొడుకు. పేరు Joss Francisco ‘Pepito’ Mart&. అతని తల్లి Mar&a Mantilla ప్రఖ్యాత హాలీవుడ్ నటి.

ఇక్కడ, నాటి అమెరికాల పై స్పానిష్ దురాక్రమణదారుల (Conquistadors) ల అతిక్రమణ, స్పేను వలసవాద సామ్రాజ్య విస్తరణ నేపథ్యం ఒకింత తెలుసుకోవడం సందర్భోచితం అనుకుంటాను. 1492 లో కోలంబస్ రాకతో మొదలైన ఆక్రమణ, స్పేన్ సామ్రాజ్య ప్రభుత్వ ఆధిపత్యం కిందకు రాగానే మరింత విశృంఖలంగా విజృంభించింది. క్రమంగా, బ్రెజిల్, కొన్ని కరేబియన్ ప్రాంతాలు తప్ప, మొత్తం ఉత్తర దక్షిణ అమెరికా దేశాలన్నింటినీ స్పేన్ సామ్రాజ్యం కైవసం చేసుకుంది. దేశ సంపదలను కొల్లకొట్టడం, కాథలిక్ మతాన్ని విస్తరించడం వాళ్ల ధ్యేయం.

మూలవాసులను అతిక్రూరంగా హింసించడం, అమానుష స్లేవ్ ట్రేడ్ నిరంతరం కొనసాగించడం మామూలై పోయింది. కొద్ది కాలంలోనే అసంఖ్యాక స్పేనీయులు అమెరికాలలో స్థిరపడిపోయారు. వాళ్లు తెచ్చిన కొత్త రోగాల బారినపడి ఎందరో మూలవాసులు మరణించగా, వాళ్ల జనాభా గణనీయంగా తగ్గిపోయింది. ఇలా, స్పేన్ సామ్రాజ్యం 300 సంవత్సరాల పాటు అమెరికా భూఖండాలను నిరంకుశంగా గుప్పెట్లో పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఎదుగుతున్న హోజె మార్తి ఉడుకు రక్తం కలం దూసింది. పిన్న వయసులోనే ఉద్యమ కవితలను, ప్రేరణాత్మక సంపాదకీయాలు, వ్యాసా లు ప్రచురించాడు. లీగల్ సమస్యలను ఎదురొడ్డి, స్వదేశ స్వాతంత్య్రం కోసం స్పేన్ సైన్యంతో సాగిన ‘పదేళ్ల యుద్ధం’ (The Battle of dos Rio)లో అసువులు బాశాడు. కాల గమనంలో వలస కాలనీలు Spanish American wars of Independence వల్ల ఒక్కొక్కటిగా విముక్తి పొందాయి. 1898 లో ఉత్తర అమెరికా సారథ్యంలో (Spanish- American War) సాగిన అంతిమ సంగ్రామంతో మూడు శతాబ్దాల స్పానిష్ నియంతృత్వం ముగిసింది.

హోజె మార్తి రాజకీయ ఉద్వేగ రచనలు ఉద్యమానికి ఆద్యంతం జీవ స్ఫూర్తిని అందించాయనటంలో సందేహం లేదు. అతని విప్లవ భావజాలం, క్యూబా అగ్రనేత Fidel Castro ను కూడా ప్రభావితం చేసింది. పాతుకు పోయిన బానిస విధానాన్ని( Slavery) రద్దు చేసిన Abraham Lincoln అతని ఆదర్శం. బానిసత్వంలేని సంపూర్ణ స్వేచ్ఛాయుత స్వరాజ్యం ఆతని స్వప్నం. హోజె మార్తి అనేక వ్యాసాలు, కవితలు, నవలలు, లేఖలు రాశాడు. అనువాదాలు చేశాడు. పిల్లల మాగజైన్‌లు, పలు రాజకీయ పత్రికలు స్థాపించాడు. ఆనాటి అభినవ సాహితీ ఉద్యమం Modernismo కు అతని ఎంతో దోహదం చేశాడు. అతని అన్ని రచనలలో స్వేచ్ఛా స్వాతంత్య్ర పిపాస క్యూబా రాజకీయ మౌలిక వస్తువుగా భాసించింది. నికరాగువా కవి Rube dario, చిలీదేశ కవయిత్రి Gabriela Misral లాంటి తదనంతర కరేబియన్ కవులకు స్ఫూర్తిదాయకమయింది. అతనొక గొప్ప వక్త. స్పానిష్ మాత్రమేగాక, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్, లాటిన్, గ్రీకు భాషలు తెలిసిన బహుభాషాకోవిదుడు. అతని రచనలు సామాన్య జాతీయాల నీతివచన సూత్రోక్తులతో (Aphorisms) నిండి ఉంటాయి.

ఇవిగో, ఇవి అందుబాటులో ఉన్న అతని కొన్ని కవితలకు నా అనువాదాలు:
1. దివారాత్రాలు / నేను కళ్ళు తెరచుకునే కలలు కంటాను /నురుగులెట్టే కల్లోల కడలి కెరటాల మీదుగా/ విస్తరిస్తున్న ఎడారి సైకతాల మీదుగా / శ్రేష్ఠ సామ్రాట్టంటి/ నా హృదయ కేసరి మృదుల కంఠంపై ఎక్కి / నేను సంతోషంగా స్వారిచేస్తుంటాను/ నా ముందు నన్ను పిలుస్తూ ఓ బాలిక / సదా తేలిపోతూ కనిపిస్తుంటుంది.

2. నేను ఈ ప్రపంచ ద్వారాల గుండా / సహజ సులభంగా దాటి పోవాలనుకుంటాను/ వాళ్ళు నన్ను రాజద్రోహిలా చీకట్లో చావమని / పచ్చనాకుల నా గోరీలోకి తరలించాలనుకుంటారు/ నేను మంచి వాణ్ణి, మంచిగానే మరణిస్తాను/ సూర్యుని కేసి సగర్వంగా శిరసెత్తుకొని.

3. స్నేహ హస్తం సాచే సిసలైన మిత్రుని కోసం /నా వద్ద ఓ తెల్లగులాబీ వుంది/ జులైలోనూ, జనవరిలోనూ/ అతనికి అదే పూవును అర్పిస్తాను / నా మనసును ముక్కలు చేసే దుష్టునికి సైతం / ముళ్ళను గాని, ముళ్ళ పూలను ఇవ్వను/ ఆ తెలుపు రంగు రోజానే అందిస్తాను.

4.ఆనాడు ఆ ఉదయాన / ఆ పొదరిల్లు కొత్తగా చిగిర్చిన / పచ్చనాకును మరువలేను/ ఆ తియ్యని ఉదయాన / మంటలారిన కుంపటంటి / ముసలయ్య పక్కన నిలిచి / ఆసరాను కోరుకుంటున్న / ప్రణయమగ్న నవయువతిని / ఏనాడూ మరువలేను.

5. The Girl of Guatemala
నీడరెక్కల కింద నిలిచిన పువ్వులా / నేను ఈ కథ చెబుతాను/ ప్రేమకు బలియైన గౌటమేలా కన్య కథ! / తెల్లమల్లెల, లిల్లీపూల సిల్కు పేటికలో పెట్టి/ మేము ఆమెను పూడ్చేశాం/ ఆమె తనను మరచిన మనుషుల కోసం / ఓ పరిమళాల పొట్లాన్ని విడిచి వెళ్ళింది! / అతనొచ్చాడు/ కొత్త వధువు పూల ఊరేగింపులో / ఊరి పెద్దలు, బిషప్ లు, దౌత్య దూతలు! / అతన్ని చూడాలని ఆమె బాల్కనీలోకి వచ్చింది/ అతనొచ్చాడు సతీసమేతంగా! / తెల్లారే సరికల్లా ఊరి చెరువులో ఆమె శవమై తేలింది/ ఆ భగ్నప్రేయసి ప్రేమ వంచనలో మరణించింది.
6. Two Homelands ; (dos Patrias)

చీకటి రాత్రీ, క్యూబా/ రెండూ నా జన్మభూములు/ సూర్యుని రాజతేజం సమసి పోగానే / నా ముందు తిమిర తెరలు వేలాడుతుంటవి/ నా చేతిని రక్తపుష్పం గుచ్చుకుంటుంది/ నోరాడని నా క్యూబా / విషాద గవాక్షమై నా ముందు నిలుస్తుంది/ నా చేతిలో రుధిర కుసుమం వణకుతుంటుంది/ చీల్చబడిన నా చిరిగిన ఎదభూములలో / శూన్యం నిండుకుంటుంది/ఇది నిశ్శబ్దంగా నిష్క్రమించాల్సిన రాత్రి/ మెల్లమెల్లగా మరణించాల్సిన నిశీథిని/ మాటల మధ్య మసక వెలుగు!/ మనిషి కన్నా ఆకాశమే నయం!/ దీపశిఖల యుద్ధ పతాకం పిలుస్తుంటుంది/ నాలోని కిటికీ కొంచెం కొంచెం మూసుకుంటుంది/ నా చేతిలోని నెత్తుటి రంగుల కుంకుమ పూవు / రిక్కలు రిక్కలుగా రాలి / మబ్బుల నింగిలో నీలి మబ్బై కమ్ముకుంటుంది/ నా మూగ క్యూబా గవాక్షం / మునిచీకట్లోకి కనుమరుగైపోతుంది.

హోజె మార్తి త్యాగనిరతికి నివాళిగా క్యూబా అతని జన్మదినాన్ని జాతీయ దినంగా ప్రకటించుకుంది. పోస్టల్స్టాంపులు విడుదల చేసింది. హవానా ముఖ్య ఏర్ పోర్ట్ కు Jose Marti International Airport పేరు పెట్టుకునానారు. నేటికీ క్యూబా అతన్ని జాతీయ ఉద్యమ పితగా సంభావిస్తూ వస్తున్నది. డిల్లీ లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో అతని విగ్రహంఉందంటారు. సుమారు ఓ శతాబ్దానంతరం, ఫీడల్ కాస్ట్రో, క్యూబాలో ఉన్న హోజ్ మార్తి విగ్రహం ముందు నిలిచి గొరిల్లాయుద్ధాన్ని ప్రారంభించాడట. క్యూబా జాతీయ చరిత్రలో చిరకాలం నిలిచిపోయే అత్యంత శ్లాఘనీయమూర్తి హోజె మార్తి. లాటిన్ అమెరికన్‌ఆకాశంలో చిరస్థాయిగా జ్వలించే ధ్రువనక్షత్రం హోజె మార్తి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News